Trilingual Eeducation Policy: త్రిభాషా విధానంపై రాజకీయ రాద్ధాంతం తగదు
ABN , Publish Date - Sep 22 , 2025 | 06:36 AM
త్రిభాషా విద్యావిధానంపై అనవసరమైన రాజకీయ రాద్ధాంతం తగదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. సంకుచిత రాజకీయ అభిప్రాయాలు ఉన్నవారే ఈ విధానాన్ని...
ఏ రాష్ట్రంపైనా.. ఏ భాషనూ నిర్బంధంగా అమలు చేయం: ధర్మేంద్ర ప్రధాన్
చెన్నై, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): త్రిభాషా విద్యావిధానంపై అనవసరమైన రాజకీయ రాద్ధాంతం తగదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. సంకుచిత రాజకీయ అభిప్రాయాలు ఉన్నవారే ఈ విధానాన్ని వివాదంగా మారుస్తున్నారని ఆరోపించారు. కేంద్రం రూపొందించిన నూతన విద్యావిధానం ప్రకారం ఏ రాష్ట్రంపైనా.. ఏ భాషనూ నిర్బంధంగా అమలు చేయాలని ఒత్తిడి చేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలూ నూతన విద్యావిధానాన్ని అమలు చేస్తున్నాయని, తమిళనాడు ప్రభుత్వం మాత్రం తీవ్ర నిరసన ప్రకటిస్తూ ద్విభాషా విద్యావిధానానికే కట్టుబడి ఉంటామని మొండి వైఖరిని అవలంస్తోందని ఆరోపించారు. త్రిభాషా విధానంతో వచ్చిన సమస్య ఏమిటని ప్రశ్నించారు. ఐఐటీ మద్రాసులో ‘దక్షిణాపథ్ సమ్మిట్’ పేరుతో ఆదివారం ఏర్పాటైన సదస్సులో ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలు, ‘ఐఐటీఎం ఫర్ ఆల్’ పథకం కింద నాలుగేళ్ల ఆన్‌లైన్ బీఎస్ (డేటా సైన్స్) కోర్సులో చేరిన గ్రామీణ, పేద, దివ్యాంగ విద్యార్థులతో ఆయన భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తమిళనాడుకు సమగ్ర శిక్షా అభియాన్ నిధుల నిలిపివేతపై తాను రెండేళ్లుగా ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో మాట్లాడుతూనే ఉన్నానని చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు జాతీయ విద్యావిధానాన్ని అవలంబిస్తుండగా తమిళనాడు మాత్రం ద్విభాషా విద్యావిధానానికే కట్టుబడి ఉంటామని రాజకీయ రాద్ధాంతం చేయడం తగదన్నారు. తమిళనాడులోని పాఠశాలల్లో తెలుగు, ఉర్దూ, మలయాళం సహా పలు ప్రాంతీయ భాషలు నేర్పుతున్నప్పడు త్రిభాషా విధానం వద్దని ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం భావ్యమేనా అని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
జీఎస్టీ సంస్కరణలతో ఆత్మనిర్భరత... శరవేగంగా వృద్ధి
దేశ ప్రజలకు ప్రధాని గుడ్ న్యూస్.. ఇక జీఎస్టీ ఉత్సవ్ ప్రారంభం
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి