Karur Stampede: విజయ్ ర్యాలీలో రాళ్ల రువ్వుడు జరగలేదు.. ఏడీజీపీ ప్రకటన
ABN , Publish Date - Sep 28 , 2025 | 08:51 PM
విజయ్ సభకు 12,000 మంది వస్తారని నిర్వాహకులు చెప్పి తమ వద్ద అనుమతి తీసుకున్నారని, అందుకు తగ్గట్టే పోలీసు సిబ్బంది మోహరించిందని ఏడీజీపీ చెప్పారు. అయితే విజయ్ సాయంత్రం 6 గంటలకు రావడంతో జనం ఒక్కసారిగా దూసుకొచ్చారని, దీంతో తొక్కిసలాట జరిగిందని ఆయన తెలిపారు.
చెన్నై: సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) చీఫ్ విజయ్ (Vijay) శనివారం నాడు కరూర్‌లో నిర్వహించిన ర్యాలీలో ఎలాంటి రాళ్లు రువ్వుడు (Stone pelting) ఘటనలు చోటుచేసుకోలేదని తమిళనాడు ఏడీజీపీ డేవిడ్ సన్ దేవాశీర్వతం (Davidson Devasirvatham) తెలిపారు. అయితే టీఎంకే నాయకత్వం అన్ని నిబంధనలను ఉల్లంఘించిందని చెప్పారు. కరూర్ తొక్కిసలాటలో 40 మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 70 మంది గాయపడ్డారు.
ఈ ఘటనపై ఆదివారంనాడిక్కడ మీడియాతో ఏడీజీపీ మాట్లాడుతూ.. ర్యాలీలో ఎలాంటి రాళ్ల రువ్వుడు ఘటనలు చోటుచేసుకులేదని తన దర్యాప్తులో తేలినట్టు చెప్పారు. నిర్వాహకులు సభకు 12,000 మంది వస్తారని చెప్పి తమ వద్ద అనుమతి తీసుకున్నారని, అందుకు తగ్గట్టే పోలీసు సిబ్బంది మోహరించిందని చెప్పారు. అయితే విజయ్ సాయంత్రం 6 గంటలకు రావడంతో జనం ఒక్కసారిగా దూసుకొచ్చారని, దీంతో తొక్కిసలాట జరిగిందని తెలిపారు. 'ర్యాలీకి హాజరైన యువకుల్లో చాలామంది ఎవ్వరి మాటను ఖాతరు చేయలేదు. కనీసం వాళ్లను తెచ్చిన వలంటీర్ల మాట కానీ, బౌన్సర్ల మాట కానీ, ఏ ఒక్కరి మాటా వినే పరిస్థితిలో లేరు' అని చెప్పారు.
40కి చేరిన మృతులు
తొక్కిసలాట ఘటనలో 40 మంది మృతి చెందారని, మృతుల సంఖ్య పెరక్కుండా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయసహకారాలు అందిస్తోందని కరూర్ జిల్లా కలెక్టర్ ఎం.తంగవేలు తెలిపారు. తొక్కిసలాట మృతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని చెప్పారు.
ఘటనా స్థలికి హైకోర్టు మాజీ న్యాయమూర్తి
ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు తమిళనాడు ప్రభుత్వం నియమించిన మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి అరుణ జగదీషన్ తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మీడియాతో మాట్లాడుతూ ఆమె అన్నారు. ఇందుకు అవసరమైన చర్యలను తాము సూచిస్తామని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
కరూర్ విషాదంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టుకు టీవీకే
కరూర్ విషాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టీవీకే అధినేత విజయ్.. ఎంతంటే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి