Share News

Pakistan Airstrike Hits: సొంత ప్రజలపైనే పాక్‌ బాంబుల దాడి

ABN , Publish Date - Sep 23 , 2025 | 06:52 AM

ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా పాకిస్థాన్‌ వైమానిక దళం జరిపిన బాంబుల దాడిలో ఆ దేశ ప్రజలు బలయ్యారు. ఖైబర్‌ పక్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో పాకిస్థాన్‌ వాయుసేనకు...

Pakistan Airstrike Hits: సొంత ప్రజలపైనే పాక్‌ బాంబుల దాడి

  • కనీసం 30 మంది దుర్మరణం

  • మృతుల్లో పిల్లలు, మహిళలు

  • ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఓ గ్రామంపై 8 బాంబులు జారవేత

  • పాక్‌ వైమానిక దళం నిర్వాకం

ఇస్లామాబాద్‌, సెప్టెంబరు 22: ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా పాకిస్థాన్‌ వైమానిక దళం జరిపిన బాంబుల దాడిలో ఆ దేశ ప్రజలు బలయ్యారు. ఖైబర్‌ పక్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో పాకిస్థాన్‌ వాయుసేనకు చెందిన జేఎఫ్‌-17 ఫైటర్‌ జెట్లు ఎనిమిది ఎల్‌ఎస్‌-6 బాంబులు జారవిడవడంతో కనీసం 30 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. సోమవారం వేకువజామున 2 గంటల సమయంలో తిరా లోయలోని మాత్రె దారా అనే గ్రామంపై దాడులు చేసింది. ఈ దాడుల్లో చాలామంది గాయపడ్డారని స్థానిక మీడియా వెల్లడించింది. కాగా క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉందన్నది తెలియరాలేదు. సంఘటనా స్థలంలో మరణించిన చిన్నారులు సహా పలువురి మృతదేహాలు పడి ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్‌ అయ్యాయి. అక్కడికి సహాయక బృందాలు చేరుకుని శిథిలాల కింద పడి ఉన్న మృతదేహాల కోసం గాలిస్తున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. గతంలో కూడా ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఈ ప్రాంతంలో పాక్‌ జరిపిన వైమానిక దాడుల్లో చాలామంది అమాయకులు మరణించారు. డ్రోన్ల దాడులు చేసినపుడు దేశ పౌరుల ప్రాణాలు, ఆస్తులు కాపాడటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో పాకిస్థాన్‌ అధికారులు విఫలమయ్యారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ విమర్శించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 605 ఉగ్రవాద ఘటనలు జరగగా, కనీసం 138 మంది పౌరులు, 79 మంది పోలీసులు చనిపోయారని పోలీసులు తెలిపారు.


ఆపరేషన్‌ సిందూర్‌తో పరార్‌

పాకిస్థాన్‌, పీవోకేలోని 9ప్రధాన ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత ఉగ్రవాద సంస్థలు అక్కడి నుంచి తమ స్థావరాలు తరలించాయి. జైష్‌-ఏ-మొహమ్మద్‌, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ సహా ఉగ్రవాద సంస్థలు అఫ్ఘానిస్థాన్‌ సరిహద్దుల్లో పర్వత ప్రాంతాలతో కూడిన ఖైబర్‌ పక్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాయి.

అవి చైనా బాంబులు..

పాక్‌ వాయుసేన ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఎల్‌ఎస్‌-6 బాంబులపై చర్చ మొదలైంది. ఎందుకంటే ఎల్‌ఎస్‌-6 (లీషీ) చైనాలో తయారైన బాంబులు. చైనా ఏరో స్పేస్‌ అండ్‌ టెక్నాలజీ కార్పొరేషన్‌ (సీఏఎ్‌సటీ) అనుబంధ సంస్థ లుయోయాంగ్‌ ఎలకో్ట్ర ఆప్టిక్స్‌ టెక్నాలజీ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ (ఈవోటీడీసీ) వీటిని అభివృద్ధి చేసింది. ప్రెసిషన్‌ గైడెడ్‌ మ్యూనిషన్స్‌ (పీజీఎం) తరగతికి చెందిన దీన్ని ‘థండర్‌ స్టోన్‌ బాంబ్‌’ అని కూడా పిలుస్తారు. యుద్ధ విమానాల నుంచి ప్రయోగించే ఈ బాంబులు జీపీఎస్‌ను ఉపయోగించుకుని లక్ష్యాలను ఛేదిస్తాయి. ఎల్‌ఎస్‌-6 బాంబు పరిధి దాన్ని జారవిడిచే విమానం ఎత్తు, వేగంపై ఆధారపడి ఉంటుంది. 8 వేల మీటర్ల ఎత్తు నుంచి జారవిడిచినప్పుడు ఇది 40 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. 10వేల మీటర్ల ఎత్తు నుంచి వదిలినప్పుడు దీని పరిధి 60 కిలోమీటర్ల వరకూ ఉంటుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ

ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 23 , 2025 | 06:52 AM