Share News

Colon Cancer: ఒక్క చుక్క రక్తంతో క్లోమ క్యాన్సర్‌ నిర్ధారణ

ABN , Publish Date - Feb 16 , 2025 | 05:10 AM

ప్రాణాంతకమైన క్లోమ క్యాన్సర్‌ను కేవలం ఒక చుక్క రక్తంతో, అతి తక్కువ ఖర్చుతో గుర్తించే పరీక్ష త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ దిశగా ఒరెగాన్‌ హెల్త్‌ అండ్‌ సైన్స్‌ యూనివర్సిటీ (ఓహెచ్‌ఎ్‌సయూ) పరిశోధకులు పీఏసీ-ఎంఏఎన్‌ఎన్‌(ప్యాక్‌మాన్‌) అనే రక్తపరీక్షను అభివృద్ధి చేశారు.

Colon Cancer: ఒక్క చుక్క రక్తంతో క్లోమ క్యాన్సర్‌ నిర్ధారణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ప్రాణాంతకమైన క్లోమ క్యాన్సర్‌ను కేవలం ఒక చుక్క రక్తంతో, అతి తక్కువ ఖర్చుతో గుర్తించే పరీక్ష త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ దిశగా ఒరెగాన్‌ హెల్త్‌ అండ్‌ సైన్స్‌ యూనివర్సిటీ (ఓహెచ్‌ఎ్‌సయూ) పరిశోధకులు పీఏసీ-ఎంఏఎన్‌ఎన్‌(ప్యాక్‌మాన్‌) అనే రక్తపరీక్షను అభివృద్ధి చేశారు. పరిశోధనల్లో భాగంగా ప్యాంక్రియాటిక్‌ డక్టల్‌ అడోనోకార్సినోమా (పీడీఏసీ) రోగుల్లో మరింత చురుగ్గా ఉండే నిర్దిష్ట ప్రొటీన్లు, ప్రధానంగా ప్రొటీజెస్‌ కోసం 350మంది రక్త నమూనాలను పరిశీలించారు. పీడీఏసీ అనేది క్లోమ క్యాన్సర్‌లో అత్యంత ప్రాణాంతకమైన రకం. ఇది సంధానకణజాలాన్ని బలహీనపర్చడం ద్వారా కేన్సర్‌ కణితులు పెరగడానికి దోహదం చేస్తుంది. ఈ ప్రొటీన్లను గుర్తించడం ద్వారా క్లోమ క్యాన్సర్‌ను 98శాతం కచ్చితత్వంతో నిర్ధారించగల పరీక్షను రూపొందించారు.


ఈ అధ్యయనం వివరాలు సైన్స్‌ ట్రాన్స్‌లేషనల్‌ మెడిసిన్‌ జర్నల్‌లో తాజాగా ప్రచురితమయ్యాయి. కేవలం ఒక్క చుక్క రక్తాన్ని పరీక్షించడం ద్వారా 45 నిమిషాల్లోనే ఫలితం వెలువడే ఈ పరీక్షకు రూపాయి కంటే తక్కువ ఖర్చవుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. శరీరంపై కోత పెట్టాల్సిన అవసరం లేకుండా అతి తక్కువ సమయంలో క్యాన్సర్‌ను గుర్తించే ఈ పరీక్ష.. వ్యాధి నిర్ధారణలో మేలిమలుపు కాగలదని, క్యాన్సర్‌ మరణాల నివారణకు తోడ్పడుతుందని భావిస్తున్నారు. కాగా, క్లోమ క్యాన్సర్‌ సోకిన తర్వాత బతికి బయటపడిన వారు చాలా తక్కువ. ప్రతి నలుగురిలో ఒక్కరే ఏడాది అంతకంటే ఎక్కువ కాలం జీవిస్తారని అంచనా. వ్యాధిని త్వరగా గుర్తించలేకపోవడమే దీనికి ప్రధాన కారణం. 2024లో క్లోమ క్యాన్సర్‌ బారిన పడి 50వేల మందికి పైగా మరణించారు.

Updated Date - Feb 16 , 2025 | 05:10 AM