Indians in Russian Army: రష్యన్ ఆర్మీలో చేరిన 10 మంది భారతీయులు మృతి!
ABN , Publish Date - Dec 29 , 2025 | 08:17 AM
రష్యన్ ఆర్మీలో చేరిన 10 మంది భారతీయులు మృతి చెందారని పంజాబ్‌కు చెందిన జగ్దీప్ కుమార్ ఆరోపించారు. తన తమ్ముడిని వెతుక్కుంటూ వెళ్లిన జగ్దీప్ తిరిగివచ్చి ఈ వ్యాఖ్యలు..
న్యూఢిల్లీ, డిసెంబర్ 29: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యన్ ఆర్మీలో చేరిన భారతీయుల దుస్థితి మరోసారి వెలుగులోకి వచ్చింది. పంజాబ్‌కు చెందిన జగ్దీప్ కుమార్ అనే వ్యక్తి, తన తమ్ముడు మందీప్ కుమార్‌ను వెతుక్కుంటూ రష్యాకు వెళ్లి తిరిగివచ్చాడు. రష్యన్ ఆర్మీ జారీ చేసిన డాక్యుమెంట్ల ఆధారంగా కనీసం 10 మంది భారతీయులు యుద్ధంలో మరణించారని, మరో నలుగురు కనిపించకుండాపోయారని ఆయన ఆరోపించాడు.
మృతుల్లో ముగ్గురు పంజాబ్‌కు చెందినవారు, మిగతా ఏడుగురు ఉత్తరప్రదేశ్, జమ్మూ ప్రాంతాల నుంచి ఉన్నారని ఆయన తెలిపారు. ఉద్యోగ ఆశతో ట్రావెల్ ఏజెంట్లు మోసం చేసి రష్యాకు పంపి, అక్కడ బలవంతంగా ఆర్మీలో చేర్చారని జగ్దీప్ చెప్పారు. తన తమ్ముడు మందీప్‌ను 2024 మార్చి తర్వాత సంప్రదించలేదన్నారు. ఈ విషయాన్ని ఆప్ రాజ్యసభ ఎంపీ బల్బీర్ సింగ్ సీచేవాల్‌కు తెలియజేశాడు జగ్దీప్. దీంతో ఎంపీ.. విదేశాంగ మంత్రి జయశంకర్‌ను కలిసి జోక్యం చేసుకోవాలని కోరారు.
భారత ప్రభుత్వం సెప్టెంబర్‌లోనే రష్యాతో ఈ అంశం పై చర్చించి, భారతీయుల రిక్రూట్‌మెంట్ ఆపాలని, ఇప్పటికే చేరినవారిని విడుదల చేయాలని కోరింది. ఈ ఘటన భారతీయ యువతను మోసం చేసే ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లను మరింత బలపరుస్తోంది. కొందరు భారతీయులు ఇప్పటికే సురక్షితంగా తిరిగి వచ్చారు, కానీ మిగతావారి కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయి.
ఇవీ చదవండి:
ఈ విషయాలు తెలుసా? పర్సనల్ లోన్ చెల్లించకుండానే రుణగ్రహీత మరణిస్తే..
మ్యూచువల్ ఫండ్స్ లాభాలపై పన్ను పోటు ఎంత