Share News

NIA Conducts Raids: పాకిస్థాన్ గూఢచర్యం కేసులో 8 రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు

ABN , Publish Date - Jun 01 , 2025 | 11:02 AM

పాకిస్థాన్‎తో సంబంధం ఉన్న గూఢచర్యం కేసు భారత్‌లో జాతీయ భద్రతకు సవాలుగా నిలిచింది. ఈ క్రమంలో ఎన్‌ఐఏ నిర్వహించిన సోదాలు (NIA Conducts Raids), దర్యాప్తు ద్వారా ఈ నెట్‌వర్క్‌ను బయటకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల 8 రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో NIA సోదాలు నిర్వహించింది.

NIA Conducts Raids: పాకిస్థాన్ గూఢచర్యం కేసులో 8 రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు
NIA Conducts Raids

జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) భారతదేశంలో పాకిస్థాన్‎తో సంబంధం ఉన్న ఒక గూఢచర్యం కేసులో స్పీడ్ పెంచేసింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో భారీ సోదాలు (NIA Conducts Raids) నిర్వహించింది. ఈ సోదాలు మే 31, శనివారం రోజున ఢిల్లీ, మహారాష్ట్ర (ముంబై), హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, పశ్చిమ బెంగాల్‌లలో జరిగాయి. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌లతో (PIO) సంబంధాలు ఉన్న అనుమానితుల ఇళ్లలో ఈ సోదాలు చేపట్టారు.


సోదాల్లో ఏం జరిగింది

ఈ సోదాల సమయంలో ఎన్‌ఐఏ బృందాలు అనేక ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, సున్నితమైన ఆర్థిక పత్రాలు, ఇతర నేర సంబంధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి. ఈ వస్తువులను పాకిస్థాన్ ఆధారిత గూఢచారులు నడిపిస్తున్న గూఢచర్య రాకెట్‌కు సంబంధించిన సమాచారం కోసం జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఎన్‌ఐఏ దర్యాప్తు ప్రకారం, సోదాలు జరిగిన అనుమానితులు పాకిస్థాన్ గూఢచారులతో సంబంధాలు కలిగి ఉన్నారని, భారత్‌లో గూఢచర్య కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందించే మార్గాలుగా పనిచేశారని తెలిసింది.


దేశ వ్యతిరేక కుట్ర

మే 20న ఒక నిందితుడిని అరెస్టు చేసిన తర్వాత ఎన్‌ఐఏ ఈ కేసు నమోదు చేసింది. ఈ నిందితుడు 2023 నుంచి పాకిస్థాన్ గుఢచారులతో సున్నితమైన సమాచారాన్ని పంచుకుంటున్నట్లు తెలిసింది. జాతీయ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారాన్ని లీక్ చేయడం ద్వారా అతను భారత్‌లోని వివిధ మార్గాల ద్వారా డబ్బు స్వీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసును భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్‌లు 61(2) (క్రిమినల్ కుట్ర), 147 (భారత్‌పై యుద్ధం చేయడం లేదా యుద్ధానికి ప్రయత్నించడం), 148 (నేరాలకు కుట్ర చేయడం), అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ 1923 సెక్షన్‌లు 3, 5 (అనధికారికంగా రహస్య సమాచారాన్ని పంచడం), యూఏ(పీ) యాక్ట్ 1967 సెక్షన్ 18 (ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన వ్యక్తులు) కింద నమోదు చేశారు.


దర్యాప్తు కొనసాగింపు

ఎన్‌ఐఏ ఈ కేసులో దర్యాప్తును కొనసాగిస్తోంది. పాకిస్థాన్ ఆధారిత గూఢచారులు భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడానికి, దేశ వ్యతిరేక కుట్రలను రచించడానికి ఈ నెట్‌వర్క్‌ను ఎలా ఉపయోగించారనే దానిపై లోతైన దర్యాప్తు జరుగుతోంది. స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, ఆర్థిక పత్రాలు, ఇతర సామగ్రిని విశ్లేషించడం ద్వారా మరిన్ని కీలక సమాచారాలను బయటకు తీసే ప్రయత్నంలో ఎన్‌ఐఏ ఉంది. ఈ గూఢచర్య కేసు భారత జాతీయ భద్రతకు సంబంధించి చాలా సున్నితమైన అంశమని చెప్పవచ్చు. పాకిస్థాన్ గూఢచారులు భారత్‌లోని వ్యక్తులను ఉపయోగించి రహస్య సమాచారాన్ని సేకరించడం, ఆ సమాచారాన్ని దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించడం వంటివి ఈ కేసు ద్వారా బయటపడ్డాయి. ఇటువంటి కార్యకలాపాలు దేశ భద్రతను బలహీనపరిచే అవకాశం ఉంది.


ఇవీ చదవండి:

నేడు పంజాబ్ vs ముంబై ఇండియన్స్ కీలక మ్యాచ్.. విన్ ప్రిడిక్షన్

జూన్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 01 , 2025 | 11:04 AM