Share News

S-400 Missile Defense System: మరిన్ని ఎస్-400లు కావాలి.. రష్యాకు భారత్ అధికారిక అభ్యర్థన

ABN , Publish Date - May 13 , 2025 | 04:37 PM

ఎస్-400 సామర్థ్యం యుద్ధ క్షేత్రంలోనే రుజువైన నేపథ్యంలో ఈ వ్యవస్థలు మరిన్ని కావాలంటూ భారత్ రష్యాను అధికారికంగా కోరినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

S-400 Missile Defense System: మరిన్ని ఎస్-400లు కావాలి.. రష్యాకు భారత్ అధికారిక అభ్యర్థన
S-400 Missile Defense System

ఇంటర్నెట్ డెస్క్: పాక్ దాడుల్ని దీటుగా తిప్పికొట్టిన ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ మిలిటరీ దళాల ప్రశంసలు పొందుతోంది. ఈ నేపథ్యంలో మరిన్ని ఎస్-400లు కావాలంటూ భారత్ రష్యాకు అధికారికంగా విజ్ఞప్తి చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకు రష్యా కూడా అంగీకరించే అవకాశం ఉందని సమాచారం.

పాక్ ప్రయోగించిన డ్రోన్లు, మిసైల్స్ వంటి వాటిని ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ దీటుగా ఎదుర్కొన్న విషయం తెలిసిందే. మార్గమధ్యంలోనే పాక్ డ్రోన్స్, మిసైళ్లను ఇది ధ్వంసం చేసింది. అత్యంత కచ్చితత్వంతో, ప్రభావశీలతతో ఈ వ్యవస్థ పనిచేసిందని డిఫెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో మరిన్ని ఎస్-400లు కొనుగోలు చేసేందుకు భారత్ నిర్ణయించుకుంది. గగనతల రక్షణ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.


రష్యా రూపొందించిన ఎస్-400ను భారత్ సుదర్శన్ చక్ర పేరుతో మోహరించిన విషయం తెలిసిందే. మొత్తం ఐదింటిని కొనుగోలు చేసేందుకు 2018లో భారత్, రష్యా మధ్య ఒప్పందం కుదిరింది. పాక్, చైనా నుంచి ముప్పు పొంచి ఉన్న తరుణంలో భారత్ వీటి కొనుగోలుకు మొగ్గు చూపింది. 2021లో తొలి ఎస్-400ను పంజాబ్‌లో మోహరించారు. వచ్చే ఏడాది చివరి నాటికి భారత్‌కు ఈ ఐదు సమకూరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఎస్-400 ద్వారా నాలుగు రకాల మిసైళ్లను ప్రయోగించి శత్రదేశ డ్రోన్లు, యుద్ధ విమానాలు, క్రూయిజ్, బాలిస్టిక్ మిసైళ్లను ధ్వంసం చేయొచ్చు. ఇందులోని అత్యాధునిక ఫేజ్డ్ అరే రాడార్ ఒకేసారి 100 మిసైళ్ల ప్రయాణమార్గాన్ని గమనిస్తూ దాడులు చేయగలదు. శత్రదేశ మిసైళ్లు, యుద్ధ విమానాలు 600 కిలోమీటర్ల దూరంలో ఉండగానే ఇది గుర్తిస్తుంది. 400 కిలోమీటర్ల దూరంలోనే ధ్వంసం చేస్తుంది. వీటికి మొబైల్ లాంచర్లు కూడా అందుబాటులో ఉండటంతో యుద్ధ క్షేత్రంలో కావాల్సిన చోట రంగంలోకి దింపే అవకాశం కూడా ఉంది.


ఎస్-400 ముప్పు ఉండటంతో పాక్ యుద్ధ విమానాలు అనేకం మార్గమధ్యంలోనే వెనక్కు మళ్లాల్సి వచ్చింది. తాజాగా ప్రధాని మోదీ.. ఎస్-400లు మోహరించిన ఆదమ్‌పూర్ వైమానిక స్థావరాన్ని కూడా సందర్శించారు. తద్వారా పాక్ వ్యాపిస్తున్న వందంతులకు చెక్ పెట్టారు.

ఇవి కూడా చదవండి..
Terrorists Trapped: జుమ్మూలో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాదుల హతం

Operation Sindoor: అణువణువూ జల్లెడ పడుతున్న భారత్.. ఆచూకీ చెబితే 20 లక్షలు

మోదీ సర్‌ప్రైజ్... ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో జవాన్లను కలిసిన ప్రధాని..

Read Latest and National News

Updated Date - May 13 , 2025 | 04:45 PM