Share News

Madhav Tiger Reserve: భారత్ ఆ విషయంలో చాలా గొప్పది: ప్రధాని మోదీ..

ABN , Publish Date - Mar 09 , 2025 | 06:26 PM

భారతదేశం వన్యప్రాణుల వైవిధ్యానికి నిలయమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రకృతితో మమేకమై వన్యప్రాణులను పూజించే సంస్కృతి మనదని చెప్పారు.

Madhav Tiger Reserve: భారత్ ఆ విషయంలో చాలా గొప్పది: ప్రధాని మోదీ..
Madhav Tiger Reserve

ఢిల్లీ: వణ్యప్రాణుల సంరక్షణలో భారతదేశం ఎల్లప్పుడూ ముందుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాధవ్ నేషనల్ పార్కును టైగర్ రిజర్వ్ జోన్ చేయడంపై ప్రధాని స్పందించారు. ఈ సందర్భంగా జంతు ప్రేమికులకు ఇదో శుభవార్త అని ఆయన చెప్పుకొచ్చారు. భారతదేశం వన్యప్రాణుల వైవిధ్యానికి నిలయమని ప్రధాని అన్నారు. ప్రకృతితో మమేకమై వన్యప్రాణులను పూజించే సంస్కృతి మనదని చెప్పారు. ప్రకృతి, జంతువులను రక్షిస్తూ భూమిని సురక్షితమైన గ్రహంగా ఉంచేందుకు భారత్ ఎప్పుడూ ముందు వరసలో ఉంటుందని చెప్పుకొచ్చారు. మాధవ్ టైగర్ రిజర్వ్ ఫారెస్టుకు సంబంధించి కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ చేసిన ట్విట్‍ను ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాకు జత చేశారు.


కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ ట్వీట్..

భూమిపై పర్యావరణ వైవిధ్యాన్ని పునరుద్ధరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చారిత్రాత్మక ప్రాధాన్యం ఇస్తున్నారని కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ కొనియాడారు. ప్రధాని కృషితో పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణలో భారత్ గొప్ప పురోగతిని సాధిస్తోందని ప్రశంసించారు. మధ్యప్రదేశ్‌లోని మాధవ్ నేషనల్ పార్కును టైగర్ రిజర్వ్‌గా ప్రకటించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.


దీంతో దేశవ్యాప్తంగా టైగర్ రిజర్వ్‌ జోన్ల జాబితా 58కి చేరిందని తెలిపారు. అలాగే మధ్యప్రదేశ్‍లో ఇది తొమ్మిదోదని చెప్పారు. ఈ సందర్భంగా వన్యప్రాణి ప్రేమికులు, పరిరక్షకులను అభినందిస్తున్నట్లు కేంద్రమంత్రి చెప్పారు. ఈ అభివృద్ధి నిస్వార్థంగా, అవిశ్రాంతంగా పనిచేస్తున్న అటవీ అధికారుల కృషికి నిదర్శనమని భూపేంద్ర యాదవ్ చెప్పారు. దీనికి సంబంధించిన ట్విట్‍ను ప్రధానికి కేంద్రమంత్రి ట్యాగ్ చేయగా.. మోదీ సైతం రీట్వీట్ చేస్తూ రిప్లై ఇచ్చారు.


కాగా, ఇటీవల ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకుని గిర్‌ అభయారణ్యంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా ఆసియా సింహాల ఆవాసాలను కాపాడేందుకు స్థానిక గిరిజనులు, మహిళలు చేస్తున్న కృషిని కొనియాడారు. వారందరి కృషి వల్లే ఆసియా సింహాల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ప్రశంసించారు. ఈ సందర్భంగా లయన్‌ సఫారీ చేశారు. అలాగే వంతారా జంతు సంవర్షణ కేంద్రాన్ని సందర్శించిన ప్రధాని అక్కడి జంతువులను మచ్చిక చేసుకున్నారు. పులి, సింహం పిల్లలను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఆడించారు. వాటికి పాలు, ఆహారం అందించారు. తన పర్యాటనకు సంబంధించిన చిత్రాలను కెమెరాలో బంధించి వాటిని తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

MK Stalin meet MPs: పార్లమెంట్ సమావేశాల వేళ డీఎంకే ఎంపీలతో స్టాలిన్ అత్యవసర భేటీ.. ఆ అంశాలపై దిశానిర్దేశం..

SSMB 29 Video Leak: రాజమౌళి, మహేశ్ బాబుకు షాక్.. ఎస్ఎస్ఎంబీ-29 వీడియో లీక్..

Updated Date - Mar 09 , 2025 | 06:37 PM