Share News

PM Narendra Modi: పీవోకేను తిరిగి ఇవ్వాల్సిందే..

ABN , Publish Date - May 12 , 2025 | 04:42 AM

పీవోకేను భారత్‌కు తిరిగి ఇవ్వాలని, ఉగ్రవాదులను అప్పగించాలని ప్రధాని మోదీ స్పష్టంగా పేర్కొన్నారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా చర్యలు, కాల్పుల విరమణపై చర్చలు జోరుగా సాగుతున్నాయి.

PM Narendra Modi: పీవోకేను తిరిగి ఇవ్వాల్సిందే..

ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించాలి

ఇవి జరిగితేనే పాకిస్థాన్‌తో చర్చలు

మాపై దాడి జరిగితే.. తీవ్రంగా స్పందిస్తాం

మాకు ఎలాంటి మధ్యవర్తిత్వం అక్కర్లేదు

అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్‌కు మోదీ స్పష్టం

చేసినట్లు సీఎన్‌ఎన్‌, ఇండియాటుడే కథనాలు

ఇంటెలిజెన్స్‌ హెచ్చరికలతోనే మోదీకి వాన్స్‌ ఫోన్‌

వైట్‌హౌస్‌ వర్గాలను ఉటంకించిన సీఎన్‌ఎన్‌

ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన మోదీ

పాక్‌ నుంచి బుల్లెట్లొస్తే శతఘ్నులతో బదులు!

కాల్పుల విరమణ ఉల్లంఘన జరిగితే

ఆర్మీ చీఫ్‌కు సర్వాధికారాలు ఇస్తూ ఆదేశాలు

న్యూఢిల్లీ, మే 11: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే)ను భారత్‌కు తిరిగి ఇవ్వాల్సిందేనని.. చర్చలకు ఇదే ప్రధానమని ప్రధాని మోదీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు తేల్చిచెప్పినట్లు తెలిసింది. పాకిస్థాన్‌ తమకు ఉగ్రవాదులను అప్పగించాల్సిందేనని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ మేరకు శనివారం ఉదయం జేడీ వాన్స్‌, మోదీ మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ వివరాలతో సీఎన్‌ఎన్‌, ఇండియాటుడే టీవీ కథనాలను ప్రచురించాయి. ‘‘పీవోకేను తిరిగి తీసుకోవడం మా ప్రాథమ్యం. కశ్మీర్‌పై మాకు స్పష్టత ఉంది. ఈ విషయంలో మాకు ఎలాంటి మధ్యవర్తిత్వం అవసరం లేదు’’ అని వ్యాఖ్యానించినట్లు ఆ కథనాలు తెలిపాయి. అయితే.. మోదీకి జేడీ వాన్స్‌ ఫోన్‌ చేయడానికి బలమైన కారణాలున్నట్లు సీఎన్‌ఎన్‌ మరో కథనంలో తెలిపింది. ‘‘శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు భారత్‌-పాక్‌ల మధ్య పోరు తీవ్రమైంది’’ అంటూ అత్యంత కీలకమైన హెచ్చరికలను ఇంటెలిజెన్స్‌ వర్గాలు వైట్‌హౌ్‌సకు అందజేసినట్లు పేర్కొంది. అయితే.. ఇంటెలిజెన్స్‌ హెచ్చరికల్లోని ముఖ్యాంశాలను మాత్రం ఆ వర్గాలు వెల్లడించలేదని వివరించింది. ఆ వెంటనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఉపాధ్యక్షుడు వాన్స్‌, జాతీయ భద్రత సలహాదారు, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, వైట్‌హౌస్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ సూసీ వైల్స్‌ భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలను తక్షణం నిలువరించాల్సిన అవసరం ఉందని భావించినట్లు వెల్లడించింది. ఆ మేరకు వైట్‌హౌస్‌ తీసుకున్న నిర్ణయంతో వాన్స్‌ వెంటనే(శనివారం ఉదయం) ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్‌ చేసినట్లు స్పష్టం చేసింది. వాన్స్‌ పర్యటన సందర్భంలోనే పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే..! వాన్స్‌తో ఫోన్‌ సంభాషణలో భాగంగా ప్రధాని మోదీ.. పీవోకే, ఉగ్రవాదుల అప్పగింతపై ప్రపంచం.. ప్రత్యేకించి పాకిస్థాన్‌ అంగీకరించాలని అన్నట్లు సీఎన్‌ఎన్‌, ఇండియాటుడే కథనాలు తెలిపాయి. ఒకవేళ పాక్‌ మళ్లీ కాల్పులు జరిపితే.. భారత్‌ స్పందన తీవ్రంగా ఉంటుందని తేల్చిచెప్పినట్లు వివరించాయి.

h.jpg

భారత్‌-పాక్‌ మధ్య చర్చలు ప్రధాని స్థాయిలోనో.. జాతీయ భద్రత సలహాదారుల స్థాయిలోనో జరగవని, మిలటరీ ఆపరేషన్ల డైరెక్టర్‌ జనరల్స్‌(డీజీఎంవో) స్థాయిలో చోటుచేసుకుంటాయని వివరించినట్లు తెలిపాయి. భారత్‌ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ప్రకటన రాగానే.. ఉన్నఫళంగా తీసుకున్న ఈ నిర్ణయంపై మోదీ సర్కారుపై వ్యతిరేకత వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ కథనాలు ప్రచురితమవ్వడం గమనార్హం..!


