3 Lashkar e Taiba Terrorists: పహల్గామ్ ఉగ్రదాడిపై ఎన్‌ఐఏ కీలక ప్రకటన.. హంతకుల సంఖ్యపై స్పష్టత
ABN , Publish Date - Aug 28 , 2025 | 08:55 PM
పహల్గామ్ ఉగ్రదాడి నుంచి ప్రాణాలతో బయటపడిన బాధితులు తమపై నాలుగు నుంచి ఐదుగురు ఉగ్రవాదులు దాడి చేసినట్లు చెప్పారు. జమ్మూకాశ్మీర్ పోలీసులు కూడా నలుగురి కంటే ఎక్కువ మందే దాడిలో పాల్గొన్నారని, ఉగ్రవాదులతోపాటు స్థానికులు కూడా భాగమయ్యారని అభిప్రాయపడ్డారు.
జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్, బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిపై ఎన్ఐఏ స్పందించింది. దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల సంఖ్యపై గురువారం అధికారిక ప్రకటన చేసింది. పహల్గామ్ ఉగ్రదాడిలో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు మాత్రమే పాల్గొన్నారని వెల్లడించింది. ‘ఆపరేషన్ మహదేవ్’ తర్వాత ఎన్‌ఐఏ మొదటిసారిగా అధికారిక ప్రకటన చేసింది. పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల సంఖ్యపై ఎన్ఐఏ అధికారిక ప్రకటన ఇవ్వడం వెనుక ఓ బలమైన కారణం ఉంది.
పహల్గామ్ ఉగ్రదాడి నుంచి ప్రాణాలతో బయటపడిన బాధితులు తమపై నాలుగు నుంచి ఐదుగురు ఉగ్రవాదులు దాడి చేసినట్లు చెప్పారు. జమ్మూకాశ్మీర్ పోలీసులు కూడా నలుగురి కంటే ఎక్కువమందే దాడిలో పాల్గొన్నారని, ఉగ్రవాదులతోపాటు స్థానికులు కూడా భాగమయ్యారని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఎన్‌ఐఏ స్పష్టత ఇచ్చింది. పాకిస్తాన్‌కు చెందిన ముగ్గురు టెర్రిస్టులు మాత్రమే ఈ దాడిలో పాల్గొన్నారని స్పష్టం చేసింది. ఎన్‌ఐఏ దర్యాప్తులో ఏం తేలిందంటే.. ఆ ముగ్గురు బైసరన్ లోయలో దాడి చేయడానికి ముందు రెక్కీ నిర్వహించారు.
ఆ లోయ నిర్మానుష ప్రదేశంలో ఉండటం.. పోలీసుల బందోబస్తూ తక్కువగా ఉండటంతో దాన్నే ఎంచుకున్నారు. ఎక్కువ మంది టూరిస్టులు అక్కడి వస్తుండటం కూడా ఓ ప్రధాన కారణం. ఆ ముగ్గురు ఉగ్రవాదులు 3 వేలు ఖర్చు పెట్టి అక్కడే బస చేశారు. ఉగ్రవాదులకు బస ఏర్పాటు చేసిన వారిని కూడా ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ‘ఆపరేషన్ మహదేవ్’ పేరుతో భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం వేట మొదలెట్టాయి. జులై నెలలో ముగ్గుర్నీ కాల్చి చంపేశాయి. ఈ విషయాన్ని రాజ్యసభలో కేంద్ర మంత్రి అమిత్ షా స్వయంగా వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు
యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..