Superstar Rajinikanth: సూపర్ స్టార్ రజనీ పుట్టిన రోజు.. స్పెషల్ బర్త్‌డే విషెష్ తెలిపిన ప్రధాని మోదీ..
ABN , Publish Date - Dec 12 , 2025 | 11:38 AM
సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టిన రోజును పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా శుక్రవారం ఓ పోస్టు పెట్టారు. రజనీ కలకాలం ఎంతో ఆరోగ్యంగా ఉండాలని దేవుడ్ని ప్రార్థించారు.
ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ 75వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ రోజు( శుక్రవారం) దేశ వ్యాప్తంగా ఆయన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఫ్యాన్స్ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమిళనాట నిజంగా పండుగ వాతావరణం నెలకొంది. రజనీ కథ అందించటంతో పాటు హీరోగా నటించిన ‘పడయప్ప (తెలుగులో నరసింహ) ’ సినిమా రీరిలీజ్ అయింది. ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ ప్రేక్షకులు ‘పడయప్ప’ సినిమా చూడ్డం కోసం పోటీ పడుతున్నారు. ఇక సినీ, రాజకీయ ప్రముఖులు రజనీకాంత్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా రజనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
రజనీ కాలకాలం ఆరోగ్యంగా ఉండాలి: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ రజనీకాంత్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘గౌరవనీయులైన రజనీకాంత్ గారికి 75వ పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన నటన తరాలు ఎంతో మందిని ఆకర్షిస్తూ ఉంది. మరెంతో మంది అభిమానాన్ని చూరగొంది. ఆయన విభిన్న జోనర్స్‌లో.. విభిన్న పాత్రలు చేశారు. అవి ఓ మైలు రాయిగా నిలిచిపోయాయి. ఈ సంవత్సరం చాలా ప్రత్యేకం.. ఆయన సినిమా పరిశ్రమలోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. రజనీ కలకాలం ఎంతో ఆరోగ్యంగా ఉండాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను’ అని రాసుకొచ్చారు.
కండక్టర్ స్థాయి నుంచి సూపర్ స్టార్‌గా..
రజనీకాంత్ అసలు పేరు శివాజీ రావ్ గైక్వాడ్. ఆయనది కర్ణాటకకు చెందిన మరాఠీ కుటుంబం. 1970లలో ఆయన బస్ కండెక్టర్‌గా తన జీవితాన్ని ప్రారంభించారు. సినిమాల మీద ఆసక్తితో మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. దర్శక దిగ్గజం కే బాలచందర్ దృష్టిలో పడ్డారు. ‘అపూర్వ రాగాంగళ్’ అనే సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల పాటు విలన్ పాత్రలు చేశారు. తర్వాత హీరో అయ్యారు. తనదైన స్టైల్‌తో అతి కొద్ది కాలంలోనే సూపర్ స్టార్ అయిపోయారు. ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలు చేశారు. తమిళంతో పాటు కన్నడ, తెలుగు, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సినిమాలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు.
ఇవి కూడా చదవండి
వాళ్లిద్దరి ఫామ్ ఆందోళనకరంగానే ఉంది కానీ..!: టీమిండియా సహాయ కోచ్
జై పసుపు జెండా.. టీడీపీ ఖాతాలో ఒకే రోజు రెండు పీఠాలు