PM Modi: మావోలపై విజయం.. ప్రధాని ఇంట్రస్టింగ్ పోస్ట్..
ABN , Publish Date - May 21 , 2025 | 06:58 PM
మీ అద్భుతమైన విజయానికి కారణమైన దళాలను చూసి గర్విస్తున్నాం. మావోయిజం ముప్పును నిర్మూలించడానికి, ప్రజలకు శాంతి, పురోగతితో కూడిన జీవితాన్ని అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడింది అంటూ..

న్యూఢిల్లీ, మే 21: ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్‌లో బుధవారం జరిగిన మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఎక్స్ వేదికగా స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ.. మావోయిస్టులను నిర్మూలించిన భద్రతా దళాలను ప్రశంసించారు. ‘మీ అద్భుతమైన విజయానికి కారణమైన దళాలను చూసి గర్విస్తున్నాం. మావోయిజం ముప్పును నిర్మూలించడానికి, ప్రజలకు శాంతి, పురోగతితో కూడిన జీవితాన్ని అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడింది’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అంతకు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన పోస్ట్‌ని ట్యాగ్ చేస్తూ ప్రధాని ఈ పోస్ట్ చేశారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడ సరిహద్దు ప్రాంతాల్లో బుధవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 27 మంది నక్సల్స్ చనిపోయారు. భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టుల అగ్రనేత, నక్సల్ ఉద్యమానికి వెన్నెముక అయిన నంబాల కేశవ్ రావు అలియాస్ బసవరాజు ప్రాణాలు కోల్పోయాడు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిట ఇన్‌చార్జ్ మధు, మావోయిస్టు పత్రిక జంగ్ ఎడిటర్ నవీన్ కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు.
ప్రధాని మోదీ కంటే ముందు హోంమంత్రి అమిత్ షా కూడా ఎక్స్ వేదికగా కీలక పోస్ట్ చేశారు. నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఒక మైలురాయి విజయం సాధించామన్నారు. బుధవారం నాడు ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో జరిగిన ఆపరేషన్‌లో భద్రతా దళాలు 27 మంది భయంకరమైన మావోయిస్టులను మట్టుబెట్టారన్నారు. సీపీఐ-మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి, అగ్ర నాయకుడు నక్సల్ ఉద్యమానికి వెన్నెముక అయిన నంబాల కేశవ్ రావు అలియాస్ బసవరాజు మృతి చెందినట్లు అమిత్ షా ప్రకటించారు. నక్సలిజంపై భారత్ చేసిన మూడు దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదా కలిగిన నాయకుడిని మన దళాలు మట్టుబెట్టడం ఇదే మొదటిసారి అని అమిత్ షా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. మావోయిస్టులను హతమార్చిన ధైర్యవంతులైన భద్రతా దళాలు, ఏజెన్సీలను అభినందిస్తున్నానని అన్నారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పూర్తయిన తర్వాత.. 54 మంది నక్సలైట్లను అరెస్టు చేశామని.. 84 మంది నక్సలైట్లు లొంగిపోయారని అమిత్ షా పేర్కొన్నారు. మార్చి 31, 2026 లోపు నక్సలిజాన్ని నిర్మూలించాలని మోడీ ప్రభుత్వం సంకల్పించిందని హోంమంత్రి స్పష్టం చేశారు.
Also Read:
వారికి మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్
బలోచిస్థాన్ దాడిపై పాక్ ఆరోపణలకు భారత్ కౌంటర్
ఈ నీటితో ఇల్లు తుడిస్తే చాలా శుభప్రదం..
For More National News and Telugu News..