Punjab Celebrity Aid: పంజాబ్‌లో వరద బాధితులకు అండగా సెలబ్రిటీలు.. రూ.5 కోట్ల విరాళం ప్రకటించిన అక్షయ్ కుమార్
ABN , Publish Date - Sep 05 , 2025 | 09:40 PM
పంజాబ్‌లో వరద బీభత్సం బారిన పడ్డ బాధితులను ఆదుకునేందుకు రాష్ట్రానికి చెందిన సెలబ్రిటీలు నడుం కట్టారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు వరద బాధితుల సహాయార్థం రూ.5 కోట్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఇది విరాళం కాదని, సేవ అని వ్యాఖ్యానించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవలి అకాల వర్షాలు, వరదలతో తీవ్ర కష్టాల్లో్ కూరుకుపోయిన పంజాబ్ ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్రానికి చెందిన పలువురు సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ వరద బాధితుల కోసం రూ.5 కోట్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు (Akshay Kumar ₹5 crore donation).
వరద బాధితులకు అండగా ఉండేందుకు ఈ మొత్తాన్ని ఇస్తున్నట్టు అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. ఇది విరాళం కాదని, సేవ అని పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో బాధితులకు సేవ చేసే అవకాశం తనకు రావడం భగవంతుడి దీవెనగా భావిస్తున్నానని తెలిపారు. క్షతగాత్రులకు ఉపశమనం కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని జాతీయ మీడియాకు తెలిపారు. త్వరలో విపత్తు సమసిపోయి ప్రజలకు సాంత్వన కలగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు (Punjab floods celebrity Aid).
ఇక పంజాబ్ వరద బాధితులను ఆదుకునేందుకు టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) కూడా ముందడుగు వేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం 10 పడవలను విరాళంగా ఇస్తున్నట్టు మంగళవారం ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన సందర్శించారు. క్షతగాత్రుల సహాయం కోసం సమిష్టిగా ముందుకు రావాలని అన్నారు.
పంజాబ్ వరద బాధితులకు 200 ఇళ్లు నిర్మించి ఇస్తానని స్థానిక నటుడు, గాయకుడు అయిన ఏమీ విర్క్ పేర్కొన్నారు. పంజాబ్ ప్రజలు కష్టాల్లో ఉన్న నేపథ్యంలో తన మూవీ విడుదలను వాయిదా వేసుకున్నట్టు తెలిపారు. మరో నటుడు సతీందర్ సర్తాజ్ కూడా వరద బాధితులకు నిత్యావసర వస్తువులు, పశువులకు దాణా వంటి వాటిని అజనాలా, ఫెరోజ్‌పూర్, ఫజిల్కా జిల్లాల్లో పంపిణీ చేశారు. ప్రముఖ పంజాబీ సింగర్ దల్జిత్.. మాఝా ప్రాంతంలోని 10 గ్రామాలను దత్తత తీసుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని ప్రముఖ నటుడు సోనూ సూద్ (Sonu Sood) కూడా ఎక్స్ వేదికగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక, బాలీవుడ్ స్టార్‌లు అనేక మంది పంజాబ్ వరద బాధితులకు ఎక్స్ వేదికగా సంఘీభావం తెలిపారు.
ఇవి కూడా చదవండి
భారత్‌లో తొలి టెస్లా కారు డెలివరీ.. కస్టమర్ ఎవరంటే..
భారత్‌ను ముక్కలు చేయాలంటూ పోస్టు.. ఆస్ట్రియా ఆర్థికవేత్త ఎక్స్ అకౌంట్‌పై నిషేధం
For More National News and Telugu News