Share News

PM Modi: ఉగ్రవాదులకు ఎక్కడా సురక్షిత చోటు లేదు

ABN , Publish Date - Jul 28 , 2025 | 05:24 AM

మన సార్వభౌమాధికారంపై దాడి జరిగితే భారత్‌ ఎలా స్పందిస్తుందో ఆపరేషన్‌ సిందూర్‌ ఈ ప్రపంచానికి చూపింది. దేశవ్యాప్తంగా కొత్త మేల్కొలుపు, కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.

PM Modi: ఉగ్రవాదులకు ఎక్కడా  సురక్షిత చోటు లేదు

ఆపరేషన్‌ సిందూర్‌ నిరూపించింది.. దేశవ్యాప్తంగా కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది

  • చోళుల కాలం స్వర్ణయుగం

  • ప్రజాస్వామ్య పాలన వారిదే: మోదీ

చెన్నై, జూలై 27 (ఆంధ్రజ్యోతి): ‘‘మన సార్వభౌమాధికారంపై దాడి జరిగితే భారత్‌ ఎలా స్పందిస్తుందో ఆపరేషన్‌ సిందూర్‌ ఈ ప్రపంచానికి చూపింది. దేశవ్యాప్తంగా కొత్త మేల్కొలుపు, కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. భారత్‌ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు, శత్రువులకు ఎక్కడా సురక్షితమైన చోటు లేదని నిరూపించింది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తమిళనాడు పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన అరియలూరు జిల్లా గంగైకొండ చోళపురంలోని బృహదీశ్వరాలయ ప్రాంగణంలో నిర్వహించిన మొదటి రాజేంద్ర చోళుడి ఆడి తిరువాదిరై (ఆషాఢ ఆరుద్ర) జయంత్యుత్సవాలు, బృహదీశ్వరాలయ శంకుస్థాపన సహస్ర వార్షికోత్సవాలు, రాజేంద్రచోళుడు ఆగ్నేయాసియా దేశాలపై జరిపిన దండయాత్ర సహస్ర వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడు తూ.. చోళులు సైనిక సంపత్తిలో కొత్త పద్ధతులు, కొత్త రకం ఆయుధాలను ఉపయోగించేవారని, ఆ రీతిలోనే ప్రస్తుతం తమ ప్రభుత్వం కూడా ఆయుధాలను స్వయంగా తయారుచేసి శత్రువులను మట్టుబెట్టేందుకు ఉపయోగిస్తుందని చెప్పారు. చోళచక్రవర్తుల పరిపాలన భారతదేశపు స్వర్ణయుగాలలో ఒకటని, ప్రజాస్వామ్యానికి జన్మనిచ్చింది చోళరాజులేనని అన్నారు.


ప్రజాస్వామ్యం అంటేనే బ్రిటన్‌ మాగ్నా కార్టా గురించి మాట్లాడుతుంటారని, వాస్తవానికి అంతకుముందే చోళసామ్రాజ్యంలో ‘కుడ వోలై’ పద్ధతి (కుండలో అభ్యర్థుల పేర్లున్న తాటి ఆకుల్లో ఒకదాన్ని తీయడం)లో ప్రజాస్వామ్యం వెల్లివిరిసిందని చెప్పారు. బృహదీశ్వరుడి పాదాల వద్ద కూర్చునే భాగ్యం తనకు లభించిందని, ఆ సందర్భంగా 140 కోట్ల మంది భారతీయుల సంక్షేమం కోసం, దేశ పురోగతి కోసం ప్రార్థించానని చెప్పారు. ఇతర దేశాల నుంచి బంగారం, వెండి తీసుకొచ్చిన చాలామంది రాజులు గురించి మనకు తెలుసని, అయితే రాజేంద్రచోళుడు మాత్రం గంగాజలాన్ని తీసుకొచ్చారని కొనియాడారు. బృహదీశ్వరాలయ సందర్శనకు వచ్చిన తాను కూడా కాశీ నుంచి గంగాజలాన్ని ఆవుడయార్‌ (పరమేశ్వరుడికి)కు సమర్పించేందుకు తీసుకురావడం అదృష్టంగా భావిస్తున్నాన ని ఆయన చెప్పారు. కాగా, రాజేంద్ర చోళుడిని భావితరాలవారు స్మరించుకునే ఆ చక్రవర్తి రూపం ఉన్న ప్రత్యేక నాణేన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు.


ఆగస్టు.. విప్లవాల మాసం

  • ‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, జూలై 27: ఆగస్టు నెలను విప్లవాల మాసంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. ‘మన్‌ కీ బాత్‌’ 124వ ఏపిసోడ్‌లో భాగంగా ఆదివారం ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ‘1908 ఆగస్టు 11న బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో 18 సంవత్సరాల యువకుడిని దేశభక్తి ప్రదర్శించిన కారణంగా బ్రిటిషర్లు ఉరి తీశారు. ఆ సమయంలో అతడి ముఖం భయానికి బదులు గర్వంతో నిండి ఉంది. తమ దేశం కోసం ప్రాణాలు అర్పించేవారు అనుభవించే గర్వం అది. ఆ యువకుడే ఖుదీరాం బోస్‌. 18 ఏళ్ల వయసులో అతను ప్రదర్శించిన ధైర్యం యావత్‌ దేశాన్ని కదిలించింది. ఆగస్టు 1న లోకమాన్య బాల గంగాధర్‌ తిలక్‌ వర్ధంతి. 8న మహాత్ముడి నేతృత్వంలో క్విట్‌ ఇండియా ఉద్య మం మొదలైంది. 15న స్వాతంత్య్ర దినోత్సవం నాడు మన స్వాతంత్య్ర సమర యోధులను స్మరించుకుంటాం’ అని మోదీ పేర్కొన్నారు.


స్వచ్ఛ సర్వేక్షణ్‌తో అద్భుత ఫలితాలు

‘విజయవాడలో నీటి నిర్వహణ పద్ధతులు భేష్‌’ అని ప్రధాని మోదీ ప్రశంసించారు. విజయవాడ, కరాడ్‌లో నీటి నిర్వహణ కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనేక వినూత్న పద్ధతులను అనుసరిస్తున్నాయని తెలిపారు. కలిసి పనిచేస్తే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయొచ్చని స్వచ్ఛ భారత్‌ నిరూపించిందని చెప్పారు. ఈ మిషన్‌ త్వరలోనే 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని, ఇదొక సామూహిక ఉద్యమంలా సాగిందని ఆయన పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

గాజాపై దాడులకు విరామం.. ఇజ్రాయెల్ కీలక నిర్ణయం

కంబోడియా, థాయ్‌లాండ్ తక్షణం చర్చలు చేపట్టేందుకు రెడీ.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 28 , 2025 | 05:24 AM