Share News

VB–Ji Ram G Bill: వీబీ- జీ రామ్‌జీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం..

ABN , Publish Date - Dec 18 , 2025 | 03:22 PM

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో ‘జీ రామ్‌జీ’ పేరుతో తీసుకువచ్చిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష ఎంపీల ఆందోళనలు, నిరసనల మధ్య ఈ బిల్లును ఆమోదించారు.

VB–Ji Ram G Bill: వీబీ- జీ రామ్‌జీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం..
Ji Ramji Bill

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో ‘వీబీ జీ రామ్‌ జీ’ పేరుతో తీసుకువచ్చిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష ఎంపీల ఆందోళనలు, నిరసనల మధ్య ఈ బిల్లును ఆమోదించారు. అయితే, బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి నిరసన వ్యక్తం చేశారు. విపక్ష సభ్యుల నిరసనలపై స్పందించిన స్పీకర్.. బిల్లుపై సుధీర్ఘంగా చర్చించారని చెప్పారు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన విపక్ష సభ్యులు.. బిల్లు ప్రతులను చించి పడేశారు. వీరి ఆందోళనల మధ్యే బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు. ఇక లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో.. ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.


లోక్‌సభలో గందరగోళం..

కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, డీఎంకే నాయకులు టీఆర్ బాలు, సమాజ్‌వాదీ పార్టీ నాయకులు ధర్మేంద్ర యాదవ్ సహా పలువురు విపక్ష పార్టీల సభ్యులు.. జీ రామ్‌జీ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్లుకు వ్యతిరేకంగా సభలో ఆందోళన చేపట్టారు. ఈ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడం అంటే జాతిపితను అవమానించడమేనని, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ బిల్లుతో రాష్ట్రాలపై మరింత భారం పడుతుందని ఆరోపించారు.


మరోవైపు జీ రామ్‌జీ బిల్లును కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమర్థించారు. బిల్లుపై లోక్‌సభలో మాట్లాడిన శివరాజ్ సింగ్.. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలకు నెహ్రూ పేరును పెట్టిందని గుర్తుచేశారు. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోందని విమర్శించారు. ప్రభుత్వానికి పేర్లు మార్చాలనే దురుద్దేశం ఉందంటూ ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలను సైతం ఆయన ఖండించారు. పేర్లు మార్చాలనే ఉద్దేశం కేవలం ప్రతిపక్ష పార్టీలకు మాత్రమే ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని తమ ప్రభుత్వం కేవలం పనిపై మాత్రమే దృష్టి పెడుతోందని చెప్పుకొచ్చారాయన. MGNREGA అవినీతి సాధనం తప్ప మరొకటి కాదని, అందరితో చర్చించిన తర్వాతే కొత్త చట్టాన్ని తీసుకువచ్చామని కేంద్రమంత్రి ఉద్ఘాటించారు.


కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కామెంట్స్‌పై ప్రతిపక్ష సభ్యులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు ఎంపీలు సభ వెల్‌లోకి ప్రవేశించి.. బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. బిల్లు ప్రతులను చించేశారు. ఈ సందర్భంగా స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా మాట్లాడుతూ.. ‘కాగితాలను చించివేయడానికి ప్రజలు మిమ్మల్ని ఇక్కడికి పంపలేదు. దేశం మిమ్మల్ని చూస్తోంది.’ అని విపక్ష సభ్యులను హెచ్చరించారు. అనంతరం సభను వాయిదా వేశారు.


సభ వాయిదా పడిన తరువాత పార్లమెంట్ వెలుపల ప్రియాంక గాంధీ వాద్రా మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీ రామ్‌జీ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయన్నారు. ‘బిల్లులోని వివరాలను చదివిన ఎవరికైనా గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎలా పూర్తి కాబోతోందో అర్థమవుతుంది. ఈ బిల్లు వలన రాష్ట్రాలపై మరింత ఆర్థిక భారం పడనుంది. రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. MGNREGA పథకం పేదలకు అండగా ఉండేది. కానీ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లు పేదలకు పూర్తి వ్యతిరేకంగా ఉంది.’ అంటూ కేంద్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు ప్రియాంక.


కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ మాట్లాడుతూ.. లోక్‌సభలో విపక్ష సభ్యులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో బిల్లు కాగితాలను చించివేశారని.. ఇది ఖండించాల్సిన అంశమన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలకు చోటు లేదన్నారు. జీ రామ్‌జీ బిల్లుపై సుదీర్ఘంగా చర్చించారని.. అయినప్పటికీ విపక్ష సభ్యులు బిల్లు ప్రతులను చించడం దారుణమన్నారు. ప్రజల ప్రయోజనాల కోసమే ఈ బిల్లును తీసుకురావడం జరిగిందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.


కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ మాట్లాడుతూ.. లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు వ్యవహరించిన తీరు ఏమాత్రం ఆమోదనీయం కాదన్నారు. ‘మీకు వ్యతిరేకించే హక్కు ఉంది. కానీ, ఈ రకమైన ప్రవర్తన సరికాదు. బిల్లు ప్రతులను చించివేయడం, విమానాలు తయారు చేయడం, స్పీకర్‌పై విసరడం సరికాదు. దేశంలోనే అతిపురాతన పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ సభ్యులు.. ఇలా ప్రవర్తించడం గర్హనీయం. బిల్లుకు పెట్టిన పేరును విపక్ష సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. కానీ, రాముడి పేరు ఆ మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టమైన పేరు. ఆయన తుదిశ్వాస విడిచే సమయంలోనూ ‘హే రామ్’ అనే అన్నారు.’ అంటూ కేంద్ర మంత్రి పేర్కొన్నారు.


Also Read:

Jogi Brothers: జోగి రమేష్ బ్రదర్స్‌కు దక్కని ఊరట

Thyroid Treatment: పాలిచ్చే స్త్రీలు థైరాయిడ్ మందులు తీసుకోవచ్చా?

Updated Date - Dec 18 , 2025 | 10:02 PM