Share News

Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ

ABN , Publish Date - May 12 , 2025 | 03:00 PM

Operation Sindoor: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత్ చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైందని ఎయిర్ మార్షల్ భార్తీ వెల్లడించారు. ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశామన్నారు. పాక్‌లో సామాన్య పౌరులకు ఎటువంటి నష్టం జరగలేదని చెప్పారు.

Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం:  ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ

న్యూఢిల్లీ, మే 12: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత్ చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైందని ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ వెల్లడించారు. ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశామన్నారు. పాక్‌లో సామాన్య పౌరులకు ఎటువంటి నష్టం జరగలేదని తెలిపారు. పాక్ వైపు నుంచి దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామన్నారు. సోమవారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పలువురు ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆ క్రమంలో ఎయిర్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ ఎయిర్ మార్షల్ ఎ.కె.భార్తీ మాట్లాడుతూ.. మన సైన్యానికి, ప్రజలకు పెద్దగా నష్టం జరగకుండా చూశామని ఆయన పేర్కొన్నారు.

దాయాది దేశంలో జరిగిన నష్టానికి పాకిస్థాన్‌ ఆర్మీదే బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థతో పాక్ క్షిపణులు, డ్రోన్లను తిప్పికొట్టామని చెప్పారు. చైనా తయారు చేసిన పీఎల్ 15 క్షిపణిని నేలకూల్చామన్నారు. ఆపరేషన్ సింధూర్‌లో స్వదేశీ తయారీ ఆకాశ్‌ను సమర్థంగా వినియోగించామని ఎ.కె.భార్తీ వెల్లడించారు. మన కౌంటర్ సిస్టం టర్కీ డ్రోన్లనే కాదు.. దేనినైనా పడగొట్టగలమన్నారు. దేశీయ పరిజ్ఞానం గొప్పగా ఉందని తెలిపారు.

జైష్, లష్కరే నేతల పేర్లతో గందరగోళం సృష్టించేందుకు పాక్ ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. తమ పోరాటం ఉగ్రవాదులతోనే కానీ.. పాకిస్థాన్‌తో కాదని ఆయన తేల్చి చెప్పారు. అయితే ఉగ్రవాదులు కొన్నాళ్లుగా తమ వ్యూహాలను మార్చుకుంటున్నారన్నారు. ఈ యుద్ధంలో ఏయే ఆయుధాలు ఉయోగించామో వెల్లడించలేమని ఆయన పేర్కొన్నారు. ఇదోక వినూత్నమైన యుద్ధమన్నారు. గతంలోలాగా ఉండదన్నారు. సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగిపోయిందని చెప్పారు.


తమ పోరాటం తీవ్రవాదుల మౌలిక సదుపాయాలపై దాడులు చేయడంపై మాత్రమేనని స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆర్మీ మద్దతుగా నిలబడుతోందని గుర్తు చేశారు. సరిహద్దుల వద్ద భారత వాయిసేన.. తన ఆయుధ సంపత్తితో ఎదుర్కుందని వివరించారు. ఉగ్రవాదులకు అండగా నిలిచినందుకు.. భారత వాయుసేన ఆగ్రహాన్ని పాకిస్థాన్‌ చవి చూడాల్సి వచ్చిందన్నారు. దేశీయంగా తయారైన గగనతల రక్షణ వ్యవస్థ పాకిస్తాన్ పంపిన డ్రోన్లను కూల్చి వేసిందని చెప్పారు.

శత్రు దేశానికి సంబంధించిన దాడులు అడ్డుకోవడంలో భారత వాయిసేన సమర్థవంతంగా వ్యవహరించిందని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ ప్రయోగించిన దీర్ఘ శ్రేణి క్షిపణులకు సంబంధించిన కూల్చివేసిన శకలాలను తాము దేశ ప్రజలకు చూపిస్తున్నాన్నారు. పాకిస్తాన్‌లో జరిగిన దాడులకు ఆ దేశ ఆర్మీ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పాకిస్తాన్‌లో భారత్ జరిపిన దాడులకు సంబంధించిన ఆధారాలను దేశ ప్రజల ముందు ఉంచుతున్నామని తెలిపారు.


లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ మాట్లాడుతూ.. అమాయక ప్రజలపై పాక్ దాడులకు తెగబడిందని మండిపడ్డారు. పహల్గామ్‌లో అమాయక పర్యాటకులను చంపారని ఆయన గుర్తు చేశారు. అయితే తాము ముందే ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టం సిద్ధం చేశామన్నారు. మన ఎయిర్ డిఫెన్స్‌ బలమైన గోడలా నిలిచిందని చెప్పారు. బహుళ ఆయుధ వ్యవస్థను అధిగమించే శక్తి పాక్‌కు లేదన్నారు. పహల్గామ్ పాపానికి మూల్యం చెల్లించారంటూ పాకిస్థాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత సైనిక స్థావరాలపై దాడి చేయడం అసాధ్యమని లెఫ్టినెంట్ గవర్నర్ రాజీవ్‌ వెల్లడించారు.


అలాగే వైస్ అడ్మిరల్ ప్రమోద్ మాట్లాడుతూ.. నౌకాదళం పటిష్ట నిఘాతో దాడులను తిప్పికొట్టిందని చెప్పారు. గగనతల దాడులను తక్షణమే పసిగట్టి వాటిని నిలువరించామని ఆయన స్పష్టం చేశారు. ఎయిర్ క్రాఫ్ట్ కేరియర్లు, రాడర్లు సైతం వినియోగించామని చెప్పారు. ఫ్లీట్, ఎయిర్ డిఫెన్స్‌ను సమర్థంగా వినియోగించామని పేర్కొన్నారు. డ్రోన్లు, హైస్పీడ్ మిస్సైల్స్, హెలికాఫ్టర్లను సైతం వినియోగించామని గుర్తు చేశారు. నౌకదళ అడ్వాన్స్ రాడార్ల ద్వారా పాక్ డ్రోన్లను గుర్తించగలిగామన్నారు. మిగ్‌లు, హెలికాఫ్టర్ల ద్వారా పాక్ దాడులను గుర్తించగలిమని వైస్ అడ్మిరల్ ప్రమోద్ వివరించారు.

ఇవి కూడా చదవండి..

India-Pakistan Ceasefire: భారత్, పాక్ చర్చలు సాయంత్రానికి వాయిదా

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ముగియలేదు.. పాకిస్తాన్‌కు వార్నింగ్..

For National News And Telugu News

Updated Date - May 12 , 2025 | 03:36 PM