Massive Protests in London: వలస రాజ్యంలో కలకలం
ABN , Publish Date - Sep 15 , 2025 | 06:38 AM
ఇంగ్లండ్‌కు చట్టబద్ధంగా వచ్చినోళ్లు కొందరైతే శరణార్థులుగా వస్తున్న వలసదార్లు లక్షల్లో.. ఆఫ్రికా, ముస్లిం దేశాల నుంచి రాక బ్రిటిషర్ల ఆందోళన.. ‘మా దేశాన్ని మాకు ఇచ్చేయండి’ అంటూ లండన్‌లో భారీ ప్రదర్శన ఇంగ్లండ్‌లో...
‘మా దేశాన్ని మాకు ఇచ్చేయండి’ అంటూ లండన్‌లో లక్ష మందికిపైగా స్థానిక బ్రిటిషర్ల ప్రదర్శన
ఇంగ్లండ్‌కు చట్టబద్ధంగా వచ్చినోళ్లు కొందరైతే శరణార్థులుగా వస్తున్న వలసదార్లు లక్షల్లో.. ఆఫ్రికా, ముస్లిం దేశాల నుంచి రాక బ్రిటిషర్ల ఆందోళన.. ‘మా దేశాన్ని మాకు ఇచ్చేయండి’ అంటూ లండన్‌లో భారీ ప్రదర్శన ఇంగ్లండ్‌లో పెరిగిపోతున్న వలసదారులు వ్యాపారం పేరిట చిన్న చిన్న పడవలు వేసుకుని సముద్రాలు దాటి వలస వచ్చింది వారే.. స్థానికులపై దాడులకు, దోపిడీకి పాల్పడిందీ వారే.. వారి సంస్కృతిని రుద్ది, స్థానిక సంస్కృతులను నాశనం చేసిందీ వారే.. అదే బ్రిటీషర్లు ఇప్పుడు తమ దేశంలోకి వలసలు పెరిగిపోతున్నాయని మొత్తుకుంటున్నారు. ఒకప్పుడు తాము వలసవెళ్లి అణగదొక్కి, పాలించి, దోచుకున్న ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని దేశాల వారు ఇప్పుడు.. తమ దేశంలోకి వచ్చి చేరుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వలసదారులు తమ సంస్కృతిని నాశనం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వారిని తిప్పిపంపేయాలంటూ నిరసనలకూ దిగుతున్నారు.
బ్రిటన్‌లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఉన్నత చదువుల కోసం దక్షిణాసియా, ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వెళుతున్నారు. వారంతా చట్టబద్ధంగా వీసాలు తీసుకుని వస్తున్నవారు. మరోవైపు అంతర్యుద్ధాలు, కరువు బాధిత దేశాల నుంచి పెద్ద సంఖ్యలో శరణార్థులు సముద్రం మీదుగా చిన్నచిన్న బోట్లలో అక్రమంగా బ్రిటన్‌లోకి ప్రవేశిస్తున్నారు. తమకు ఆశ్రయం ఇవ్వాలంటూ అక్కడి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బ్రిటన్‌లోని వివిధ ప్రాంతాల్లో ఇలాంటి వారి సంఖ్య లక్షల్లోకి చేరింది. స్థానికులమైన తమ కంటే కూడా వలస వచ్చినవారే ఎక్కువైపోయారని.. తమ పన్నుల ఆదాయం వారికి ఖర్చుపెట్టడం ఏమిటంటూ బ్రిటీషర్లలో కొన్నేళ్లుగా ఆందోళన పెరిగిపోయింది. అలా శరణార్థులుగా వచ్చినవారిని స్థానిక బ్రిటీషర్లు చులకనగా చూడటం, జాత్యాహంకార వ్యాఖ్యలు చేయడం వంటివి పెరిగాయి. మరోవైపు ఆఫ్రికా, ఇస్లాం దేశాల నుంచి వచ్చిన శరణార్థుల్లో కొందరు.. దోపిడీలు చేస్తుండటం, తమకు చులకనగా చూస్తున్న బ్రిటిషర్లపై దాడులు చేయడం సమస్యగా మారింది. బ్రిటన్‌లోని తీవ్ర జాతీయవాద (ఫార్ రైట్) పార్టీలు, నేతలు.. విదేశీయుల వలసలను, శరణార్థులకు ఆశ్రయం ఇవ్వడాన్ని తప్పుపడుతూ పోరాటాలు లేవనెత్తుతున్నారు. సోషల్ మీడియాలోనూ ఇది తీవ్ర స్థాయికి చేరింది. బ్రిటన్ స్థానికుల్లో వలసలకు వ్యతిరేక భావజాలం పెరిగిపోయింది. యూకే ప్రభుత్వ గణాంకాల ప్రకారమే.. 