Share News

Air Traffic Control: ఎమర్జెన్సీలో.. మేడే

ABN , Publish Date - Jun 13 , 2025 | 06:05 AM

విమానంలో అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు పైలట్‌.. సంబంధిత ‘ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌’ (ఏటీసీ)కి మేడే కాల్‌ చేస్తారు. అవతలి వారికి స్పష్టంగా వినిపించటం కోసం ‘మేడే, మేడే, మేడే’ అంటూ మూడుసార్లు చెబుతారు.

Air Traffic Control: ఎమర్జెన్సీలో..  మేడే

ముప్పు ముంగిట ఏటీసీకి పైలట్‌ పంపే హెచ్చరిక

  • సాయం చేయండి అని అర్థం

  • కాల్‌ రాగానే ఎమర్జెన్సీ మోడ్‌లోకి ఏటీసీ

  • విమానానికి పూర్తి ట్రాఫిక్‌ క్లియరెన్స్‌

న్యూఢిల్లీ, జూన్‌ 12: విమానంలో అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు పైలట్‌.. సంబంధిత ‘ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌’ (ఏటీసీ)కి మేడే కాల్‌ చేస్తారు. అవతలి వారికి స్పష్టంగా వినిపించటం కోసం ‘మేడే, మేడే, మేడే’ అంటూ మూడుసార్లు చెబుతారు. ఇంజిన్‌ ఫెయిల్‌ కావటం, అగ్నిప్రమాదం సంభవించటం, విమానం మీద నియంత్రణ కోల్పోవటం, పీడనంలో అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకోవటం వంటి సందర్భాల్లో మే డే కాల్‌ చేస్తుంటారు. మే డే అనేది ఫ్రెంచి పదం ‘మెయ్‌డెజ్‌’ నుంచి పుట్టింది. ఈ పదానికి.. ‘సాయం చేయండి’ అని అర్థం. 1920ల నుంచి మేడే కాల్‌ని అంతర్జాతీయంగా అమలు చేయటం మొదలైంది. ఒక విమాన పైలట్‌ ‘మే డే’ కాల్‌ చేసినప్పుడు.. ఏటీసీ సిబ్బంది ఎమర్జెన్సీ ప్రొటోకాల్స్‌ను అమలు చేస్తారు. ఆ విమానానికి గగనతలంలో ట్రాఫిక్‌ పరంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా చూస్తారు. పైలట్‌తో ప్రత్యక్ష కమ్యూనికేషన్‌లోకి వస్తారు. ఆ విమానం దిగే ఎయిర్‌పోర్ట్‌ ఎమర్జెన్సీ విభాగంతో సమన్వయం చేసుకుంటారు. అవసరమైతే స్థానిక వైమానిక స్థావరాలను, ఎయిర్‌పోర్టులను అప్రమత్తం చేస్తారు. ఏటీసీ నుంచి సమాచారం అందుకున్న ఎయిర్‌పోర్ట్‌ ఎమర్జెన్సీ విభాగం.. రన్‌వే వెంబడి అంబులెన్సులను, అగ్నిమాపక దళాల్ని మోహరిస్తుంది. విమానాలు మూడు రకాల ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉన్నప్పుడు పైలట్లు హెచ్చరికలు జారీ చేస్తుంటారు. 1. అనిశ్చితి 2. ప్రమాద సంకేతం 3. ముంచుకొచ్చిన విపత్తు. మూడో దశలో మే డే కాల్‌ చేస్తుంటారు.


పక్షులతో భారీ ముప్పు

విమానాలు ప్రమాదాల బారిన పడటానికి తరచూ పక్షులు కారణమవుతున్నాయి. సాధారణంగా టేకాఫ్‌, ల్యాండింగ్‌, తక్కువ ఎత్తులో (3 వేల అడుగుల కంటే తక్కువలో) విమానం ప్రయాణిస్తున్నప్పుడు పక్షులు విమానాన్ని ఢీకొనే ప్రమాదం ఎక్కువ. ఒక పక్షి లేదా కొన్ని పక్షుల గుంపు విమానాన్ని ఢీకొని ఇంజన్‌లో చిక్కుకుపోతే.. ఇంజిన్‌లోని బ్లేడ్లు వంగిపోవటం, ఇంజన్‌ సామర్థ్యం తగ్గిపోవటం వంటి సమస్యలు తలెత్తుతాయి. దీంతో ఇంజన్‌ నిలిచిపోవటమో, అగ్నిప్రమాదం సంభవించటమో జరుగుతుంది. అహ్మదాబాద్‌ ఘటనలో ఇదే జరిగి ఉంటుందని వైమానిక నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తగినట్లుగానే, విమాన ప్రమాద ప్రాంతంలో దాదాపు 50కిపైగా పక్షులు మరణించాయని వార్తలు వెలువడ్డాయి. పక్షులు ఢీకొనటం వల్ల విమానాల్లో విండ్‌షీల్డ్‌ దెబ్బతిని, పైలట్లకు విమానం ముందున్న మార్గం సరిగా కనిపించకపోవటం, క్యాబిన్‌లో వాయుపీడనం పెరిగిపోవటం వంటి సమస్యలు కూడా తలెత్తిన సందర్భాలున్నాయి. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏఓ) ప్రకారం, పక్షలు ఢీకొనే ఘటనల్లో 92 శాతం పెద్దగా ప్రమాదాలు జరగనప్పటికీ, 8 శాతం ఘటనలు మాత్రం తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తున్నాయి. పక్షులు విమానం ఇంజన్‌ను ఢీకొని దాంట్లో కూరుకుపోయిన సందర్భాల్లో మాత్రం తీవ్రమైన ప్రమాదాలు జరుగుతున్నాయి.

Updated Date - Jun 13 , 2025 | 06:05 AM