Simla Agreement: సిమ్లా ఒప్పందం నిలిపివేత
ABN , Publish Date - Apr 25 , 2025 | 04:23 AM
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందం నిలిపివేత, అట్టారీ సరిహద్దు మూసివేత, వీసాల రద్దు చేసిన నేపథ్యంలో, పాకిస్థాన్ సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేసి, వాఘా సరిహద్దు, వాణిజ్యం, వీసాలు రద్దు చేసి, భారత విమానాలపై గగనతల నిషేధం విధించింది
భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలపై పాకిస్థాన్ ప్రతిచర్యలు
పాక్ ప్రధాని నేతృత్వంలో జరిగిన భేటీలో కీలక నిర్ణయాలు
వాఘా బార్డర్ మూసివేత.. వాణిజ్యం బంద్.. వీసాల రద్దు
సింధు జలాల ఒప్పందం కింద తమకు రావాల్సిన నీటిని మళ్లించే యత్నాల్ని యుద్ధచర్యగా భావిస్తామని హెచ్చరిక
మన విమానాలు తమ గగనతలంలోకి రాకుండా నిషేధం
చుట్టూ తిరిగి వెళ్లాల్సిందే!.. పాక్ నిర్ణయం ప్రభావం
విమానాల దారి మళ్లింపు.. ప్రయాణికులపై మరింత భారం
ఇస్లామాబాద్, ఏప్రిల్ 24: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సిందు జలాల ఒప్పందం నిలిపివేత సహా భారత్ తీసుకున్న పలు కఠిన నిర్ణయాలపై.. పాక్ ప్రతీకార చర్యలకు ఉపక్రమించింది. పాకిస్థాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ నేతృత్వంలో జాతీయ భద్రత కమిటీ గురువారం భేటీ అయి.. అచ్చంగా భారత్ తీసుకున్న నిర్ణయాల తరహాలోనే కొన్ని నిర్ణయాలు తీసుకుంది. పాక్ త్రివిధ దళాధిపతులు, మంత్రులు సైతం హాజరైన ఈ భేటీ ముగిసిన అనంతరం.. అందులో తీసుకున్న నిర్ణయాలతో ఆ దేశ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. 1972లో కుదుర్చుకున్న సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు అందులో వెల్లడించింది. భారత్, అట్టారీ సరిహద్దును మూసివేయగా.. పాక్ వాఘా సరిహద్దును మూసేస్తున్నట్టు వెల్లడించింది. సార్క్ వీసా మినహాయింపు పథకం కింద జారీ చేసిన అన్ని వీసాలనూ రద్దు చేసింది. వాణిజ్యపరంగా తెగతెంపులు చేసుకుంది. దౌత్య సంబంధాల స్థాయిని తగ్గించింది. మన విమానాలకు తన గగనతలంలోకి ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. భారతదేశం పాకిస్థాన్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని.. సీమాంతర హత్యలకు పాల్పడుతోందని.. ఆగ్రహం వ్యక్తం చేసింది.అంతేకాదు.. సింధు జలాల ఒప్పందం కింద పాకిస్థాన్‌కు రావాల్సిన నీటిని మళ్లించే ఎలాంటి ప్రయత్నాన్నయినా యుద్ధచర్యగా (యాక్ట్ ఆఫ్ వార్)గా పరిగణిస్తామని హెచ్చరించింది.
వాఘా సరిహద్దును తక్షణమే మూసివేస్తున్నామని.. అన్ని అనుమతులతో ఆ దారి గుండా ఇప్పటికే పాకిస్థాన్‌లోకి ప్రవేశించిన భారతీయులంతా ఏప్రిల్ 30లోగా వెళ్లిపోవాలని ఆదేశించింది.
సిక్కు మత యాత్రికులకు తప్ప.. సార్క్ వీసా మినహాయింపు పథకం (ఎస్‌వీఈఎస్) కింద భారతీయులకు జారీ చేసిన అన్ని వీసాలూ తక్షణమే రద్దవుతున్నట్టు ప్రకటించింది. ఆ వీసాపై వచ్చిన భారతీయులంతా 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.
తమ దేశంలోని భారత రాయబార కార్యాలయంలో ఉన్న భారత సైనిక, నౌకా దళ, వైమానిక దళ సలహాదారులను అవాంఛిత వ్యక్తులుగా పేర్కొంటూ ఆ పోస్టులు రద్దయినట్టుగా భావించాలని పేర్కొంది. ఆయా సలహాదారులతోపాటు వారి సహాయక సిబ్బంది సైతం ఏప్రిల్ 30లోగా పాకిస్థాన్‌ను విడిచివెళ్లాలని ఆదేశించింది.
ఏప్రిల్ 30 నుంచి ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయంలో సిబ్బంది సంఖ్యను 30కి కుదిస్తున్నట్టు ప్రకటించింది.
భారత దేశానికి చెందిన, భారతీయులు నడిపే విమానయాన సంస్థల విమానాలకు పాక్ గగనతలాన్ని తక్షణం మూసివేస్తున్నట్టు పేర్కొంది.
భారత్‌తో అన్ని రకాల వాణిజ్య సంబంధాలూ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు.. భారత్ నుంచి పాకిస్థాన్ గుండా వేరే దేశానికి/ ఇతర దేశాల నుంచి తమ భూభాగం గుండా భారత్‌కు జరిగే వాణిజ్య కార్యకలాపాలనూ అనుమతించబోమని తేల్చిచెప్పింది. కాగా, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ తీసుకున్నది ఏకపక్ష నిర్ణయమని.. దాన్ని తాము తిరస్కరిస్తున్నామని పాక్ ప్రకటించింది. సింధుజలాలు 24 కోట్ల పాకిస్థానీయులకు జీవరేఖ అని, తమ హక్కులను కాపాడుకోవడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంది.

చుట్టుతిరిగి వెళ్లాల్సిందే!
పాక్ నిర్ణయంతో అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ప్రభావం
తమ గగనతలంలోకి భారత విమానాలకు ప్రవేశాన్ని నిషేధిస్తూ పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయంతో.. మన విమానయాన సంస్థలకు చెందిన అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. అమెరికా, ఇంగ్లండ్ తదితర దేశాలకు తాము నడుపుతున్న విమానాలపై ఆ ప్రభావం ఇప్పటికే పడుతోందని.. వాటిని దారి మళ్లించాల్సి వస్తోందని ఎయిరిండియా, ఇండిగో సంస్థలు వెల్లడించాయి. ఇకపై ఆయా దేశాలకు వెళ్లే విమానాలను అరేబియా సముద్రం మీదుగా సుదూర మార్గాల గుండా నడిపించాల్సి ఉంటుందని సీనియర్ పైలట్లు తెలిపారు. ర విమాన టికెట్ల ధరలు పెరిగి ఆ భారం ప్రయాణికులపై పడుతుందని వారు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
Pahalgam Terror Attack: పాకిస్తానీలు 48 గంటల్లో ఇండియా వదలి వెళ్లాలని కేంద్ర ఆదేశం..
Fauji Actress Imanvi: పుకార్లపై స్పందించిన ప్రభాస్ హీరోయిన్