Vice President Election: ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో విపక్ష కూటమి వ్యూహం ఇదేనా
ABN , Publish Date - Aug 19 , 2025 | 06:34 PM
విపక్ష కూటమి నిర్ణయంతో కేంద్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఎన్.చంద్రబాబునాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీని డైలమాలో పడేసే అవకాశం ఉందా అనే ప్రశ్న తలెత్తుతోంది. టీడీపీ నాయకత్వం ఇప్పటికే ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్‌కు మద్దతు ప్రకటించింది.
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో ఇటు ఎన్డీయే, అటు ప్రతిపక్ష 'ఇండియా' కూటమి వ్యూహాత్మకంగా తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. దీంతో ముఖాముఖీ పోరుకు రంగం సిద్ధమైంది. రెండు కూటములూ దక్షిణాది రాష్ట్రాల నుంచే ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడం విశేషమైతే, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న తమిళనాడు నుంచి సీనియర్ బీజేపీ నేత సీపీ రాధాకృష్ణన్‌ను బీజేపీ వ్యూహాత్మకంగా ఎంపిక చేసి అక్కడి అధికార పక్షమైన డీఎంకేకు పరీక్ష పెట్టింది. ఇందుకు ప్రతిగా 'ఇండియా' కూటమి డీఎంకే నుంచి తమ అభ్యర్థిని ప్రకటించవచ్చనే అందరి అంచనాలకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జస్టిస్ (రిటైర్డ్) బి సుదర్శన్ రెడ్డిని విపక్ష కూటమి బరిలోకి దింపింది.

విపక్ష కూటమి నిర్ణయంతో కేంద్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఎన్.చంద్రబాబునాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీని డైలమాలో పడేసే అవకాశం ఉందా అనే ప్రశ్న తలెత్తుతోంది. టీడీపీ నాయకత్వం ఇప్పటికే ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్‌కు మద్దతు ప్రకటించింది. డీఎంకే పరంగా చూస్తే స్థానిక అభ్యర్థికి వ్యతిరేకంగా ఆ పార్టీ ఓటు వేస్తుందా? అనేది ఆసక్తికరమవుతోంది.
బి సుదర్శన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి)లోని రంగారెడ్డి జిల్లాకు చెందినవారు. గతంలో లాయర్‌గా పనిచేశారు. 1995లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా పనిచేసి 2005లో గువాహటి హైకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యారు. 2007లో సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులై 2011 జూలైలో రిటైర్ అయ్యారు. ఆ తర్వాత కూడా ఆయన గోవా తొలి లోకాయుక్తగా కొద్దికాలం సేవలందించారు.

ఎన్డీయే తమ అభ్యర్థిగా ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ సిపీ రాధాకృష్ణన్‌ను ఎంపిక చేయడంతో ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే సందిగ్ధంలో పడింది. 'తమిళ్ ప్రైడ్' అనేది దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో భావోద్వేగ అంశం. రాజకీయాలకు అతీతంగా ఎన్డీయే అభ్యర్థికి ఓటు వేయాలని డీఎంకేపై ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీకి కలిసొచ్చే అంశం. అయితే, బీజేపీ ఎంపికను రాజకీయంగానే చూడాల్సిందే కానీ భాషా కోణంలో చూడలేమని డీఎంకే వ్యాఖ్యానించింది.

టీడీపీ ముందు కూడా ఇదే తరహా ప్రశ్న ఉంది. చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ కేంద్రంలోని బీజేపీకి భాగస్వామిగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉంది. ఎన్డీయే అభ్యర్థిగా రాధాకృష్ణన్‌ను ప్రకటించగానే చంద్రబాబు తనయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్వయంగా రాధాకృష్ణన్‌ను కలిసి ఆయనను ఎన్డీయే అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు అభినందించారు. ఎలాంటి అస్పష్టత లేదని, ఎన్డీయే ఐక్యతకు కట్టుబడి ఉంటామని ప్రకటించారు. తాజాగా విపక్ష కూటమి కూడా తమ అభ్యర్థిని ప్రకటించడంతో టీడీపీకి ఒక ప్రశ్న ఎదురవుతోంది. ఆంధ్రా జడ్జా? తమిళ రాజకీయనేతా? అనేది ఆ ప్రశ్న. ఎన్డీయే ఐక్యతకే కట్టుబడితే దీనిపై టీడీపీ ప్రత్యర్థులు రాజకీయ విమర్శల దాడి చేయవచ్చు. ఇదే ప్రశ్న జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్‌సీపీ, కె.చంద్రశేఖర్‌రావు సారథ్యంలోని భారత్ రాష్ట్ర సమితికి కూడా ఎదురవుతోంది. ఎన్డీయేకి మద్దతు ప్రకటించాలా? ఇండియా కూటమి అభ్యర్థిని బలపరచాలా? అనేదే ఆ ప్రశ్న. అయితే వైఎస్ఆర్‌సీపీ ఇప్పటికే ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది.

బలాబలాలు
ఇరు కూటముల బలాబలాలు విశ్లేషిస్తే, సెప్టెంబర్ 9న జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీజేపీ గెలుపు దాదాపు ఖాయమనే చెప్పాలి. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ప్రస్తుతం ఎలక్టోరల్ కాలేజీలో ఖాళీలు పక్కనపెడితే మొత్తం 782 మంది సభ్యులున్నారు. అంటే ఏ అభ్యర్థి గెలవాలన్నా కనీసం 382 ఓట్లు పడాలి. ఎన్డీయేకు లోక్‌సభలో 293, రాజ్యసభలో 133 సీట్లు ఉన్నాయి. సంఖ్యాబలం పరంగా సీపీ రాధాకృష్ణన్ గెలుపు సునాయాసమే. ఎన్డీయేలోని కొందరు సభ్యులు రెబల్స్‌గా మారి విపక్ష కూటమి అభ్యర్థి వైపు మొగ్గుచూపితేనే భిన్నమైన ఫలితం రావచ్చు. అయితే, ఇప్పటికిప్పుడు అలాంటి అద్భుతమేదో జరుగుతుందని అనుకోలేం.
రాజకీయేతర వ్యక్తిని ఉపరాష్ట్రపతి బరిలోకి దింపిన 'ఇండియా' కూటమి.. ఇది సైద్ధాంతికమైన పోరుగా చెబుతోంది. అధికార బీజేపీ ఎన్నికల కమిషన్‌తో సహా రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగ పరుస్తోందని ఆరోపణలు గుప్పిస్తున్న క్రమంలో ఒక నిబద్ధత కలిగిన జస్టిస్‌ను బరిలోకి దింపామనే చెప్పుకునే అవకాశాన్ని విపక్ష కూటమి అందిపుచ్చుకుంది. బీజేపీ సునాయాసంగా గెలుపు సాధించే అవకాశాలున్నా విపక్ష కూటమి తమ అభ్యర్థిని నిలపడం ద్వారా ఉపరాష్ట్రపతి ఎన్నికను రసవత్తరంగా మార్చిందనే చెప్పాలి.
ఇవి కూడా చదవండి..
ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ తేదీ ఖరారు
ఉపరాష్ట్రపతి అభ్యర్థి.. నాలుగు దశాబ్దాల లీగల్ కెరీర్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి