Madhya Pradesh: భారత ఆర్మీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఈసారి డిప్యూటీ సీఎం..
ABN , Publish Date - May 16 , 2025 | 07:04 PM
మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్‌పూర్‌లో జరిగిన పౌర రక్షణ వలంటీర్ల శిక్షణా శిబిరంలో ఉప ముఖ్యమంత్రి జగదీశ్ దేవ్డా మాట్లాడుతూ, పహల్గాం ఉగ్రవాదులకు మోదీ దీటుగా జవాబిచ్చారని ప్రశంసించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మోదీ తీసుకున్న నిర్ణయానికి యావద్దేశంతోపాటు, మిలటరీ మొత్తం ఆయన పాదాలకు మొక్కాలని అన్నారు.
భోపాల్: కల్నల్ సోషియా ఖురేషి (Sofia Qureshi)పై మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా (Vijay Shah) ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. తాజాగా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జగదీశ్ దేవ్డా(Jagdish Devda) ఇండియన్ ఆర్మీపై చేసిన వ్యాఖ్యలు సైతం తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. ''భారత ఆర్మీతో సహా యావద్దేశం నరేంద్ర మోదీ పాదాలకు మొక్కాలి'' అని దేవ్డా అన్నారు.
Indus Water Treaty: తుల్‌బుల్‌పై ఒమర్, మెహబూబా మాటల తూటాలు
జబల్‌పూర్‌లో జరిగిన పౌర రక్షణ వలంటీర్ల శిక్షణా శిబిరంలో జగదీశ్ దేవ్డా మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రవాదులకు మోదీ దీటుగా జవాబిచ్చారని ప్రశంసించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మోదీ తీసుకున్న నిర్ణయానికి యావద్దేశంతోపాటు, మిలటరీ మొత్తం ఆయన పాదలకు మొక్కాలని అన్నారు. ముఖ్యంగా మోదీ సారథ్యంలో పాక్ ఉగ్రవాదులపై తీసుకున్న నిర్ణయాత్మక చర్యలను ఎంత పొడిగినా తక్కువేనని కొనియాడారు. పహల్గాంలో ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా టూరిస్టులను వారి భార్యాపిల్లల కళ్లముందే మతం అడిగి మరీ కాల్చిచంపారని, ఇలాంటి కిరాతకులకు బదులిచ్చి తీరాల్సిందేనని అన్నారు. మిలిటెంట్లు, వారి మద్దతుదారులను మట్టుబెట్టేంత వరకూ దేశం విశ్రమించకూడదని చెప్పారు.
జవాన్ల సాహసాలను కించపరుస్తారా?: ప్రియాంక గాంధీ
దేవ్డా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా విమర్శలు గుప్పించారు. ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరమని, సిగ్గుచేటని మండిపడ్డారు. ''మహిళా సైనికులపై మధ్యప్రదేశ్ మంత్రి ఒకరు మొదట అవమానకర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం మన సాయుధ బలగాలను అవమానిస్తూ మాట్లాడారు. యావద్దేశం మన జవాన్ల సాహసాలను అభినందిస్తోంది. కానీ, బీజేపీ నేతలు మాత్రం జవాన్ల సాహసాలను నిరంతరం కించపరుస్తూనే ఉన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడిన నేతలను ఆ పార్టీ శిక్షించడానికి బదులు, వారికి కొమ్ము కాస్తోంది. ఇలాంటి వ్యాఖ్యలు ద్వారా దేశ ప్రజలకు, జవాన్లకు బీజేపీ ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటోంది?'' అంటూ సోషల్ మీడియా పోస్ట్‌లో ప్రియాంక ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
Operation Sindoor: భారత్ వ్యూహాత్మక సత్తాను ఆపరేషన్ సిందూర్ చాటింది: అమిత్‌షా
Defence Budget: ఆపరేషన్ సిందూర్ సక్సెస్.. ఆర్మీకి మరో 50 వేల కోట్ల నిధులు
Indian Army Encounter: పల్వామాలో ఎన్‌కౌంటర్.. 48 గంటల్లో ఆరుగురు ఉగ్రవాదుల హతం..