2024 చివరి నాటికి అక్కడ 5,15,697 మంది శరణార్థులు ఉన్నారు. వలస వచ్చినవారి విజ్ఞప్తులను పరిశీలించి ప్రభుత్వం అధికారికంగా ఆశ్రయం ఇచ్చినవారి సంఖ్య ఇది. అదే సమయంలో అక్రమంగా వచ్చిన మరో 1,24,841 మంది శరణార్థిగా ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఉన్నారు. ఈ ఏడాది తొలి ఎనిమిది నెలల్లో మరో లక్ష మందికిపైగా అక్రమంగా యూకేలోకి వచ్చి ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నట్టు అంచనా. ఎలాంటి గుర్తింపు పొందకుండా, దరఖాస్తు చేసుకోకుండా ఉంటున్నవారు కూడా లక్షల్లో ఉంటారు. వీరిలో చాలా మంది ఆఫ్రికా, మధ్యప్రాచ్య ముస్లిం దేశాల నుంచి వచ్చినవారే. మరోవైపు పర్యాటక, విద్యార్థి వీసాలపై వచ్చి.. గడువు ముగిసినా బ్రిటన్‌లోనే ఉండిపోయిన వారి సంఖ్య కూడా లక్షల్లో ఉంటుంది. మొత్తంగా శరణార్థులు, అక్రమంగా ఉంటున్నవారు కలిపి 10-15 లక్షల మంది వరకు ఉంటుందని అంచనా.
(సెంట్రల్ డెస్క్)
‘మా దేశాన్ని మాకు ఇవ్వండి’..
ఇంగ్లండ్‌లో విదేశీయుల సంఖ్య పెరిగిపోతోందని, ముఖ్యంగా ఇస్లామిక్ దేశాల నుంచి వస్తున్న శరణార్థులతో సమస్యలు వస్తున్నాయని పేర్కొంటూ లండన్‌లో శనివారం సాయంత్రం భారీ నిరసన ప్రదర్శన జరిగింది. జాతీయవాద నేత టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో.. యూకే జాతీయ జెండాలను చేతబూని, ‘దేశాన్ని ఏకం చేయండి (యునైట్ ద కింగ్‌డమ్)’, ‘ మా దేశాన్ని మాకు ఇవ్వండి’ అంటూ ఆందోళన చేశారు. పాలస్తీనా, ఇస్లామిక్ స్టేట్ జెండాలను చింపేశారు. ఈ ఆందోళనలో లక్ష మందికి పైగా పాల్గొన్నారు. నిరసనకారులు బ్రిటన్ ప్రధానితోపాటు పలు ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఉండే వైట్‌హాల్ ప్రాంతం దాటి చొచ్చుకుపోయేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో 26 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఆందోళనలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వర్చువల్‌గా ప్రసంగించారు. ‘‘ఏ మాత్రం నియంత్రణ లేని వలసలతో బ్రిటన్ వేగంగా క్షీణించిపోతోంది. మీరు హింసకు పాల్పడకున్నా.. హింసే మీ వైపు వస్తోంది. దాన్ని ఎదుర్కోవాలి, లేదా ప్రాణాలు వదిలేయాలి. ఇదే నిజం’’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు, రాబిన్సన్ నేతృత్వంలోని ఆందోళనకు ప్రతిగా పలువురు బ్రిటన్ ఎంపీలు, వామపక్ష నేతలు, ట్రేడ్ యూనియన్ల ప్రతినిధులు 5 వేల మందితో ర్యాలీ నిర్వహించారు. రాబిన్సన్ అనుచరులు, మద్దతుదారులంతా జాత్యాహంకారులని, మహిళా వ్యతిరేకులని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి..
అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం.. బెంగాల్‌లోనూ ప్రకంపనలు
నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి