Share News

Kedarnath Dham Yatra 2025: తెరుచుకున్న కేదార్‌నాత్ ఆలయం.. తొలి రోజు భారీగా తరలివచ్చిన భక్తులు

ABN , Publish Date - May 03 , 2025 | 12:14 PM

శుక్రవారం కేదార్‌నాథ్ ఆలయం తెరుచుకోవడంతో భక్తులు భారీగా పోటెత్తారు. తొలి రోజుల సుమారు 30 వేల పైచిలుకు భక్తులు మహాశివుడిని దర్శించుకుని తరించారు.

Kedarnath Dham Yatra 2025: తెరుచుకున్న కేదార్‌నాత్ ఆలయం.. తొలి రోజు భారీగా తరలివచ్చిన భక్తులు
Kedarnath Dham Yatra 2025

ఇంటర్నెట్ డెస్క్: ఛార్‌ధామ్ ఆలయాల్లో ఒకటైన సుప్రశిద్ధ శైవక్షేత్రం కేదార్‌నాథ్ ద్వారాలు భక్తుల కోసం తెరుచుకున్నాయి. శీతాకాల విరామం తరువాత శుక్రవారం ఉదయం ఏడు గంటలకు ఆలయంలోకి భక్తులను అనుమతించారు.

తొలి రోజు కావడంతో భక్తులు భారీగా పోటెత్తారు. ఏకంగా 30 వేల మంది మహాశివుడిని దర్శించుకున్నారు. అధికారిక సమాచారం ప్రకారం శుక్రవారం సాయంత్రం ఏడు గంటల వరకూ సుమారు 10,597 మంది మహిళలు, 19,196 మంది పురుషులు ఆలయాన్ని సందర్శించారు. ఆలయ ద్వారాలు తెరుచుకునే సమయంలో భారత ఆర్మీకి చెందిన ఘర్వాల్ రైఫిల్స్ సైనికులు సంప్రదాయ బద్ధ భక్తిగీతాలను ప్లే చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కూడా పాల్గొన్నారు. ఆలయం పరిసరాల్లో ముఖ్య సేవక్ భండారా వద్ద భక్తులకు స్వయంగా ప్రసాదం పంపిణీ చేశారు. భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఈ సందర్భంగా సీఎం తెలిపారు.


యాత్రా మార్గాల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని, యాత్రికుల రాకపోకలను నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. స్థానికులు ఎంతో మందికి ఉపాధి కల్పించే ఛార్‌ధామ్ యాత్ర రాష్ట్రానికి జీవనాడి అని తెలిపారు. ఏడాదంతా ఆధ్యాత్మిక యాత్రలకు అవకాశం కల్పించే ఉద్దేశంతో శీతాకాల తీర్థయాత్రలకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. కేదార్‌నాథ్ ఆలయ అభివృద్ధి కోసం రూ.2 వేల కోట్లు కేటాయించినట్టు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం గౌరీ కుండ్ నుంచి కేదార్‌నాథ్ వరకూ రోప్‌వే నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపిందని అన్నారు. ఈసారి అక్షయత్రితియ రోజున కేదార్‌నాథ్ యాత్ర ప్రారంభమైందని ఆయన తెలిపారు.


ఛార్‌ధామ్ యాత్రలో భాగమైన గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఇప్పటికే ప్రారంభం కాగా, బద్రీనాథ్ ఆలయ ద్వారాలు రేపు తెరుచుకోనున్నాయి. దీంతో, పూర్తిస్థాయిలో చార్‌ధామ్ యాత్ర మొదలవుతుంది. ఈ యాత్రలో భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఉత్తరాఖండ్ సీఎం తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

గోవా దేవాలయంలో ఊరేగింపులో తొక్కిసలాటకు కారణం ఇదేనా

అంబులెన్స్‌లో ఏం తరలిస్తున్నారో తెలిస్తే.. షాక్ అవాక్కవాల్సిందే..

హఫీజ్ సయిద్ భద్రత పెంచిన పాక్

For National News And Telugu News

Updated Date - May 03 , 2025 | 12:26 PM