Share News

Israel: టార్గెట్‌ టెహ్రాన్‌!

ABN , Publish Date - Jun 17 , 2025 | 05:35 AM

ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ను ఇజ్రాయెల్‌ టార్గెట్‌గా చేసుకుంటోంది. ‘‘మీరంతా వీలైనంత త్వరగా టెహ్రాన్‌ను వదిలి వెళ్లండి. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లండి..

Israel: టార్గెట్‌ టెహ్రాన్‌!

  • టెహ్రాన్‌ లక్ష్యంగా దాడులకు సిద్ధమవుతున్న ఇజ్రాయెల్‌

  • ప్రజలు వెళ్లిపోవాలంటూ హెచ్చరికలు

  • ప్రాణరక్షణ కోసం పొరుగు దేశాలకు పారిపోతున్న ఇరాన్‌ ప్రజలు

  • ఇజ్రాయెల్‌పై దాడులను పెంచిన ఇరాన్‌

  • టెల్‌అవీవ్‌ శివార్లలో భారీ విధ్వంసం

  • తాజాగా 11 మంది మృతి

  • హైఫాలోని చమురు ప్లాంట్‌పై దాడి

  • చెలరేగుతున్న మంటలు.. ప్లాంట్‌ సేఫ్‌

  • ట్రంప్‌ హత్యకు ఇరాన్‌ కుట్ర: నెతన్యాహు

  • అణు ఒప్పందం నుంచి తప్పుకొంటాం

  • మాపై అణుబాంబు వేస్తే.. పాకిస్థాన్‌ గట్టిగా స్పందిస్తుంది: ఇరాన్‌

  • మధ్యవర్తిత్వానికి మేం సిద్ధం: రష్యా

టెల్‌అవీవ్‌/టెహ్రాన్‌/న్యూఢిల్లీ, జూన్‌ 16: ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ను ఇజ్రాయెల్‌ టార్గెట్‌గా చేసుకుంటోంది. ‘‘మీరంతా వీలైనంత త్వరగా టెహ్రాన్‌ను వదిలి వెళ్లండి. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లండి’’ అంటూ ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్(ఐడీఎఫ్‌) అధికారులు అరబిక్‌, పర్షియా భాషల్లో టెహ్రాన్‌ పౌరులకు సందేశాలు పంపుతున్నారు. దాంతో.. వేల మంది ఇరానీలు టెహ్రాన్‌ నగరాన్ని వీడుతున్నారు. సోమవారం ఉదయం నుంచే ఇరాన్‌లోని ఇతర ప్రావిన్సులతోపాటు.. పాకిస్థాన్‌, అజర్‌బైజాన్‌, తుర్కియే, తుర్కెమినిస్థాన్‌ దేశాలకు తరలివెళ్తున్నారు. దీంతో.. టెహ్రాన్‌ వీధులన్నీ కార్లతో నిండిపోయాయి. పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఇరానీలు గేట్లను తోసుకుంటూ లోనికి వెళ్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ‘‘టెహ్రాన్‌ పౌరులు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు సందేశాలు పంపాం. మేము టార్గెట్‌గా చేసుకోబోతున్న ప్రాంతాల వివరాలను అందజేశాం’’ అని ఐడీఎఫ్‌ అధికార ప్రతినిధి మేజర్‌ కమల్‌ పిన్హాసీ పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి కాట్జ్‌ కూడా ఇవే హెచ్చరికలు చేశారు. దీంతో.. సోమవారం అర్ధరాత్రి నుంచి టెహ్రాన్‌పై భీకర దాడులు చేసేందుకు ఐడీఎఫ్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది.


వైమానిక దాడులకు చాన్స్‌!

