Family Dispute: కన్నకొడుకును నిప్పుపెట్టి చంపేశారు
ABN , Publish Date - Sep 09 , 2025 | 03:09 AM
మద్యం, ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసై వేధిస్తున్న కుమారుడిని తల్లిదండ్రులు, సోదరుడు మూకుమ్మడిగా కడతేర్చారు..
వ్యసనాలకు బానిసై వేధిస్తున్నాడని తల్లిదండ్రుల ఘాతుకం
సహకరించిన మరో కొడుకు
కర్ణాటకలో ఘటన.. నిందితుల అరెస్టు
బెంగళూరు, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): మద్యం, ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసై వేధిస్తున్న కుమారుడిని తల్లిదండ్రులు, సోదరుడు మూకుమ్మడిగా కడతేర్చారు. కాళ్లూ చేతులు కట్టేసి, అతనిపై డీజిల్ పోసి నిప్పంటించారు. కర్ణాటక రాష్ట్రం బిదరి గ్రామంలో ఈ నెల 5న ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన పరప్ప, శాంతి దంపతుల కుమారుడు అనిల్ పరప్ప కానట్టి(32) మద్యానికి బానిసయ్యాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లు ఆడుతూ, విలాసవంతంగా జీవించేవాడు. వ్యసనాల కోసం ఇప్పటికే అతను చేసిన రూ.20 లక్షల అప్పును తల్లిదండ్రులు తీర్చారు. తాజాగా మరో రూ.5 లక్షలు అప్పు చేశాడు.

ఆస్తిలో వాటా ఇవ్వాలని తల్లిదండ్రులను వేధించడం ప్రారంభించాడు. పొలాన్ని ఇస్తే అమ్మేస్తాడని తల్లిదండ్రులు భావించారు. ఈ క్రమంలో ఉద్యోగార్థం వేరే ప్రాంతంలో ఉంటున్న అనిల్ తమ్ముడు బసవరాజ కానట్టి ఇటీవల సెలవులపై స్వగ్రామానికి వచ్చాడు. అతడితోనూ అనిల్ గొడవపడ్డాడు. చేతికి చిక్కిన వస్తువులతో తల్లిదండ్రులపై దాడి చేశాడు. దీంతో అందరూ కలిసి అతడి కళ్లలో కారం చల్లి బంధించారు. కాళ్లు, చేతులు కట్టేసి, ఒంటిపై డీజిల్ పోసి నిప్పంటించారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
ఇవి కూడా చదవండి..
ఉప రాష్ట్రపతి ఎన్నికలో తొలి ఓటు వేసేది ఎవరంటే..
For More National News And Telugu News