Share News

DRDO Humanoid Robots: డీఆర్‌డీఓ కీలక ప్రాజెక్ట్.. రోబో సైనికుల అభివృద్ధి

ABN , Publish Date - May 13 , 2025 | 07:13 PM

సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రమాదకరమైన మిలిటరీ ఆపరేషన్లు నిర్వహించేందుకు డీఆర్‌డీఓ హ్యూమనాయిడ్ రోబోలను అభివృద్ధి చేస్తోంది.

DRDO Humanoid Robots: డీఆర్‌డీఓ కీలక ప్రాజెక్ట్.. రోబో సైనికుల అభివృద్ధి
DRDO Humanoid Robots

ఇంటర్నెట్ డెస్క్: భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ డీఆర్‌డీఓ.. హ్యుమనాయిడ్ రోబోల అభివృద్ధిపై దృష్టిసారించింది. సరిహద్దు వెంబడి సంక్లిష్ట ఆపరేషన్లలో పాల్గొనేందుకు ఈ రోబోలను అభివృద్ధి చేస్తోంది. హైరిస్క్ ప్రాంతాల్లో సైనికులకు ఎలాంటి అపాయం రాకుండా కార్యకలాపాలు నిర్వహించేందుకు ఈ రోబోలను సిద్ధం చేస్తున్నట్టు డీఆర్‌డీఓ ఓ ప్రకటనలో తెలిపింది. సైనికుల పర్యవేక్షణలో ఇవి పనిచేస్తాయని పేర్కొంది.

గత నాలుగేళ్లుగా డీఆర్‌డీఓ ఈ రోబోల అభివృద్ధికి నిరంతరంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలో జరిపిన అంతర్గత పరీక్షల్లో రోబో మోడళ్లు చక్కని పనితీరు కనబరిచాయి. అడవుల్లో కూడా సవాళ్లకు ఎదురు నిలిచి ఈ రోబో పనిచేయగలదని డీఆర్‌డీఓ పేర్కొంది. ప్రస్తుతం రోబోల అభివృద్ధి కీలక దశకు చేరుకుందని డీఆర్‌డీఓ వెల్లడించింది. ఆపరేటర్ల సూచనలను మరింత మెరుగ్గా అర్థం చేసుకుని, పనులు చక్కబెట్టేలా రోబోను డిజైన్ చేయడంపై దృష్టి పెట్టినట్టు వెల్లడించింది.


మనిషి కండరాలను పోలిన కదలికల కోసం రోబోలో ఆక్చువేటర్స్‌ను ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల పరిస్థితుల గురించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి రోబోలోని కంట్రోల్ వ్యవస్థకు అందించేందుకు పలు అత్యాధునిక సెన్సార్లు కూడా అమర్చారు. అప్పగించిన పనిని సులువుగా చేసే రోబోను డిజైన్ చేయడమే ఈ ప్రాజెక్టులో అతిపెద్ద సవాలని నిపుణులు చెబుతున్నారు. బ్యాలెన్స్ కోల్పోకుండా నేలపై నిలబడగలగడం, సమాచారాన్ని వేగంగా ప్రాసెస్ చేయడం, క్షేత్రస్థాయిలో పనిని చక్కబెట్టడం వంటి సామర్థ్యాలు హ్యుమనాయిడ్ రోబోలకు ఉండాలి అంటున్నారు. ఈ ప్రాజెక్టు 2027 కల్లా పూర్తయ్యే అవకాశం ఉందని డిజైన్ టీమ్‌కు నేతృత్వం వహిస్తున్న కిరణ్ ఆకేల తెలిపారు.

రెండు కాళ్లతో పాటు నాలుగు కాళ్లతో నడిచే రోబోలతో రక్షణ రంగంలో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని డీఆర్‌డీఓ అధికారులు తెలిపారు. వీటితో పాటు వైద్యం, డొమెస్టిక్ హెల్ప్, అంతరిక్ష పరిశోధనలకు కూడా ఇవి కీలకమని అన్నారు. అయితే, స్వతంత్రంగా పనిచేయగలిగే వీటిని డిజైన్ చేయడం సాంకేతికంగా ఓ పెద్ద సవాలు.


ఈ హ్యుమనాయిడ్ రోబో పైభాగంలో చేతులు, వస్తువులను పట్టుకునేందుకు గ్రిప్పర్, తల ఉంటాయి. వస్తువులను పట్టుకుని అటూ ఇటూ తిప్పి చూడటం, వాటిని తోయడం, లేదా లాగడం, తలుపులను తెరవడం వంటి సంక్లిష్ట పనులను ఈ రోబో చేయగలదు. మార్గంలో వచ్చే అడ్డంకులను అధిగమించి ముందుకు వెళ్లగలదు. పేలుడు పదార్థాలు, బాంబులను హ్యాండిల్ చేయగలిగేలా దీన్ని రూపొందిస్తున్నారు. రోబో రెండు చేతులూ సమన్వయంతో పనిచేసేలా డిజైన్ చేశారు. సవాళ్లతో కూడిన వాతావరణంలో ఇవి పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి..
మరిన్ని ఎస్-400లు కావాలి.. రష్యాకు భారత్ అధికారిక అభ్యర్థన

Terrorists Trapped: జుమ్మూలో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాదుల హతం

Operation Sindoor: అణువణువూ జల్లెడ పడుతున్న భారత్.. ఆచూకీ చెబితే 20 లక్షలు

మోదీ సర్‌ప్రైజ్... ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో జవాన్లను కలిసిన ప్రధాని..

Read Latest and National News

Updated Date - May 13 , 2025 | 09:41 PM