Waqf Bill: పార్లమెంట్ ముందుకు వక్ఫ్ బిల్లుపై జేపీసీ నివేదిక!
ABN , Publish Date - Feb 14 , 2025 | 05:24 AM
సభ్యుల నిరసనలు, నినాదాలు, వాకౌట్లు, స్వల్ప వాయిదాల మధ్య వక్ఫ్ సవరణ బిల్లు-2024పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) నివేదిక గురువారం పార్లమెంటు ఉభయసభల ముందుకొచ్చింది.

అసమ్మతి నోట్‌ను నివేదికలోంచి
తొలగించారంటూ విపక్షాల అభ్యంతరం
సభ్యుల నిరసనలు, నినాదాలు, వాకౌట్లు
ముగిసిన తొలి విడత బడ్జెట్ సమావేశాలు
వక్ఫ్ సమస్యలపై దుష్ప్రచారం.. ఆమోదిస్తే
దేశవ్యాప్త ఉద్యమం: ముస్లిం పర్సనల్ లా బోర్డు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: సభ్యుల నిరసనలు, నినాదాలు, వాకౌట్లు, స్వల్ప వాయిదాల మధ్య వక్ఫ్ సవరణ బిల్లు-2024పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) నివేదిక గురువారం పార్లమెంటు ఉభయసభల ముందుకొచ్చింది. రాజ్యసభలో బీజేపీ సభ్యుడు మేధా విశ్రామ్ కులకర్ణి, లోకసభలో ఎంపీ, జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్‌పర్సన్ జగదాంబికా పాల్ నివేదికను ప్రవేశపెట్టారు. రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున్ ఖర్గే ఈ నివేదికను ‘ఫేక్ రిపోర్టు’ గా కొట్టిపారేశారు. విపక్ష ఎంపీలు జారీచేసిన అసమ్మతి నోట్‌ను నివేదిక నుంచి తొలగించారని, ఇది అప్రజాస్వామిక చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నివేదికను సంయుక్త పార్లమెంటరీ కమిటీకి తిప్పి పంపాలని డిమాండ్ చేశారు. అయితే విపక్ష సభ్యుల ఆరోపణలను పార్లమెంటరీ, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు కొట్టిపారేశారు. నివేదిక నుంచి ఏదీ తొలగించలేదని, అన్ని వివరాలనూ సభ ముందు ఉంచామన్నారు. మంత్రులు భూపేందర్ యాదవ్, నిర్మలా సీతారామన్ కూడా విపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదని, సభను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కాగా అభ్యంతరాల నోట్‌ను తొలగించారంటూ విపక్షసభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో మధ్యాహ్నం 3:30 గంటలకు బీజేపీ ఎంపీ మేధా విశ్రామ్ కులకర్ణి సభలో నివేదికలోని ఐదో భాగానికి సంబంధించిన తప్పొప్పుల పట్టిక (కోరిజండమ్)ను ప్రవేశపెట్టారు. లోక్‌సభలో అమిత్ షా మాట్లాడుతూ అసమ్మతి నోట్‌తో కూడిన నివేదికను ప్రవేశపెట్టడంపై బీజేపీకి అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. తొలి విడత బడ్జెట్ సమావేశాలకు ముగింపు పలుకుతూ ఉభయసభలు వాయిదాపడ్డాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 10నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగుతాయి.
హిందూ, ముస్లింల మధ్య పోరుగా చూడొద్దు
ముస్లింల అభిప్రాయాలను వక్ఫ్‌ప్యానల్ పూర్తిగా విస్మరించిందని, వక్ఫ్ సవరణ బిల్లును అమోదిస్తే, దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీల్‌బీ) హెచ్చరించింది. వక్ఫ్ బిల్లుపై ముందుకు వెళ్లొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. బిల్లుపై జేపీసీ నివేదికను ఉభయసభల్లో ప్రవేశపెట్టిన నేపథ్యంలో లా బోర్డు అధ్యక్షుడు ఖలీద్ సయిఫుల్లా రెహమానీ విలేకరులతో వక్ఫ్ సమస్యలనేవి హిందువులు, ముస్లిం మఽధ్య పోరు కాదని.. ఇది న్యాయం కోసం జరిగే పోరాటమని పేర్కొన్నారు. వక్ఫ్ బిల్లును రూపకల్పనలో ‘మతపరమైన వివక్ష’ కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నారు.
లోక్‌సభలో కొత్త ఆదాయ పన్ను బిల్లు
ఆదాయ పన్ను చట్టాన్ని సరళీకరిస్తూ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గురువారం లోక్‌సభలో కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లును సెలక్ట్ కమిటీ పరిశీలనకు పంపాలని స్పీకర్ ఓం బిర్లాను అభ్యర్థించారు. అసలు బిల్లు ప్రవేశ పెట్టడాన్నే విపక్షాలు వ్యతిరేకించాయి. అయితే, మూజువాణి ఓటుతోనే బిల్లు ప్రవేశపెట్టడానికి స్పీకర్ అనుమతి లభించింది. లోక్‌సభ సెలక్ట్ కమిటీ బిల్లును అధ్యయనం చేసి వచ్చే సమావేశాల తొలిరోజు తన నివేదికను సమర్పిస్తుంది. ప్రస్తుత చట్టంలో కన్నా కొత్త బిల్లులో ఎక్కువ సెక్షన్లు ఉన్నాయని కాంగ్రెస్ సభ్యులు మనీశ్ తివారీ, ప్రేమచంద్రన్ చేసిన వ్యాఖ్యలను నిర్మల ఖండించారు. ప్రస్తుత చట్టంలో 819 సెక్షన్లు ఉండగా.. కొత్త బిల్లులో కేవలం 536 సెక్షన్లు ఉన్నాయని గుర్తు చేశారు. కొత్త చట్టాన్ని 2026 ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామన్నారు.