S. Somanath: హైపర్ సోనిక్ మిసైల్స్‌తో ప్రమాదం.. ఇస్రో మాజీ చీఫ్ కీలక కామెంట్స్
ABN , Publish Date - Jun 10 , 2025 | 09:09 PM
హైపర్ సోనిక్ క్షిపణి దాడులను తిప్పికొట్టేందుకు భారత్‌కు అత్యాధునిక శాటిలైట్ వ్యవస్థ అవసరమని ఇస్రో మాజీ చీఫ్ ఎస్. సోమనాథ్ అభిప్రాయపడ్డారు.

ఇంటర్నెట్ డెస్క్: ఆధునిక యుద్ధ తంత్రంలో గగనతల, సైబర్ దాడులకు వ్యూహాత్మక ప్రాధాన్యం పెరిగింది. ఈ నేపథ్యంలో ఇస్రో మాజీ చీఫ్ ఎస్.సోమనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైపర్ సోనిక్ క్షిపణులతో దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందన్నారు. భూతల రక్షణ వ్యవస్థలతో వీటిని అడ్డుకోవడం కష్టమని అన్నారు. ఈ క్షిపణులపై నిఘా పెట్టి ముందస్తు హెచ్చరికలు జారీ చేసేందుకు వందల కొద్దీ ఉపగ్రహాలు అవసరమని స్పష్టం చేశారు.
‘దేశ భద్రతలో అంతరిక్ష రంగం పాత్ర ఎంతటిదో ఇప్పుడు స్పష్టంగా తెలిసిపోయింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, భారత్-పాక్ ఘర్షణలు అంతరిక్ష పరిశోధనా రంగం ప్రాముఖ్యతను తేటతెల్లం చేశాయి. భవిష్యత్తులో 50 శాతం అంతరిక్ష రంగ ఉత్పత్తులు రక్షణ రంగానికి చెందినవే అవుతాయి. ఇకపై యుద్ధాలు అంటే శత్రు దేశాలను ఆక్రమించుకోవడం కాదు.. శత్రు దేశాల్లో సమస్యలు సృష్టించడమే లక్ష్యంగా దాడులు చేయడం. ఇలాంటి యుద్ధాల్లో శాటిలైట్‌లు సైన్యానికి కీలకమైన కమ్యూనికేషన్ వ్యవస్థను అందిస్తాయి. శత్రువుల కదలికలపై నిఘా పెట్టేందుకు కీలకంగా మారతాయి’
‘హైపర్ సోనిక్ మిసైల్స్‌ను భూతల రక్షణ వ్యవస్థలు అంత సులభంగా అడ్డుకోలేవు. కాబట్టి, వీటిపై నిఘా పెట్టే శాటిలైట్‌ల వ్యవస్థ అవసరం పెరిగింది. ఈ దిశగా ముందస్తు హెచ్చరికలు జారీ చేసేలా 500 శాటిలైట్‌లతో ఓ వ్యవస్థ ఏర్పాటుకు అమెరికా రెడీ అవుతోంది. భారత్ కూడా ఇలాంటి వ్యవస్థపై దృష్టి పెట్టాలి. ఇందుకు వందల కొద్దీ ఉపగ్రహాలు అవసరం. ఈ శాటిలైట్‌లకు విజిబుల్ ఇమేజింగ్ సామర్థ్యంతోపాటు నైట్ విజన్, థర్మల్, రాడార్, మల్టీ స్పెక్ట్రల్, హైపర్ స్పెక్ట్రల్ సెన్సార్లు ఉండాలి. ఈ సమాచారాన్ని విశ్లేషించి, ఫలితాలను భద్రతాదళాలకు చేరవేసేందుకు ఏఐ ఆధారిత ఎనలిటిక్స్ వ్యవస్థ ఉండాలి. శాటిలైట్‌లను కాపాడుకునే సామర్థ్యం కూడా ఉండాలి’ అని అన్నారు.
ఇవీ చదవండి:
భర్త హత్యకు తొలుత రూ.4లక్షల సుపారీ.. ఆపై రూ.20లక్షలకు పెంపు
రాజా రఘువంశీ హత్య.. మేఘాలయ పోలీసులపై యూపీ పోలీసు ఉన్నతాధికారి ప్రశంసలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి