Couple Love Tragedy: ప్రాణంగా ప్రేమించుకున్నారు.. ఆ ఒక్క విషయంలో భయపడి..
ABN , Publish Date - Sep 26 , 2025 | 08:35 AM
గత కొద్దిరోజుల నుంచి కాలేజీకి వెళ్లటం లేదు. ఇక, సతీష్ ఐటీఐ కంప్లీట్ చేసి జాబ్‌లో జాయిన్ అయ్యాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుందామని అనుకున్నారు.
ఈ సృష్టిలో అద్భుతమైన అనుభవం, అదృష్టం ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా ఓ వ్యక్తి ప్రేమను పొందటమే. ప్రేమలో ఉన్నవారు మాత్రమే దాన్ని అనుభూతి చెందగలరు. ప్రేమించటం ఒకఎత్తయితే, ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లటం మరో ఎత్తు. నూటికి 70 శాతం ప్రేమ కథలు ఇక్కడే ఆగిపోతూ ఉంటాయి. కులం, మతం, ప్రాంతం, ఆర్థిక పరిస్థితులు ఇలా ఏదో ఒక విషయం చాలా వరకు ప్రేమ జంటల్ని పెళ్లి వరకు వెళ్లనీయకుండా ఆపేస్తూ ఉంటుంది. కలిసి బతకలేమని తెలిసిన కొన్ని ప్రేమ జంటలు ప్రాణాలు తీసుకుంటున్నాయి.
తాజాగా, పెద్దలు పెళ్లికి ఒప్పుకోరన్న భయంతో ఓ మైనర్ ప్రేమ జంట ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కోలార్ జిల్లాలోని షెత్తహళ్లి గ్రామానికి చెందిన 18 ఏళ్ల సతీష్, పనమకనహళ్లి గ్రామానికి చెందిన 17 ఏళ్ల శ్వేత ప్రేమించుకున్నారు. శ్వేత మలుర్‌లోని ఓ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదువుతూ ఉండేది. గత కొద్దిరోజుల నుంచి కాలేజీకి వెళ్లటం లేదు. ఇక, సతీష్ ఐటీఐ కంప్లీట్ చేసి జాబ్‌లో జాయిన్ అయ్యాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుందామని అనుకున్నారు.
అయితే, ఇద్దరి కులాలు వేరు కావటంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోరని భయపడ్డారు. విడిపోయి జీవించటం కంటే చావటం మేలని అనుకున్నారు. బుధవారం ఉదయం ఇద్దరూ ఇంటినుంచి బయటకు వచ్చారు. బ్యార్తరాయణహళ్లి దగ్గర రైలుకింద పడి ప్రాణాలు తీసుకున్నారు. రైలు 50 మీటర్లు ఈడ్చుకెళ్లి మరీ శ్వేత ప్రాణాలు తీసింది. ఇక, సతీష్ శరీరం ముక్కలుముక్కలు అయింది. ఉదయం 9 గంటల సమయంలో ఇద్దరి కుటుంబసభ్యులకు సమాచారం అందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న వారు కన్నీరు మున్నీరుగా విలపించారు. తమకు వారు ప్రేమించుకుంటున్న విషయం తెలియదని, తెలిసి ఉంటే పెళ్లి చేసే వారమంటూ గుండెలు అవిసేలా ఏడ్చారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
సీబీఐకి సుగాలి ప్రీతి కేసు.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం