Share News

PM Modi: లక్షా 22వేల కోట్ల అణుశక్తి, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం

ABN , Publish Date - Sep 25 , 2025 | 05:26 PM

ప్రధాని మోదీ రాజస్థాన్‌లో రూ.1,22,100 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు గురువారం నాడు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మతో కలిసి దీన్‌దయాల్ ఉపాధ్యాయ జయంతి ఉత్సవాల్లో మోదీ పాల్గొన్నారు.

PM Modi: లక్షా 22వేల కోట్ల అణుశక్తి, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం
PM Modi

బన్స్వారా (రాజస్థాన్), సెప్టెంబర్ 25: భారత ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్‌లో రూ.1,22,100 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఈ ఉదయం రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మతో కలిసి పీటీ దీన్‌దయాల్ ఉపాధ్యాయ జయంతి ఉత్సవాల్లో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ.. దీన్ దయాల్ కు పుష్పాంజలి ఘటించారు.


అనంతరం రాష్ట్రంలో నిర్మించిన, నిర్మించబోతోన్న ప్రధాన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వీటిలో మహీ బన్స్వారా అణుశక్తి ప్రాజెక్టు కీలకమైంది. ఇది రూ.42,000 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో నాలుగు 700 మెగావాట్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు ఉంటాయి. ఇవి NPCIL డిజైన్‌లో అధునాతన భద్రతా ప్రమాణాలతో భారత్ లో తయారుకావడం విశేషం. 'ఫ్లీట్ మోడ్' చొరవతో ఇలాంటి 10 రియాక్టర్లను భారత్ నిర్మిస్తోంది. ఇది చవకైన, సురక్షితమైన, స్థిరమైన విద్యుత్ సరఫరాను అందిస్తుంది. అంతేకాక, పర్యావరణ పరిరక్షణ, అణుశక్తి రంగానికి ఇది ఎంతగానో ఊతమిస్తుంది.


దీంతోపాటు, రూ.19,210 కోట్ల విలువైన గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను కూడా మోదీ నేడు రాజస్థాన్‌ లో ప్రారంభించారు. ఫలోడీ, జైసల్మేర్, జాలోర్, సీకర్‌లో సోలార్ ప్రాజెక్టులను ప్రారంభించి బికానీర్‌లో మరొక సోలార్ ప్రాజెక్టుకు పునాది రాయి వేశారు. ఇవి భారతదేశాన్ని పరిశుభ్రంగా ఉంచడంతోపాటు, భారత శక్తి సామర్థ్యాన్ని పెంచి, కోట్లాది టన్నుల CO2 ఉద్గారాలను నిరోధిస్తాయి.

ఈ ప్రాజెక్టులు దేశ స్థిరమైన అభివృద్ధి, పర్యావరణ లక్ష్యాలకు కట్టుబడి ఉన్నాయని, ఇవి.. దేశ భవిష్యత్తును మార్చుతాయని మోదీ చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజస్థాన్‌ ముఖ్యమంత్రి.. రాష్ట్రంలో అభివృద్ధి త్వరగా జరుగుతుందని, ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో ఉపాధి, ఆర్థిక వ్యవస్థలు బలపడతాయని భజన్‌లాల్ శర్మ అన్నారు.


ఇవి కూడా చదవండి:

హెచ్-1బీ వీసాదారుల్లో 80 శాతం మాయం.. అమెరికన్లకు ఇదే ఛాన్స్.. నెటిజన్ పోస్టుపై నెట్టింట డిబేట్

యూపీఐ అంటే ఇదీ.. పోయిందనుకున్న ఫోన్ దొరకడంతో సంబరపడ్డ జంట

Updated Date - Sep 25 , 2025 | 05:59 PM