Modi Criticizes Congress: బిహార్‌లో వలసల పాపం కాంగ్రెస్‌సదే
ABN , Publish Date - Sep 16 , 2025 | 06:39 AM
బిహార్‌లో వలస చొరబాట్లు పెరగడానికి కాంగ్రెస్, దాని మిత్రపక్షాలే కారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. అక్రమ వలసదారులను తాము పంపించి వేస్తున్నామని...
కావాలనే నాడు చొరబాట్లు పెంచారు.. వాళ్లందరినీ మేం పంపించివేస్తున్నాం
బిహార్ పర్యటనలో మోదీ వ్యాఖ్యలు
పూర్నియా, సెప్టెంబరు 15 : బిహార్‌లో వలస చొరబాట్లు పెరగడానికి కాంగ్రెస్, దాని మిత్రపక్షాలే కారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. అక్రమ వలసదారులను తాము పంపించి వేస్తున్నామని తెలిపారు. పాకిస్థానీయులతోపాటు బంగ్లా, నేపాల్, అఫ్ఘానిస్థాన్ నుంచి అక్రమంగా ప్రవేశించిన వారు సైతం .ఓటుహక్కు పొందినట్టు ఇటీవల బిహార్‌లో ఈసీ నిర్వహించిన సమగ్ర ఓట్ల సవరణ (సర్) ప్రక్రియలో తేలింది. బిహార్‌లోని పూర్నియాలో సోమవారం జరిగిన సభలో ఈ అంశాన్ని మోదీ ప్రస్తావించారు. కాంగ్రెస్, ఆర్జేడీలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, దాని మిత్రులు అధికారంలో ఉన్నప్పుడు బిహార్‌లో కావాలనే చొరబాట్లను పెంచారని, ఎన్డీయే ప్రభుత్వం వారందరినీ పంపించివేస్తోందని అన్నారు. బిహార్‌ను బీడీతో ముడిపెట్టి అవమానించిన కాంగ్రెస్ పార్టీకి గట్టిబుద్ధి చెప్పాలని బిహారీలను ఆయన కోరారు. పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ విషయంలో కేంద్రం విధానాన్ని విమర్శిస్తూ కేరళ కాంగ్రెస్ ‘బీడీలు..బిహార్..’ అంటూ సోషల్‌మీడియాలో పోస్టు పెట్టి.. ఆ తర్వాత తీసివేసింది. దీనిపై మోదీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘‘బీడీ.. బిహార్.. బీతో మొదలవుతాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. వారి వైఖరి బిహారీలను తీవ్రంగా అవమానించింది. కాంగ్రె్‌సకు, ఆ పార్టీ మిత్రపక్షాలకు రానున్న రోజుల్లో బిహార్ ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారు’’ అని హెచ్చరించారు. ‘‘గతంలో ఆర్జేడీ, కాంగ్రెస్ అస్తవ్యస్థ పాలన వల్ల బిహార్ ఎంతో నష్టపోయింది. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే వారు చూసి ఓర్చుకోలేరు. రానున్న ఎన్నికల్లో ఇందుకు వారు మూల్యం చెల్లించుకుంటారు.’’ అని మోదీ మండిపడ్డారు. పేదలకు అండగా నిలవడమే మోదీ విధానమని ప్రధాని వ్యాఖ్యానించారు. రైతుల ప్రయోజనం కోసం నేషనల్ మఖన బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రూ.40వేల కోట్ల విలువైన పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
మరోవైపు ‘‘ఎన్డీయేతో ఉన్నా.. ఇకముందూ ఉంటాను’ అని బిహార్ సీఎం నితీశ్‌కుమార్ వ్యాఖ్యానించారు. గతంలో ఆర్జేడీతో కలిసి అధికారం పంచుకోవాల్సి రావడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇకముందు అలా జరగబోదని ప్రధాని మోదీ సమక్షంలోనే నితీశ్ వెల్లడించడం గమనార్హం. వారిద్దరూ కలిసి బిహార్‌లోని పూర్నియాలో జరిగిన సభలో పాల్గొన్నారు. ‘‘బీజేపీతో కలిసి 2005 నవంబరులో ప్రభుత్వం ఏర్పాటుచేశాను. ఆ తర్వాత ఒకటి, రెండు సార్లు పక్కకు పోయాను. పార్టీ సహచరుల్లో కొందరి ఒత్తిడే దీనికి కారణం. ఆ సహచరుల్లో ఒకరు ఇప్పుడు ఈ వేదికపైనే ఉన్నారు’’ అంటూ కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లలన్) వైపు నితీశ్ సరదాగా వేలు చూపించారు. అయినా.... అదంతా గతమని, అప్పట్లో వారితో ఇమడలేకపోయేవాడినని, ఎప్పుడూ ఏదొక తప్పుడు పని చేస్తుండేవారన్నారు. నవ్వుతూ నితీశ్ వ్యాఖ్యలను మోదీ స్వాగతించారు.
‘సిందూర్’ సాహసం భేష్ : శ్లాఘించిన ప్రధాని
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ఆదర్శప్రాయ భూమికను సైనిక బలగాలు పోషించాయని మోదీ శ్లాఘించారు. కోల్‌కతాలోని ఈస్ట్రన్ కమాండ్ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన కమాండర్ల సదస్సును ప్రారంభించారు. అనంతరం ‘ఇండియన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ విజన్-2047’ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు. భవిష్యత్ దిశగా ఆర్మీ బలగాలు వేసే అడుగులతో ఈ డాక్యుమెంట్ నిండి ఉన్నదని తెలిపారు. కాగా, ఆపరేషన్ సిందూర్ తర్వాత కమాండర్ల సదస్సు జరగడం ఇదే మొదటిసారి. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్, జాతీయభద్రతా సలహాదారు డోభాల్, సీడీఎస్ అనిల్ చౌహాన్, రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్‌కుమార్, త్రివిధ దళాల అధిపతులు తొలిరోజు సదస్సులో పాల్గొన్నారు. వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద స్థావరాలను కూల్చివేయడంలోను, పాకిస్థాన్ లోపలకు చొచ్చుకెళ్లి అక్కడా లక్ష్యాలను ఛేదించి ముష్కరులకు బుద్ధిచెప్పడంలోను సిందూర్ విజయవంతం అయిందని భద్రతాధికారులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళలకు రాజకీయ అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్
భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
For AP News And Telugu News