Elections: బ్యాలెట్ విధానంలోనే స్థానిక ఎన్నికలు..
ABN , Publish Date - Sep 05 , 2025 | 01:47 PM
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీలు, నగర పాలికెసంస్థల ఎన్నికలను బ్యాలెట్ పేపర్ పద్దతిలోనే నిర్వహించాలని మంత్రివర్గం తీర్మానించింది. గురువారం సాయంత్రం విధానసౌధలో మంత్రివర్గ సమావేశం సీఎం సిద్దరామయ్య అధ్యక్షతన జరిగింది.
- ఎన్నికల కమిషన్‌కు సిఫారసు
- కనకపురలో వైద్య కళాశాల ఏర్పాటు
- రైతులపై నమోదైన 60 కేసుల రద్దు
- కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు
బెంగళూరు: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీలు, నగర పాలికెసంస్థల ఎన్నికలను బ్యాలెట్ పేపర్ పద్దతిలోనే నిర్వహించాలని మంత్రివర్గం తీర్మానించింది. గురువారం సాయంత్రం విధానసౌధలో మంత్రివర్గ సమావేశం సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) అధ్యక్షతన జరిగింది. కేబినెట్ తీర్మానాలను శాసనసభా వ్యవహారాల శాఖామంత్రి హెచ్‌కే పాటిల్ మీడియాకు వివరించారు. ఇకపై స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్‌పేపర్ విధానంతోనే నిర్వహించాలని తీర్మానించినట్లు తెలిపారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సిఫారసు చేయాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓటరు జాబితాను సిద్దం చేసుకోవడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అవసరమైన నిబంధనల అమలు కోసం సవరణలు తీసుకురావాలని నిర్ణయించామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు అన్నింటినీ బ్యాలెట్ ద్వారానే జరపాలని తీర్మానించారు. డీసీఎం డీకే శివకుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్న కనకపురకు అనుబంధమైన రాయసంధ్ర గ్రామంలో కొత్త మెడికల్ కళాశాల ఏర్పాటుకు తీర్మానించారు. కర్ణాటక గృహమండలి రూ.65కోట్లతో 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసేందుకు పాలనాపరమైన అనుమతులకు అంగీకరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలోను ఆశాకిరణ పథకం అమలు చేయదలచారు. తద్వారా అందరికీ ఉచిత కంటి వైద్య శిబిరాల ద్వారా పరీక్షలు జరిపించేందుకు రూ. 52.85 కోట్ల రూపాయల గ్రాంటు ఇచ్చేందుకు తీర్మానించారు. రైతులు, కన్నడ పోరాట నేతలపై నమోదు చేసిన 60 కేసులను రద్దు చేయాలని ఏకగ్రీవంగా ఆమోదించారు. వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల సుంకం 41పైసల నుంచి 42 పైసలకు పెంచుతూ తీర్మానించారు. బెంగళూరులో మెట్రో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు తీర్మానించారు. మెట్రో స్టేజ్- 3లో భాగంగా జేపీనగర్ 4వ స్టేజి హెబ్బాళ దాకాను. హొసహళ్ళి నుంచి మాగడి రోడ్ కడబగెరె దాకా 37. 12 కిలోమీటర్‌ల పొడవుతో డబుల్ డెక్కర్‌ల నిర్మాణాలకు అంగీకరించారు. మంత్రివర్గ సమావేశంలో ఏకంగా 70 అంశాలకు సంబంధించి చర్చలు జరిపి ఆమోదించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో కాల్పుల విరమణ ప్రకటించాలి
‘గే’ యాప్ ‘గ్రైండర్’ ద్వారా డ్రగ్స్ విక్రయం
Read Latest Telangana News and National News