CP Radhakrishnan: ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ నామినేషన్
ABN , Publish Date - Aug 20 , 2025 | 05:19 PM
నామినేషన్ పత్రాల దాఖలు అనంతరం సీపీ రాధాకృష్ణన్ విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేసారు. ఉపరాష్ట్రపతి పదవికి రాధాకృష్ణన్ వన్నెతెస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) బుధవారంనాడు తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు మంత్రుల సమక్షంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను రాధాకృష్ణన్ సమర్పించారు.
నామినేషన్ ప్రక్రియలో భాగంగా నాలుగు సెట్ల పేపర్లు దాఖలు చేశారు. తొలి సెట్‌కు చీఫ్ ప్రపోజర్‌గా ప్రధాని ఉన్నారు. నామినేషన్ పత్రాల దాఖలుకు ముందు సీపీ రాధాకృష్ణన్ ప్రేరణా స్థల్ వద్ద మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. నామినేషన్ పత్రాల దాఖలు అనంతరం సీపీ రాధాకృష్ణన్ విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేసారు. నామినేషన్ పత్రాల దాఖలుకు మంత్రులు, ఎన్డీయే నేతలతో కలిసి వెళ్లామని, ఉపరాష్ట్రపతి పదవికి రాధాకృష్ణన్ వన్నెతెస్తారని, దేశం మరింత ప్రగతి పథంలోకి వెళ్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.
సెప్టెంబర్ 9న ఉప రాష్ట్రపతి ఎన్నికల జరగనుండగా, విపక్ష 'ఇండియా' కూటమి ఇప్పటికే తమ అభ్యర్థిని ప్రకటించింది. దీంతో ఎన్నిక అనివార్యమైంది. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్ రెడ్డిని విపక్ష కూటమి ఎంపిక చేసింది.
ఇవి కూడా చదవండి..
లోక్‌సభలో ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి
లోక్‌సభ ముందుకు కీలక బిల్లులు.. బిల్లు ప్రతులను చించి పడేసిన ప్రతిపక్ష ఎంపీలు..
For National News And Telugu News