Share News

Modi On Kumbhmela Success: కుంభమేళా విజయవంతం.. సమిష్టి కృషికి నిదర్శనం: ప్రధాని మోదీ

ABN , Publish Date - Mar 18 , 2025 | 01:22 PM

కుంభమేళా విజయవంతం కావడానికి సమిష్టి కృషి కారణమని ప్రధాని మోదీ లోక్‌సభలో అన్నారు. ఈ విజయం కోసం కృషి చేసిన కర్మయోగులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Modi On Kumbhmela Success: కుంభమేళా విజయవంతం.. సమిష్టి కృషికి నిదర్శనం: ప్రధాని మోదీ

ఇంటర్నె్ట్ డెస్క్: మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో కుంభమేళా గురించి ప్రస్తావించారు. కుంభమేళా ద్వారా భారత వైభవాన్ని యావత్ ప్రపంచం వీక్షించిందని అన్నారు. ప్రయాగరాజ్‌లో కుంభమేళా విజయవంతంగా నిర్వహించడం సమిష్టి కృషికి అసలైన ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. ‘‘కుంభమేళా విజయవంతం చేసేందుకు ఎందరో తమ వంతు పాత్ర పోషించారు. ఆ కర్మ యోగులందరికీ నా ధన్యవాదాలు’’ అని అన్నారు.

భిన్నత్వంలో ఏకత్వానికి ఆలవాలమైన భారత సంస్కృతి కుంభమేళాలో ఆవిష్కృతమైందని ప్రధాని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా చెలరేగుతున్న యుద్ధాల కారణంగా దేశాల మధ్య ఎడం పెరుగుతున్న నేపథ్యంలో భారత దేశం.. భిన్నత్వంలో ఏకత్వమే తన ప్రత్యేకత అని కుంభమేళాతో గొప్పగా చాటుకుందని పేర్కొన్నారు. మహా కుంభమేళాలో యువతరం పెద్ద ఎత్తున పాల్గొనడంపై కూడా ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. సంప్రదాయాలను ఆధ్యాత్మికతను యువత సగర్వంగా అందిపుచ్చుకున్నదని వ్యాఖ్యానించారు (Modi On Kumbhmela Success).


Also Read: ఔరంగజేబు సమాధిపై వివాదం.. నాగ్‌పూర్‌లో కర్ఫ్యూ

‘‘కుంభమేళాలో భారత వైభవాన్ని యావత్ ప్రపంచం చూసింది. ఈ మహాసంరంభంలో యావత్ దేశం ఉత్సాహంగా పాల్గొంది. భవిష్యత్తు తరాలకు ఈ సంరంభం స్ఫూర్తిగా నిలుస్తుంది. భారత్ శక్తి సామర్థ్యాలను ప్రశ్నించే వారికి కుంభమేళా విజయం తగిన జవాబు ఇచ్చింది’’ అని వ్యా్ఖ్యానించారు.

144 ఏళ్లకోసారి వచ్చే మహాకుంభమేళా 45 రోజుల పాటు యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయే రీతిలో జరిగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26తో ముగిసిన ఈ మహా సంరంభంలో ఏకంగా 66 కోట్ల మంది పాల్గొన్నారు. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీ సంగమంలో పవిత్రస్నానం ఆచరించి ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించారు. ఇక ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ కూడా స్వయంగా గంగా, యమున, సరస్వతీ నదుల సమాగమమైన త్రివేణీ సంగమంలో పుణ్య స్నానం చేశారు. గంగా నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.


Also Read: ఔరంగజేబు సమాధి తొలగించాలంటూ డిమాండ్స్.. నాగ్‌పూర్‌లో చెలరేగిన హింస

ఇక, కుంభమేళాలో అక్కడక్కడా కొన్ని అపశృతులు చోటు చేసుకున్నాయి. జనవరి 29న మౌని అమావాస్య సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 30 మంది మరణించినట్టు యూపీ ప్రభుత్వం పేర్కొంది. అయితే, మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని ప్రతిపక్షం ఆరోపించింది. ఇక కుంభమేళా జలాల్లో మావన వ్యర్థాల్లో కనిపించే ఫీకల్ కోలీఫార్మ్ బ్యాక్టీరియా ఉందన్న కాలుష్య నియంత్రణ బోర్డు నివేదికపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశాయి. బీజేపీ సారథ్యంలోని యోగి ప్రభుత్వం ఏర్పాట్లు సరిగా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి.

Read Latest and National News

Updated Date - Mar 18 , 2025 | 01:31 PM