Bihar Assembly Elections: 15 సీట్లు ఇస్తే సరి.. లేకుండా పోటీ చేయం.. బీజేపీ పార్ట్‌నర్ హుకుం
ABN , Publish Date - Oct 08 , 2025 | 05:59 PM
జీతన్ రామ్ మాంఝీతోపాటు మరో దళిత నేత, కేంద్ర మంత్రి, లోక్‌జన్‌శక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ సైతం తమ పార్టీకి 40 నుంచి 50 సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుదలతో ఉన్నారు.
పాట్నా: ఒకవైపు వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలకు బిహార్ సన్నద్ధమవుతుంటే మరోవైపు నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (NDA)లో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. చాలాకాలంగా తమను చిన్నబుచ్చుతున్నారని, తమను పట్టించుకోవడం లేదని మాజీ ముఖ్యమంత్రి, ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన హిందుస్థాని అవామ్ మోర్చా (సెక్యులర్) చీఫ్ జీతన్ రామ్ మాంఝీ (Jitan Ram Manjhi) ఆక్రోశం వ్యక్తం చేశారు. ఈసారి కనీసం 15 సీట్లు అయినా ఇవ్వకుంటే తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేది లేదన్నారు. అయితే ఎన్డీయేలోనే కొనసాగుతామని తెలిపారు.
'మాకు 15 సీట్లు ఇవ్వకుంటే ఎన్నికల్లో పోటీ చేసే ప్రసక్తే లేదు. మమ్మల్ని అమానించినట్టు, మా వాళ్లను నిర్లక్ష్యం చేసినట్టు భావిస్తున్నా. మేము ప్రతిసారీ ఎన్డీయేకు మద్దతిస్తూనే ఉన్నాం. మమ్మల్ని గౌరవించాల్సిన బాధ్యత వారికి ఉంది. 15 సీట్లు ఇస్తే 8-9 సీట్లు గెలుచుకుంటాం. ఇవ్వకుంటే 60 నుంచి 70 నియోజకవర్గాల్లో మా పార్టీ పరపతిని పెంచుకోవడం మినహా మాకు మరో మార్గం లేదు. చిరాగ్ (పాశ్వాన్)కు సీట్లపై మాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ దయచేసి మా గౌరవాన్ని కాపాడండి' అని జీతన్ రామ్ మాంఝీ అన్నారు.
జీతన్ రామ్ మాంఝీతోపాటు మరో దళిత నేత, కేంద్ర మంత్రి, లోక్‌జన్‌శక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ సైతం తమ పార్టీకి 40 నుంచి 50 సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుదలతో ఉన్నారు. బీజేపీ 20 సీట్లు ఇచ్చేందుకు ప్రతిపాదిస్తోంది. ఈ నేపథ్యంలో పాశ్వాన్ తన తండ్రి వర్ధంతి (అక్టోబర్) సందర్భంగా తన 'ఎక్స్' ఖాతాలో చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. 'మా తండ్రి ఎప్పుడూ చెప్పేవారు. పాపం చేయకు, పాపం భరించకు, జీవించాలనుకుంటే మరణించడం నేర్చుకో, ప్రతి అడుగులో పోరాటం చేయడం నేర్చుకో' అని ఆ పోస్టులో చిరాగ్ రాశారు. జీతన్ రామ్ మాంఠీ సైతం బుధవారం ఒక ట్వీట్‌లో భారతంలోని ఓ ఘట్టాన్ని ప్రస్తావించారు. మహాభారతంలో పాండవులు కేవలం ఐదు ఊళ్లు అడిగిన విషయాన్ని గుర్తుచేస్తూ... మాకు కేవలం 15 ఊళ్లు (సీట్లు) ఇస్తే చాలునంటూ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్-1 ప్రారంభించిన మోదీ
సింగర్ జుబీన్ గార్గ్ కేసులో బిగ్ ట్విస్ట్..
Read Latest Telangana News and National News