Share News

Parliament Deadlock: పార్లమెంటులోప్రతిష్టంభనపై.. నేడు ఎన్డీయే.. 7న ఇండియా

ABN , Publish Date - Aug 05 , 2025 | 04:03 AM

బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణపై ప్రతిపక్షాలు బుధవారం కూడా లోక్‌సభలో తీవ్ర గందరగోళం సృష్టించాయి. ఓటర్ల

Parliament Deadlock: పార్లమెంటులోప్రతిష్టంభనపై.. నేడు ఎన్డీయే.. 7న ఇండియా

  • కూటముల భేటీ

న్యూఢిల్లీ, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణపై ప్రతిపక్షాలు బుధవారం కూడా లోక్‌సభలో తీవ్ర గందరగోళం సృష్టించాయి. ఓటర్ల జాబితా సవరణపై పార్లమెంట్‌లో చర్చించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఉభయ సభలు కొనసాగలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఆదివారం రాత్రి రాష్ట్రపతి ముర్ముతో సమావేశం అయ్యారు. కానీ, ఇటీవల మోదీ బ్రిటన్‌, మాల్దీవుల పర్యటన తర్వాత రాష్ట్రపతిని మర్యాద పూర్వకంగా కలిసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే.. పార్లమెంట్‌లో ఏర్పడిన ప్రతిష్టంభనపైనే మోదీ చర్చించినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు, ఒడిసాలో వరుసగా జరుగుతున్న అత్యాచార ఘటనలపై వివరణ ఇచ్చేందుకు రాష్ట్రపతిని హోంమంత్రి అమిత్‌ షా కలిసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే, జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించే విషయంపై మోదీ, అమిత్‌షా రాష్ట్రపతిని కలిసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణపై చిచ్చు రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రతిపక్షాలపై దాడిని ఎక్కు పెట్టేందుకు మోదీ మంగళవారం ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల షెడ్యూలు రీత్యా మొత్తం ఎన్డీయే ఎంపీలను సంఘటితం చేసి, అధికార కూటమి అభ్యర్థిని గెలిపించేందుకు అవసరమైన వ్యూహరచనను ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది. ప్రతిపక్షాలు కూడా సంఘటిత కార్యాచరణను రూపొందించేందుకు ఈ నెల 7న భేటీకానున్నాయి. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ ఇవ్వనున్నారు. కూటమి నేతలంతా బిహార్‌ ఓటర్ల జాబితా అంశంపై నిరసనలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈనెల 8న ఎన్నికల కమిషన్‌(ఈసీఐ) కార్యాలయం వరకు ఊరేగింపుగా వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి..

శ్రీకృష్ణుడే మొదటి రాయబారి.. సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

గల్వాన్ వ్యాలీ వివాదంలో రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు వార్నింగ్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 05 , 2025 | 04:03 AM