విదేశాంగ శాఖ వర్గాలదీ అదే మాట

భారత విదేశాంగ శాఖ(ఎంఈవో) వర్గాలను ఉటంకిస్తూ పలు జాతీయ, అంతర్జాతీయ వార్తాసంస్థలు కూడా ఆదివారం కథనాలను ప్రచురించాయి. పాకిస్థాన్‌ కవ్వింపు చర్యలకు దిగితే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆ వర్గాలు స్పష్టం చేసినట్లు తెలిపాయి. పహల్గాం దాడులకు ప్రతిగా ఈ నెల 7న పాకిస్థాన్‌, పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపాక.. ఆ దేశ డీజీఎంవోకు సమాచారం ఇచ్చామని పేర్కొన్నాయి. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పామని వెల్లడించాయి. దీనిపై పాకిస్థాన్‌ నుంచి ఎలాంటి స్పందన రాకపోగా.. సరిహద్దుల్లోని పౌరులను టార్గెట్‌గా చేసుకుని, పాక్‌ కాల్పులు జరిపినట్లు గుర్తుచేశాయి. ఆ తర్వాత భారత్‌ స్పందన తీవ్రంగా మారడంతో.. శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు పాక్‌ డీజీఎంవో నుంచి ఫోన్‌ వచ్చిందని, ఆ సమయంలో త్రివిధ దళాల భేటీ ఉండడంతో తిరిగి 3.45 సమయంలో ఇరుదేశాల డీజీఎంవోలు మాట్లాడుకున్నట్లు పేర్కొన్నాయి. ఈ సంభాషణలోనే కాల్పుల విరమణ అంశంపై చర్చ జరిగిందని తెలిపాయి. విదేశాంగ శాఖ వర్గాలు కూడా చర్చల్లో కశ్మీర్‌ను అప్పగించడం మినహా.. మరో అంశం అండబోదని, ఈ విషయంలో మధ్యవర్తిత్వాన్ని తాము కోరుకోవడం లేదని స్పష్టం చేసినట్లు పేర్కొన్నాయి.


ఆర్మీ చీఫ్‌కు పూర్తిస్వేచ్ఛ

కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ.. శనివారం రాత్రి పాక్‌ కాల్పులు, మిసైల్‌ దాడులు జరిపిన నేపథ్యంలో.. ఆదివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జాతీయ భద్రత సలహాదారు డోభాల్‌, సీడీఎస్‌ అనిల్‌ చౌహాన్‌, త్రివిధ దళాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. అటువైపు నుంచి తూటా(గోలీ) వస్తే.. మీరు(సైన్యం) శతఘ్నుల(గోలా)ను ప్రయోగించాలని సూచించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్‌ నుంచి మరోమారు కాల్పులు జరిగితే.. తిప్పికొట్టే పూర్తి స్వేచ్ఛను ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేదీకి ఇచ్చినట్లు పేర్కొన్నాయి. ఆ వెంటనే వెస్టర్న్‌ కమాండ్‌ పరిధిలోని అందరు కమాండర్లకు ఆ అధికారాలను బదిలీ చేస్తున్నట్లు ప్రకటించాయని వివరించాయి.


వెనువెంటనే మారిన అమెరికా తీరు!

భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా తీరు గంటల వ్యవధిలోనే మారిపోవడం గమనార్హం..! గురువారం సాయంత్రం అమెరికా విదేశాంగ మంత్రి రూబియో ఇరుదేశాల ప్రధానులతో ఫోన్‌లో మాట్లాడారు. తొలుత మోదీకి ఫోన్‌ చేశారు. ఆ తర్వాత పాక్‌ ప్రధాని షహబాజ్‌ షరీ్‌ఫకు ఫోన్‌ చేసి.. ‘ఆల్‌ ఔట్‌కు భారత్‌ సిద్ధమవుతోంది. మీలో మీరు చర్చించుకుని, సమస్యలను పరిష్కరించుకోండి’’ అని సలహా ఇచ్చారు. ఆ వెంటనే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ‘ఎక్స్‌’లో ఓ ప్రకటన చేశారు. భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల్లో తాము తలదూర్చబోమని స్పష్టంచేశారు. శనివారం ఉదయం అనూహ్యంగా జేడీ వాన్స్‌ ప్రధాని మోదీకి ఫోన్‌ చేసి, సంయమనం పాటించాలని, బలగాలను వెనక్కి తీసుకోవాలని కోరారు. సాయంత్రానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌ మీడియాలో ‘‘కాల్పుల విరమణకు భారత్‌-పాక్‌ అంగీకరించాయి’’ అని పేర్కొన్నారు. ఆ తర్వాతే ఇరు దేశాల నుంచి కాల్పుల విరమణపై ప్రకటనలు వచ్చాయి.


Read Also: Ranveer Allahbadia: ఆపరేషన్ సిందూర్.. అనవసర పోస్టు పెట్టి చిక్కుల్లో పడ్డ రణవీర్ అల్లాహ్‌బాదియా

Operation Sindoor: ఉగ్రవాదుల అంతమే ఆపరేషన్ సింధూర్ లక్ష్యం.. భారత సైన్యం
Operation Sindoor: ఆర్మీ కమాండర్లకు ఫుల్ పవర్

Updated Date - May 12 , 2025 | 04:42 AM