Share News

Pankaj Chaudhary: మొదటిసారి రుణం తీసుకునేవారికి కనీస సిబిల్‌ స్కోర్‌ అక్కర్లేదు

ABN , Publish Date - Aug 25 , 2025 | 02:57 AM

మొదటిసారి బ్యాంకు రుణం తీసుకునే వారికి కనీస సిబిల్‌ స్కోర్‌ అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో భాగంగా గత వారం లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ ..

Pankaj Chaudhary: మొదటిసారి రుణం తీసుకునేవారికి కనీస సిబిల్‌ స్కోర్‌ అక్కర్లేదు

  • రుణ దరఖాస్తులకు కనీస క్రెడిట్‌ స్కోర్‌ను ఆర్బీఐ సూచించలేదు

  • కేంద్ర మంత్రి పంకజ్‌ చౌదరి

న్యూఢిల్లీ, ఆగస్టు 24: మొదటిసారి బ్యాంకు రుణం తీసుకునే వారికి కనీస సిబిల్‌ స్కోర్‌ అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో భాగంగా గత వారం లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి మాట్లాడుతూ.. మొదటిసారి రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి క్రెడిట్‌ స్కోర్‌ తక్కువగా లేదా సున్నాగా ఉంటే రుణ దరఖాస్తులను బ్యాంకులు తిరస్కరించరాదన్నారు. ఈ సందర్భంగా ఆర్బీఐ ఇచ్చిన ఆదేశాలను ఆయన ప్రస్తావించారు. కేవలం క్రెడిట్‌ చరిత్ర లేదన్న కారణంతో మొదటిసారి రుణం తీసుకునే వారి రుణ దరఖాస్తును బ్యాంకులు తిరస్కరించరాదని ఆర్బీఐ సూచించినట్టు తెలిపారు. రుణ దరఖాస్తులకు ఆర్బీఐ కనీస క్రెడిట్‌ స్కోర్‌ను ఏమీ సూచించలేదన్నారు. మొదటిసారి రుణం తీసుకునే వారికి సిబిల్‌ స్కోర్‌ తప్పనిసరి కాకపోయినప్పటికీ దరఖాస్తుదారుల నేపథ్య తనిఖీని నిర్వహించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్యాంకులను కోరింది. వీటిలో క్రెడిట్‌ చరిత్ర, గత చెల్లింపుల చరిత్ర, చెల్లింపుల్లో జాప్యం, రుణాల సెటిల్‌మెంట్‌ వంటివి ఉంటాయి. కాగా క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీలు(సీఐసీ) ఒక వ్యక్తికి క్రెడిట్‌ రిపోర్టులను ఇవ్వడానికి రూ.100 వరకు చార్జీని వసూలు చేయవచ్చని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అంతకు మించిన మొత్తం ఆమోదనీయం కాదన్నారు.


సిబిల్‌ స్కోర్‌ అంటే?

సిబిల్‌ అంటే.. క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (ఇండియా) లిమిటెడ్‌. సిబిల్‌ స్కోర్‌ అనేది క్రెడిట్‌ యోగ్యతను నిర్ణయించే మూడంకెల సంఖ్య. ఈ స్కోర్‌ 300 నుంచి 900 వరకు ఉంటుంది. వ్యక్తిగత, బంగారం, గృహ, ఇతర బ్యాంకు రుణాలను తీసుకోవడానికి ఒక వ్యక్తి అర్హతను నిర్ణయించడానికి గాను సిబిల్‌ ఇచ్చే స్కోర్‌ను బ్యాంకులు వినియోగిస్తుంటాయి. స్కోరు 750అంతకంటే మెరుగ్గా ఉంటే పలు రుణాల ఆమోదానికి అర్హత ఎక్కువగా ఉంటుంది.


ఇవి కూడా చదవండి..

మరాఠా రిజర్వేషన్‌పై ఆఖరి పోరాటం.. మనోజ్ జారంగే పిలుపు

రాహుల్ ఓటర్ అధికార్ యాత్రలో జోష్.. హాజరుకానున్న ప్రియాంక

రాహుల్ యాత్రలో మళ్లీ అపశృతి

For More National News And Telugu News

Updated Date - Aug 25 , 2025 | 02:57 AM