Share News

Parliament May Adjourn: నేడే పార్లమెంట్‌ నిరవధిక వాయిదా

ABN , Publish Date - Aug 12 , 2025 | 04:10 AM

పార్లమెంటు ఉభయ సభలను మంగళవారం నిరవధికంగా వాయిదా వేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది

Parliament May Adjourn: నేడే పార్లమెంట్‌ నిరవధిక వాయిదా

  • వారం ముందుగానే వాయిదాకు కేంద్రం నిర్ణయం!

  • ప్రతిపక్షాల నిరసనలతో ఆత్మరక్షణలో ప్రభుత్వం

న్యూఢిల్లీ, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటు ఉభయ సభలను మంగళవారం నిరవధికంగా వాయిదా వేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వర్షాకాల సమావేశాలను ఈ నెల 21 వరకు కొనసాగించాలని కేంద్రం ముందుగా నిర్ణయించినా.. వారం రోజుల ముందే వాయిదా వేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. బిహార్‌లో ఓటర్ల జాబితా విస్తృత సవరణ (ఎస్‌ఐఆర్‌), దేశవ్యాప్తంగా ఓట్ల చోరీపై ప్రతిపక్షాల నిరసన ఉధృతం కావడం, గత మూడు వారాలుగా ఉభయ సభలు స్తంభించిపోవడంతో ఆత్మరక్షణలో పడిన కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సోమవారం ఉభయ సభల్లో ప్రతిపక్ష సభ్యులు గందరగోళం సృష్టించి ఎన్నికల కమిషన్‌ కార్యాలయానికి ప్రదర్శనగా వెళ్లడంతో.. కీలకమైన బిల్లులను ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మద్దతుతో ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అత్యంత కీలకమైన జాతీయ క్రీడా పాలనా బిల్లు, జాతీయ యాంటీ డోపింగ్‌ (సవరణ) బిల్లు, ఆదాయ పన్ను బిల్లు వంటి వాటిని లోక్‌సభ ఆమోదించింది. మరోవైపు రాజ్యసభలో మర్చంట్‌ షిప్పింగ్‌ బిల్లు, గోవాలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్టీ ప్రాతినిధ్యాన్ని సవరించే బిల్లును ఆమోదించారు. కాగా, సమైక్య పింఛన్‌ పథకం చందాదారులకు పన్ను మినహాయింపులు కల్పిస్తూ పన్ను చట్టాలను, ముఖ్యంగా ఆదాయ పన్ను బిల్లును సవరిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో బిల్లును ప్రవేశ పెట్టారు. దీనిపై కొంతసేపు చర్చ జరిగిన అనంతరం సభను వాయిదా వేశారు. ఇక జాతీయ క్రీడాపాలనా బిల్లు, యాంటీ డోపింగ్‌ సవరణ బిల్లును మధ్యాహ్నం 2గంటల తర్వాత వరుసగా ఈ బిల్లులను ప్రవేశపెడుతూ.. ఒకదాని తర్వాత మరొకటి ఆమోదిస్తూ వచ్చారు. సాయంత్రం 4గంటల ప్రాంతంలో ఆదాయపన్ను బిల్లు, పన్ను చట్టాల సవరణ బిల్లును ఆమోదించగానే సభను మంగళవారానికి వాయిదా వేశారు.

Updated Date - Aug 12 , 2025 | 04:10 AM