Chicken Neck: సెవన్ సిస్టర్స్‌పై యూనస్ వ్యాఖ్యలకు భారత్ కౌంటర్ ప్రాజెక్ట్ ఇదే..
ABN , Publish Date - May 18 , 2025 | 09:42 PM
షిల్లాంగ్ టు సిల్చార్ వరకూ హైవే నిర్మాణానికి భారత ప్రభుత్వం ఇటీవల గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈశాన్య రాష్ట్రాలు, కోల్‌కతా మధ్య సముద్ర మార్గం ద్వారా ప్రత్యామ్నాయ లింక్‌గా ఈ హైవే ఉంటుంది. నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్ఐడీసీఎల్)కు చెందిన ఒక అధికారి ఈ సమాచారం ఇచ్చారు.
న్యూఢిల్లీ: భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలను ఉద్దేశించి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ మహ్మద్ యూనస్ ఇటీవల చైనాలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సెవన్ సిస్టర్స్‌గా పిలిచే ఏడు ఈశాన్య రాష్ట్రాలకు సముద్ర మార్గం లేదని, సముద్రం తీరంతో ఈ ఏడు రాష్ట్రాలకు బంగ్లాదేశ్ సాగర రక్షకుడిగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. బ్యాంకాక్ వేదికగా గత శుక్రవారం జరిగిన బిమ్‌స్టెక్ సదస్సు సందర్భంగా యూనస్, భారత ప్రధాని మోదీ భేటీ అయినప్పుడు దీనికి సున్నితంగానే మోదీ బదులిచ్చారు. ఈ తరహా వ్యాఖ్యలు మంచిది కాదన్నారు. ఇదే సమయంలో.. షిల్లాంగ్ టు సిల్చార్ వరకూ హైవే నిర్మాణంతో భారత ప్రభుత్వం బంగ్లాదేశ్‌కు ఇప్పుడు దీటైన జవాబు కూడా ఇవ్వబోతోంది.
Himant Biswa Sarma: ఐఎస్ఐ ఆహ్వానంపై పాక్ వెళ్లిన కాంగ్రెస్ ఎంపీ.. సీఎం సంచలన వ్యాఖ్యలు

ఏమిటీ హైవే?
షిల్లాంగ్ టు సిల్చార్ వరకూ హైవే నిర్మాణానికి భారత ప్రభుత్వం ఇటీవల గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈశాన్య రాష్ట్రాలు, కోల్‌కతా మధ్య సముద్ర మార్గం ద్వారా ప్రత్యామ్నాయ లింక్‌గా ఈ హైవే ఉంటుంది. నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్ఐడీసీఎల్)కు చెందిన ఒక అధికారి ఈ సమాచారం ఇచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న ఈ ప్రాజెక్టుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి అయ్యే అంచనా వ్యయం రూ.22,864 కోట్లు. ప్రాజెక్టు పొడుగు మేఘాలయలో 144.8 కిలోమీటర్లు, అసోంలో 22 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్టు పూర్తయిందంటే ఈశాన్య రాష్ట్రాలకు మార్గంగా ఉంటూ వస్తున్న సిలిగిరి ప్రాజెక్టుపై ఆధారపడటం తగ్గిపోతుంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వయిజర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు ఈ హైవే ప్రాజెక్టే గట్టి సమాధానం అవుతుందని ఎన్‌హెచ్‌ఐడీసీఎల్ అధికారి తెలిపారు.
కాగా, ఈ ప్రాజెక్టుకు ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే.. 166.8 కిలోమీటర్ల ఫోర్ లేన్ హైవేను షిల్లాంగ్ సమీపంలోని మావ్లింగ్ఘుంగ్ నుంచి అసోంలోని నేషనల్ హైవే-6పై సిల్చార్ సమీపంలోని పాంచగ్రామ్ వరకూ నిర్మించనున్నారు. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి ఇది తొలి హైస్పీడ్ కారిడార్ ప్రాజెక్టు కానుంది. రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ మంత్రిత్వ శాఖతో కలిసి ఎన్‌హెచ్‌ఐడీసీఎల్ దీనిని అభివృద్ధి చేస్తోంది. 2030 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంది.
దీనికి అదనంగా, కలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్టుకు మయన్మార్‌లోని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఫండింగ్ చేస్తోంది. ఈ ప్రాజెక్టు కోల్‌కతా నౌకాశ్రయాన్ని మయన్మార్‌లోని పాలెట్వాను సముద్రమార్గం ద్వారా కలుపుతుంది. మిజోరాంలోని జోరిన్‌పుయీని రోడ్డు మార్గం ద్వారా కూడా కలుపుతుంది. ఇది పూర్తయితే బంగ్లాదేశ్‌ను ఇండియా పట్టించుకోనవసరం లేదు. కలాదాన్ ప్రాజెక్టు ద్వారా ఈశాన్య ప్రాంతం సరుకులు విశాఖపట్నం, కోల్‌కతా చేరుకుంటాయి. ఇక బంగ్లాదేశ్‌పై ఆధారపడాల్సిన అవసరం ఎంతమాత్రం ఉండదు. ఈ హైస్పీడ్ కారిడార్ అందుబాటులోకి వచ్చిందంటే ఈ మార్గంలో ఈజీగా సరకు రవాణా జరగడంతోపాటు ఈ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలూ శీఘ్రగతిన పెరుగుతాయి. ప్రస్తుతం సిలిగురి కారిడార్ ద్వారా మాత్రమే ఏడు ఈశాన్య రాష్ట్రాలకు చేరాల్సి వస్తోంది. దీనినే 'చికెన్ నెక్'గా పిలుస్తుంటారు.
ఇవి కూడా చదవండి..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. మరో వీడియో విడుదల చేసిన ఆర్మీ
India Pakistan Ceasefire: సీజ్‌ఫైర్‌పై భారత ఆర్మీ సంచలన ప్రకటన.. ఏం చెప్పిందంటే..