Modi Urges Peace and Trust: కొండలు లోయల మధ్యవిశ్వాసమనే వారధి వేయాలి
ABN , Publish Date - Sep 14 , 2025 | 06:51 AM
భరతమాత కిరీటంలో మణిపూర్ ఒక రత్నం అక్కడ ఎలాంటి హింసకు తావుండొద్దు ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ప్రధాని మోదీ భరతమాత కిరీటంలో మణిపూర్ ఒక రత్నం.. అక్కడ హింసకు తావు ఉండొద్దు:...
భరతమాత కిరీటంలో మణిపూర్ ఒక రత్నం అక్కడ ఎలాంటి హింసకు తావుండొద్దు ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ప్రధాని మోదీ భరతమాత కిరీటంలో మణిపూర్ ఒక రత్నం.. అక్కడ హింసకు తావు ఉండొద్దు: మోదీ
ఇంఫాల్/చురాచంద్‌పూర్/ఐజ్వాల్, సెప్టెంబరు 13: తెగల మధ్య ఘర్షణలతో అతలాకుతలమైన మణిపూర్‌లో శాంతి నెలకొనాలని, వేగంగా అభివృద్ధి సాధించాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఆ రాష్ట్రంలోని కొండ ప్రాంతాల్లో ఉండే కుకీ తెగ, లోయ ప్రాంతాల్లో ఉండే మైతేయి తెగ ప్రజల మధ్య పరస్పర నమ్మకం పెరగాలంటూ.. ‘కొండలు, లోయ ప్రజల మధ్య పరస్పర విశ్వాసమనే బలమైన వంతెన వేయాలి’ అని పిలుపునిచ్చారు. భారత మాత కిరీటంలో మణిపూర్ ఒక రత్నమని అభివర్ణించారు. అక్కడ ఎలాంటి హింసకు తావు ఉండొద్దని పేర్కొన్నారు. శనివారం ఈశాన్య రాష్ట్రాలు మణిపూర్, మిజోరం, అసోంలలో పర్యటించిన ప్రధాని మోదీ పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మణిపూర్‌లోని చురాచంద్‌పూర్, ఇంఫాల్‌లోని కాంగ్లా కోటలో నిర్వహించిన సభల్లో మోదీ ప్రసంగించారు. అసోం రాజధాని గౌహతిలో రోడ్ షో నిర్వహించారు. ప్రఖ్యాత సంగీతకారుడు భూపేన్ హజారికా జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.
ఘర్షణలు జరిగిన రెండేళ్ల తర్వాత..
2023 మేలో మణిపూర్‌లో మైతేయిలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న ప్రతిపాదనలకు, పలు కొండ ప్రాంతాలను రిజర్వు ఫారెస్టులు ప్రకటించడానికి వ్యతిరేకంగా కుకీలు ఆందోళనకు దిగారు. ప్రతిగా మైతేయిలు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో చురాచంద్‌పూర్ కేంద్రంగా కుకీలు, మైతేయిల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. ఇరుతెగలకు చెందిన 260 మందికిపైగా మృతిచెందారు. ఈ ఘర్షణల తర్వాత తొలిసారిగా శనివారం మోదీ మణిపూర్‌లో పర్యటించారు. చురాచంద్‌పూర్‌లోని పునరావాస శిబిరంలో, ఇంఫాల్‌లోని కాంగ్లా కోటలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నో ఘర్షణలు, వివాదాలను తాము గత పదకొండేళ్లలో పరిష్కరించామని పేర్కొన్నారు. అభివృద్ధి చెందాలంటే శాంతి ముఖ్యమని.. మణిపూర్‌లో శాంతి నెలకొనేందుకు అన్ని గ్రూపులు ముందుకు రావాలని మోదీ విజ్ఞప్తి చేశారు. మణిపూర్ ఘర్షణల్లో నిర్వాసితులైన వారి కోసం 7 వేల ఇళ్లను మంజూరు చేస్తున్నామని, రాష్ట్రానికి రూ.3 వేల కోట్ల ప్యాకేజీ ఇస్తున్నామని ప్రకటించారు.
ఓటు బ్యాంకు రాజకీయాలతో దెబ్బ
ఇన్నాళ్లూ ఓటు బ్యాంకు రాజకీయాలు, నిర్లక్ష్యం కారణంగా ఈశాన్య రాష్ట్రాలు వెనుకబడ్డాయని.. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటయ్యాక అభివృద్ధి వేగం పుంజుకుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. శనివారం ఆయన మిజోరం రాష్ట్ర రాజధాని ఐజ్వాల్‌లో రూ.9 వేల కోట్ల విలువైన పథకాలను, ఐజ్వాల్-ఢిల్లీ తొలి రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించారు. తర్వాత జరిగిన సభలో మాట్లాడారు. గత పదకొండేళ్లుగా తాము మిజోరం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టామని, రాష్ట్రం ఇప్పుడు దేశ అభివృద్ధిలో చోదక శక్తిగా మారిందని మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలో క్రీడలకు భారత్ ముఖ్యమైన హబ్‌గా మారుతోందని, అందులో మిజోరం పాత్ర ఎంతో ఉందని తెలిపారు. ప్రధాని మోదీ ఎనిమిదేళ్ల తర్వాత మిజోరంలో పర్యటించడం గమనార్హం. జీఎస్టీలో చేసిన మార్పులతో దేశ ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని మోదీ చెప్పారు. ‘‘2014కు ముందు టూత్‌పేస్టులు, సబ్బులు, నూనెల వంటివాటిపై 27శాతం పన్ను ఉండేది. ఇప్పుడు జీఎస్టీలో వాటిపై 5శాతమే పన్ను ఉంది. కేన్సర్ వంటి ఔషధాల ధరలు తగ్గుతాయి. వాహనాల ధరలు ఇప్పటికే తగ్గిస్తున్నారు’’ అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Congress AI Video On PM Mother: మోదీ తల్లిపై కాంగ్రెస్ వివాదాస్పద ఏఐ వీడియో.. బీజేపీ ఫైర్
Vijay Statewide Tour: రాజుల తరహాలోనే ప్రజాస్వామ్య యుద్ధానికి ముందు మీ ముందుకొచ్చా
For More National News and Telugu News