Vice Presidential Election: మోదీతో విందు, ప్రత్యేక సెమినార్.. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎన్డీయే వ్యూహం
ABN , Publish Date - Sep 01 , 2025 | 09:44 PM
ప్రతి రాష్ట్రం నుంచి ఎన్డీయే ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఢిల్లీకి తీసుకు వచ్చే బాధ్యతను పలువురు మంత్రులు, ఎంపీలపై ఉంచినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగనుండగా దీనికి ఒకరోజు ముందు సెప్టెంబర్ 8న ఎన్డీయే ఎంపీలందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిన్నర్ ఇవ్వనున్నారు.
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికకు మరికొద్ది రోజులు మాత్రమే ఉండటంతో తమ అభ్యర్థి గెలుపు కోసం బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే (NDA) తుది వ్యూహానికి మెరుగులు దిద్దుతోంది. కూటమికి చెందిన 425 మంది ఎంపీలు హాజరై 100 శాతం ఓటింగ్ జరిగేలా చూసేందుకు కసరత్తు చేస్తోంది.
ప్రతి రాష్ట్రం నుంచి ఎన్డీయే ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఢిల్లీకి తీసుకు వచ్చే బాధ్యతను పలువురు మంత్రులు, ఎంపీలపై ఉంచినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగనుండగా దీనికి ఒకరోజు ముందు సెప్టెంబర్ 8న ఎన్డీయే ఎంపీలందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిన్నర్ ఇవ్వనున్నారు.
ఎంపీలకు ఓటింగ్ ప్రక్రియపై వర్క్‌షాప్
ఓటింగ్ ప్రక్రియపై అవగాహన కోసం ఎంపీలందరికీ మూడు రోజుల పాటు వర్క్‌షాప్‌ను ఎన్డీయే కూటమి నిర్వహించనుంది. బ్యాలెట్‌ను కరెక్ట్‌గా మార్క్ చేయడం, ఎన్నికల అధికారికి ఇచ్చే పెన్‌ను తప్పనిసరిగా ఉపయోగించడం, చెల్లని ఓట్లకు అవకాశం ఇవ్వకుండా ఏవిధంగా బ్యాలెట్‌ను సరిగా ఫోల్డ్ చేయాలనే దానిపైన వర్క్‌షాప్‌లో వివరిస్తారు. సీక్రెట్ బ్యాలెట్ ఎన్నిక కావడంతో విప్ అనేది వర్తించదు. ఆ దృష్ట్యా చెల్లని ఓట్లను, క్రాస్ ఓటింగ్‌ను నిరోధించడంపై ఎన్డీయే ప్రధానంగా దృష్టి సారిస్తోంది. తమకున్న 425 ఎంపీల బలానికి తోడు అదనపు మద్దతు పొందేందుకు కూడా కూటమి నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అభ్యర్థి గెలుపునకు అవసరమైన మెజారిటీ మార్క్ 391 ఓట్లు కాగా, ఎన్డీయేకు 425 ఓట్ల బలం ఉంది. 11 మంది ఎంపీలున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎన్డీయేకు మద్దతు ప్రకటించింది. కాగా, ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర ప్రస్తుత గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బరిలో ఉండగా, ఆయనపై పోటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్ రెడ్డిని విపక్ష 'ఇండియా' కూటమి నిలబెట్టింది.
ఇవి కూడా చదవండి..
అధికారిక నివాసం నుంచి ఫామ్‌హౌస్‌కు మారిన జగదీప్ ధన్‌ఖడ్
ముంబై వీధులను రేపటిలోగా ఖాళీ చేయండి.. హైకోర్టు హుకుం
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..