టెహ్రాన్‌ వాసులకు హెచ్చరికలు జారీ చేయడానికి ముందు కాట్జ్‌ ఓ ప్రకటన చేశారు. ‘‘ఇరాన్‌లోని మూడోవంతు గగనతల రక్షణ వ్యవస్థలను మేం నిర్వీర్యం చేశాం. ఇప్పుడు టెహ్రాన్‌తోపాటు.. కీలక ప్రాంతాల్లో గగనతలాన్ని మేం నియంత్రించగలం’’ అని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు కూడా ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని నిర్ధారించారు. దీన్ని బట్టి సోమవారం అర్ధరాత్రి దాటాక టెహ్రాన్‌పై భీకర వైమానిక దాడులు జరుగుతాయని తెలుస్తోంది. కడపటి వార్తలందేసరికి ఇరాన్‌ సెంట్రల్‌ కమాండ్‌లోని పలు లక్ష్యాలపై, ఇస్పహాస్‌ అణుకేంద్రంపై ఇజ్రాయెల్‌ దాడులు జరిగాయి. టెహ్రాన్‌ వైమానిక స్థావరంపై జరిపిన దాడిలో రెండు ఎఫ్‌-14 ఫైటర్‌ జెట్లు ధ్వంసమయ్యాయి. వీటితోపాటు.. ఇరాన్‌ డ్రోన్ల యూనిట్‌ను ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్‌ ప్రకటించింది. క్షిపణులను తరలిస్తున్న ట్రక్కులను టార్గెట్లుగా చేసుకుని, దాడులు చేసినట్లు తెలిపింది. పశ్చిమ, మధ్య ఇరాన్‌లోనూ డజన్ల కొద్దీ డ్రోన్‌ దాడులు జరిగాయి. ఈ ప్రాంతాల్లో ఉన్న ఇరాన్‌ క్షిపణి, యూఏవీ కేంద్రాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్‌ వార్తాసంస్థ ‘వైనెట్‌’ వెల్లడించింది. కాగా.. సోమవారం ఉదయం ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో ఐఆర్‌జీసీకి చెందిన ఖుద్స్‌ ఫోర్స్‌ ప్రధాన కార్యాలయం ధ్వంసమైంది. ఇరాన్‌ సైన్యం ప్రధాన కార్యాలయంపైనా క్షిపణి దాడులు జరిగాయి. క్షిపణి దాడుల కారణంగా ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇరాన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌(ఐఆర్‌ఐబీ) భవనం తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ భవనంలో ఇరాన్‌ అధికారిక వార్తాసంస్థలు-- ప్రెస్‌టీవీ, అల్‌-ఆలమ్‌, హిస్పాన్‌ టీవీ కొనసాగుతున్నాయి. మరో వార్తాసంస్థ ‘సబ్రిన్‌ టీవీ’ భవనంపైనా బాంబులు పడడంతో తీవ్రంగా దెబ్బతిన్నది. యాంకర్‌ లైవ్‌లో ఉండగానే క్షిపణి దాడి జరిగింది. ప్రేక్షకులు ఈ దృశాలను మీడియాలో చూశారు. ఈ రెండు ఘటనల్లో పలువురు మృతిచెంది ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గడిచిన నాలుగు రోజులుగా జరుగుతున్న యుద్ధంలో 400 మంది మరణించారని, వారిలో 197 మంది సాధారణ పౌరులని ఇరాన్‌లోని మానవ హక్కుల సంఘాలు పేర్కొన్నాయి.


ఇజ్రాయెల్‌లో భారీ నష్టం

ఇరాన్‌ క్షిపణి దాడులతో నాలుగో రోజు కూడా ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌అవీవ్‌ శివార్లలోని పలు పట్టణాలు భారీగా నష్టపోయాయి. ఈ దాడుల్లో 11 మంది మృతిచెందారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 24 మరణాలు నమోదైనట్లు, 500 మందికిపైగా గాయపడ్డట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆదివారం అర్ధరాత్రి దాటాక.. సోమవారం తెల్లవారుజాము వరకు హైఫా ప్రాంతంలో క్షిపణుల వర్షం కురిసింది. ఇజ్రాయెల్‌ ఐరన్‌డోమ్‌ వాటిని చాలా వరకు గాల్లోనే అడ్డుకున్నా.. పలు క్షిపణులు బాజాన్‌ చమురు క్షేత్రాన్ని తాకాయి. అయితే.. చమురు క్షేత్రం వద్ద పార్క్‌ చేసి ఉన్న భారీ ట్యాంకర్‌ ట్రక్కులు, పైప్‌లైన్‌ మాత్రమే ధ్వంసమైనట్లు ఐడీఎఫ్‌ వర్గాలు తెలిపాయి. ప్రధాన ప్లాంట్‌ క్షేమంగా ఉందని చెప్పాయి. ఈ ప్రాంతంతోపాటు.. పేటాతిక్వా, క్రయోట్‌లో మరణాలు ఎక్కువగా సంభవించినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌ ప్రభుత్వం తమ పౌరులను బంకర్లకు తరలించడంతో.. ప్రాణనష్టం తక్కువగా ఉన్నా.. భవనాలు, ఆకాశహార్మ్యాలు, దెబ్బతిన్నాయి. సోమవారం రాత్రి ఇరాన్‌ జరిపిన దాడుల్లో ఉత్తరాదిలోని పలు ప్రాంతాల్లో నష్టం జరిగినట్లు తెలిసింది.


