Leh Apex Body: కేంద్రంతో చర్చలు లేవు.. లెహ్ ఎపెక్స్ బాడీ సంచలన నిర్ణయం
ABN , Publish Date - Sep 29 , 2025 | 08:57 PM
లెహ్‌లో సోమవారంనాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లెహ్ అపెక్స్ బాడీ చైర్మన్ తుప్‌స్తాన్ ఛెవాంగ్ మాట్లాడారు. లద్దాఖ్‌లో నెలకొన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అక్కడ శాంతియుత పరిస్థితి నెలకొనేంత వరకూ ఎలాంటి చర్చల్లోనూ పాల్గొనరాదని తామంతా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
న్యూఢిల్లీ: లద్దాఖ్ (Ladakh)లో తిరిగి శాంతియుత పరిస్థితులు నెలకొనేంత వరకూ హోం మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి కమిటీతో ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని లెహ్ అపెక్స్ బాడీ (ఎల్ఏబీ) సోమవారం నాడు ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఎల్ఏబీకి చెందిన సభ్యులతో సహా లద్దాఖ్ ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వం మధ్య అక్టోబర్ 6న చర్చలు జరగాల్సి ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'శాంతి లేకుండా చర్చలు సాధ్యం కాదు' అని ఎల్ఏబీ ప్రకటించింది.
లెహ్‌లో సోమవారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లెహ్ అపెక్స్ బాడీ చైర్మన్ తుప్‌స్తాన్ ఛెవాంగ్ మాట్లాడారు. లద్దాఖ్‌లో నెలకొన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అక్కడ శాంతియుత పరిస్థితి నెలకొనేంత వరకూ ఎలాంటి చర్చల్లోనూ పాల్గొనరాదని తామంతా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. లద్దాఖ్‌లోని వాతావరణం భయాలు, ఆవేదన, ఆగ్రహంతో నిండి ఉన్నాయని, వీటిని కేంద్రం హోం శాఖ, యూటీ యంత్రాంగం పరిష్కరించాలని కోరారు.
లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించి రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చోటు కల్పించాలనే డిమాండ్‌పై లెహ్ ఎపెక్స్ బాడీ సెప్టెంబర్ 24న షట్‌డౌన్ పిలుపు ఇచ్చింది. ఈ సందర్భంగా ఆందోళనకారులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో నలుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఆందోళనలకు ప్రధాన కారకుడిగా పేర్కొంటూ పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేశారు.
కాగా, లద్దాఖ్ ప్రజల డిమాండ్లపై నాలుగు నెలలుగా చర్చలు స్తంభించగా, ఆక్టోబర్ 6న చర్చలకు ఎల్ఏబీ, కార్గిల్ డెమోక్రాటిక్ అలయెన్స్ (కేడీఏ)ను కేంద్రం ఆహ్వానించింది. చర్చలకు ముందే లెహ్‌లో తాజా హింసాకాండ చెలరేగింది. దీనిపై తుప్‌స్తాన్ ఛెవాంగ్ మాట్లాడుతూ, 70 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం కేంద్రం లద్దాఖ్‌కు 2019 ఆగస్టులో కేంద్ర పాలిత ప్రాంతం (లెజిస్లేచర్ లేకుండా) హోదా మంజూరు చేసిందనీ, అయితే అది తామ ఆశించినట్టుగానూ, న్యాయబద్ధంగానూ లేదని చెప్పారు. 370వ అధికరణ, 35ఎ అధికరణ కింద తమకు లభించిన రక్షణలకు, ప్రజాస్వామ్యానికి గండి పడిందని, దీంతో తమ న్యాయబద్ధమైన హక్కుల కోసం తాజా ఆందోళనలకు దిగాల్సి వచ్చిందని తెలిపారు. తొలుత తమ హక్కులను పరిరక్షిస్తామని హామీ ఇచ్చినప్పటికీ తమ డిమాండ్లపై ఐదేళ్లుగా చర్చలు నడుస్తూనే ఉన్నాయన్నారు. శాంతియుతంగానే తాము ఆందోళనలు చేస్తున్నామని, అయితే సెప్టెంబర్ 24న ఎవరూ ఊహించని విధంగా సీఆర్‌పీఎఫ్ తీవ్ర బలప్రయోగంతో తమ ప్రజలను పొట్టనపెట్టుకుందని, పలువురిని గాయపరించిందని అన్నారు. దీంతో లద్దాఖ్ ప్రజల్లో ఆగ్రహం, తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
మూడేళ్లలో రూ.241 కోట్లు సంపాదించా.. జన్ సురాజ్ నిధులపై పీకే
For More National News And Telugu News