Punjab: దారుణం.. అంతా చూస్తుండగా స్టార్ కబడ్డీ ప్లేయర్‌ని కాల్చి చంపారు..
ABN , Publish Date - Dec 16 , 2025 | 04:45 PM
దేశంలో గన్ కల్చర్ బాగా పెరిగిపోతుంది. మహానగరాల్లోనే కాదు.. చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఈ కల్చర్ విస్తరిస్తుంది. అక్రమ ఆయుధాలు నేరస్తుల చేతుల్లోకి రావడం హింసాత్మక ఘటనలకు దారి తీస్తుంది. ఇది ‘లా అండ్ ఆర్డర్’ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. మొహాలీలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
పంజాబ్‌లోని మొహాలీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ కబడ్డీ ప్లేయర్, ప్రమోటర్ అయిన రాణా బాలచౌరియాని దుండగులు దారుణంగా కాల్చి చంపారు. కబడ్డీ టోర్నమెంట్ మధ్యలోనే ప్రేక్షకులు చూస్తుండగా దుండగులు కాల్పులు జరిపి హతమార్చారు. ఈ దారుణ ఘటన వందల మంది ప్రేక్షకుల సమక్షంలో జరగడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైయ్యారు. కాగా, ఈ హత్య ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్దూ మూస్ వాలా హత్యకు ప్రతీకారంగా జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మొహాలీలో సోమవారం సాయంత్రం కబడ్డీ టోర్నమెంట్ జరుగుతుంది. ప్రేక్షకులు ఆటను ఎంతో ఆసక్తితో తిలకిస్తున్నారు. అంతలోనే కాల్పుల శబ్ధం వినిపించింది..దీంతో ప్రేక్షకులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అదే సమయంలో కబడ్డీ ప్లేయర్ రాణా బాలచౌరియాపై దుండగులు దాడి చేసి.. అనంతరం కాల్చి చంపారు. తీవ్ర గాయాలతో బాలచౌరియా గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
హత్యకు ముందు దుండగులు రాణా అభిమానులుగా వచ్చి సెల్ఫీ తీసుకుంటామని చెప్పి అతనిపై కాల్పులు జరిపారని మొహాలీ ఎస్పీ హర్మన్ దీప్‌సింగ్ హన్స్ తెలిపారు. అత్యంత దగ్గరగా కాల్పులు జరపడంతో రాణా అక్కడే ప్రాణాలు కోల్పోయాడని అన్నారు. దుండగులు తప్పించుకునే సమయంలో గాల్లో కాల్పులు జరిపారని వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నితిన్ నబీన్‌ను పార్టీ చీఫ్‌గా ప్రకటించక పోవడం వెనుక బీజేపీ వ్యూహం ఇదే
నియంత భయపడుతున్నారు... మమతపై బీజేపీ వివాదాస్పద పోస్టు