Operation Sindoor: గెట్ రెడీ.. అత్యవసర వైద్య సేవలకు పిలుపునిచ్చిన FAIMA
ABN , Publish Date - May 09 , 2025 | 12:04 PM
భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత తీవ్రస్థాయికి చేరుకుంది. పహల్గామ్ ఉగ్రదాడితో రగిలిపోతున్న భారత్.. పాకిస్తాన్‌పై విజృంభిస్తోంది. పాకిస్తాన్ చేస్తోన్న ప్రతిదాడిని ఎదుర్కుంటూనే.. భారత్ సైన్యం తన సత్తా చాటుకుంటోంది. అయితే, ఈ వివాదం నేపథ్యంలో FAIMA దేశవ్యాప్తంగా అత్యవసర వైద్య సేవలకు పిలుపునిచ్చింది.
భారతదేశం - పాకిస్తాన్ మధ్య సరిహద్దు వివాదం నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (FAIMA) దేశవ్యాప్తంగా అత్యవసర వైద్య సేవలకు పిలుపునిచ్చింది. వైద్యులు, వైద్య సంస్థలు వెంటనే రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించింది. మన రక్షణ దళాలకు ఈ విధంగా తమ మద్దతు ఇవ్వాలని FAIMA అభ్యర్థించింది. వైద్య సోదరులు మన సైనికులకు అండగా ఉన్నామనే భరోసాని కల్పించాలని కోరుతూ FAIMA తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. వైద్యులు, వైద్య సంఘాలందరూ వెంటనే రక్తదాన శిబిరాలను నిర్వహించాలని పేర్కొంది.
దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలను నిర్వహించండి
ప్రతి ఒక్కరూ తమ తమ ప్రాంతాలలో రక్తదాన శిబిరాలను వెంటనే నిర్వహించాలని FAIMA కోరింది. ఈ కీలకమైన ప్రయత్నం మన ధైర్య సాయుధ దళాలకు, గాయపడిన మన దేశ పౌరులకు అత్యవసర సమయంలో వైద్యం చేయడానికి ఉపయోగపడుతుందని FAIMA తెలిపింది. దేశ ప్రజల కోసం రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేసింది. సైన్యం, వైమానిక దళం, నావికాదళ సిబ్బందికి వైద్య సోదరులు తోడుగా ఉన్నారనే భావనను కలిగిస్తుందని FAIMA తెలిపింది. రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొనాలని పౌరులను కోరుతోంది. ఈ రోజు మీ సహకారం రేపు ఒక దేశస్థుడి ప్రాణాన్ని కాపాడుతుందని FAIMA విజ్ఞప్తి చేస్తోంది.
Also Read:
Operation Sindoor: యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్.. ఎలా పని చేస్తుందంటే
Operation Sindoor: దేశంలోకి చొరబాటుకు యత్నం.. 7గురు టెర్రరిస్టులు హతం
Operaion Sindoor: ప్రజలను సయితం విరాళాలు అడుక్కునే పరిస్థితిలో పాక్