పాకిస్థాన్‌ రంగంలోకి దిగుతుంది: ఇరాన్‌

ఇజ్రాయెల్‌ తమపై అణుబాంబుతో దాడిచేస్తే.. పాకిస్థాన్‌ రంగంలోకి దిగుతుందంటూ ఐఆర్‌జీసీ జనరల్‌ మొహిసన్‌ రెజాయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ చూస్తూ ఊరుకోదని, ఇజ్రాయెల్‌పై తన అణ్వాయుధాలను ప్రయోగిస్తుందని హెచ్చరించారు. ఆ మేరకు తమకు పాకిస్థాన్‌ నుంచి హామీ లభించిందని చెప్పారు. అంతేకాకుండా.. తుర్కియే, సౌదీఅరేబియా, పాకిస్థాన్‌ తదితర దేశాలతో కలిసి ఇస్లామిక్‌ ఆర్మీని ఏర్పాటు చేయాలని మొహిసిన్‌ పిలుపునిచ్చారు. కాగా.. మొహిసిన్‌ అణుదాడి వ్యాఖ్యలను పాకిస్థాన్‌ ఖండించింది.


ట్రంప్‌ హత్యకు ఇరాన్‌ కుట్ర: నెతన్యాహు

ట్రంప్‌ హత్యకు ఇరాన్‌ కుట్రపన్నిందంటూ ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు సంచలన ఆరోపణలు చేశారు. ఇరాన్‌ వద్ద అణ్వాయుధం ఉండకూడదని ట్రంప్‌ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని, అందుకే ఆయనను చంపాలని ఇరాన్‌ చూస్తోందని ఆరోపించారు. కాగా, ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య మధ్యవర్తిత్వానికి తాము సిద్ధంగా ఉన్నామని రష్యా ప్రకటించింది. ఈ మేరకు క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ ఓ ప్రకటన చేశారు. ‘‘మేం గతంలోనే ఇరాన్‌కు ఒక ప్రతిపాదన చేశాం. రష్యా గడ్డపై ఇరాన్‌ యురేనియంను నిల్వ చేయాలి. ఈ ప్రతిపాదన ఇప్పటికీ సముచితమైనదే’’ అని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు మధ్యవర్తిత్వానికి ఒప్పించేలా అమెరికాను కోరాలని ఖతార్‌, సౌదీ అరేబియా, ఒమన్‌లకు ఇరాన్‌ విజ్ఞప్తి చేసినట్లు రాయిటర్స్‌ ఓ కథనాన్ని ప్రచురించింది.


భారతీయ విద్యార్థులకు మార్గం సుగమం

ఇరాన్‌లో చిక్కుకుపోయిన సుమారు 10 వేల మంది భారతీయ విద్యార్థులను వెనక్కి రప్పించడానికి విదేశాంగ శాఖ మార్గం సుగమం చేసింది. భారత విజ్ఞప్తి మేరకు అజర్‌బైజాన్‌, తుర్కిమెనిస్థాన్‌, ఆఫ్ఘానిస్థాన్‌ మీదుగా రోడ్డు మార్గంలో విద్యార్థులు వెనక్కి వెళ్లేందుకు ఇరాన్‌ సర్కారు అనుమతినిచ్చింది. కాగా.. టెహ్రాన్‌ వైద్య విశ్వవిద్యాలయంపై సోమవారం ఇజ్రాయెల్‌ క్షిపణులు పడ్డాయి. ఈ ఘటనలో జమ్మూకశ్మీర్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి.


భారత్‌ను కాపీ కొడుతున్న ఇరాన్‌!

ఇజ్రాయెల్‌తో యుద్ధంపై ప్రెస్‌ బ్రీఫింగ్‌లో ఇరాన్‌ భారత్‌ను కాపీ కొడుతున్నట్లు కనబడుతోంది. 1979 పేం,ఇ ఏనాడూ ఫ్రంట్‌లైన్‌లో మహిళా అధికారులను ఇరాన్‌ నియమించలేదు. కానీ, ఇజ్రాయెల్‌తో యుద్ధం సందర్భంగా మొట్టమొదటిసారి ఫాతిమా మెహజిరాని అనే మహిళను అధికార ప్రతినిధిగా నియమించారు. ప్రెస్‌ బ్రీఫింగ్‌ బాధ్యతలను పూర్తిస్థాయిలో ఆమెకే అప్పగించారు.


ఈ వార్తలు కూడా చదవండి

గోడలు దూకేందుకు బీజేపీ నేతల యత్నం.. జీహెచ్‌ఎంసీ వద్ద టెన్షన్ టెన్షన్

కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 17 , 2025 | 05:54 AM