Kangana Ranaut: కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టాలి.. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై రియాక్షన్
ABN , Publish Date - Sep 19 , 2025 | 07:55 AM
తమిళనాడు కాంగ్రెస్ సీనియర్ నేత కేఎస్ ఆలగిరి చేసిన తాజా వ్యాఖ్యలు కొత్త దుమారం రేపుతున్నాయి. ఆయన బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టాలన్నారు. అయితే అసలు ఏం జరిగింది, ఎందుకు అలా అన్నారనేది ఇక్కడ చూద్దాం.
తమిళనాడు కాంగ్రెస్ సీనియర్ నేత కె.ఎస్. అలగిరి బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్‌పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. గత ఏడాది చండీగఢ్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ మహిళా సిబ్బంది కంగనాను చెంపదెబ్బ కొట్టిన సంఘటనను ప్రస్తావిస్తూ, అలగిరి తమిళనాడులోని వ్యవసాయ కార్మికులకు ఒక వివాదాస్పద సూచన చేశారు.
కంగనా తమిళనాడుకు వస్తే, ఆమెను అదే విధంగా చెంపదెబ్బ కొట్టాలని వ్యవసాయ కార్మికులకు చెప్పినట్లు ఆయన వెల్లడిచారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. కంగనా ఎక్కడికి వెళ్లినా అందరినీ దూషిస్తుందని, ప్రత్యేకించి వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసే మహిళలను కించపరుస్తుందని అలగిరి ఆరోపించారు.
వివాదానికి కారణం ఏంటి?
కంగనా గతంలో మహిళలను, ముఖ్యంగా వ్యవసాయ కూలీలను అవమానించేలా మాట్లాడారని కేఎస్ ఆలగిరి ఆరోపించారు. ఒకసారి మీడియాతో మాట్లాడిన క్రమంలో వ్యవసాయ మహిళలు రూ.100 ఇస్తే ఎక్కడికైనా వస్తారని ఆమె వ్యాఖ్యానించిందని తెలిపారు. ఈ వ్యాఖ్యలు మహిళల స్వాభిమానాన్ని దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. గ్రామీణ భారతంలో కష్టపడి పనిచేసే మహిళలను అవమానించేలా ఉన్నాయని అలగిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి మా ప్రాంతానికి వస్తే, ఆమెను చెంపదెబ్బ కొట్టిన CISF మహిళా పోలీస్ ఏం చేసిందో, అదే చేయాలని ఆయన మహిళా రైతులకు చెప్పినట్టు వెల్లడించారు.
కంగనా రనౌత్ స్పందన
ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై కంగనా రనౌత్ తనదైన శైలిలో స్పందించారు. ఒక వ్యక్తి ఏదో అన్నందుకు ఏమీ మారదు. నన్ను ప్రేమించే వారు కూడా చాలా మంది ఉన్నారు. మేము ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తాం, ఎవరూ మమ్మల్ని ఆపలేరని ఆమె అన్నారు. తమిళనాడులో తాను నటించిన తలైవి సినిమాలో జయలలిత పాత్రకు విపక్ష ఎంపీలు కూడా తనను తలైవి అని పిలిచి గౌరవించారని, తనకు అక్కడి ప్రజలు ఎంతో ఆప్యాయత చూపిస్తారని ఆమె తెలిపారు. అలగిరి వ్యాఖ్యలు తనపై ఎలాంటి ప్రభావం చూపవని ఆమె స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి