India Covid Cases: భారత్‌లో 2,710 యాక్టివ్ కొవిడ్ కేసులు.. టాప్‌లో కేరళ
ABN , Publish Date - May 31 , 2025 | 11:39 AM
భారత్‌లో యాక్టివ్ కొవిడ్ కేసుల సంఖ్య 2,710కు చేరుకుంది. కేరళలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో యాక్టివ్ కొవిడ్ కేసుల సంఖ్య 2,710కు చేరుకుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వివరాల ప్రకారం, కేరళలో అత్యధికంగా 1,147 యాక్టివ్ కొవిడ్ కేసులు ఉన్నాయి. ఆ తరువాతి స్థానాల్లో మహారాష్ట్ర (424), ఢిల్లీ (294), గుజరాత్ (223), కర్ణాటక (148), తమిళనాడు (148), పశ్చిమ బెంగాల్ (116) ఉన్నాయి. దేశంలో యాక్టివ్ కొవిడ్ కేసుల సంఖ్య మే 25న వెయ్యి మార్కు దాటింది. తాజాగా 2,700 మార్కును మించిపోయింది.
గత 24 గంటల్లో మహారాష్ట్రలో కొవిడ్ బారిన పడ్డ ఇద్దరు మరణించగా.. ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, పంజాబ్, తమిళనాడులో ఒక్కొ మరణం చొప్పున నమోదయ్యాయి. అధిక శాతం కొవిడ్ కేసుల్లో వ్యాధి తీవ్రత మధ్యస్థంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కేరళలో అధిక కేసులు వెలుగులోకి రావడానికి కారణం అక్కడ టెస్టులు ఎక్కువగా చేస్తుండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మిజోరమ్‌లో దాదాపు ఏడు నెలల తరువాత రెండు యాక్టివ్ కొవిడ్ కేసులు వెలుగులోకి వచ్చాయి.
ఒమైక్రాన్ వేరియంట్‌కు చెందిన ఎల్ఎఫ్.7, ఎన్‌బీ.1.8.1 అనే కరోనా ఉపవేరియంట్ల వల్ల కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటిని డబ్ల్యూహెచ్‌ఓ వేరియంట్ ఆఫ్ ఇంట్రస్ట్‌గా మాత్రమే పరిగణిస్తోంది. ఈ వేరియంట్‌లతో వ్యాధి తీవ్రత ఎక్కువనేందుకు ఆధారాలు ఏవీ లేవని నిపుణులు చెబుతున్నారు. అయితే, త్వరగా ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ సోకే అవకాశం మాత్రం ఉందని అన్నారు. వీటి బారిన పడ్డ వారిలో జ్వరం, ముక్కు కారడం, గొంతులో ఇబ్బంది, తలనొప్పి, అలసట, నీరసం వంటి సాధారణ ఫ్లూ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు.
ఇక కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. అవసరానికి తగినన్ని బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్లు, టెస్టింగ్ కిట్స్, టీకాలను సిద్ధం చేసుకుంటున్నాయి. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కు ధరించాలని నిపుణులు చెబుతున్నారు.
ఇవీ చదవండి:
పాక్‌కు గూఢచర్యం.. భారత యుద్ధ నౌకల వివరాలను చేరవేసిన ఇంజినీర్
వాస్తవాన్ని వివరించిన భారత్.. పాక్‌కు మద్దతు ఉపసంహరించిన కొలంబియా
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి