Railways Ticket Prices: ప్రయాణికులకు అలర్ట్.. జూలై 1 నుంచి టికెట్ల ధరల పెంపు
ABN , Publish Date - Jun 30 , 2025 | 09:15 PM
భారతీయ రైల్వే ప్రయాణికులు జూలై 1, 2025 నుంచి ఈ ఛార్జీల గురించి తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే రైల్వే శాఖ ప్యాసింజర్ రైళ్ల టికెట్ ధరల్లో (Railways Ticket Prices) కీలక మార్పులు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
భారతీయ రైల్వే ప్రయాణికులకు కీలక అలర్ట్ వచ్చేసింది. ఎందుకంటే జూలై 1, 2025 నుంచి ప్యాసింజర్ రైళ్ల టికెట్ ధరల్లో (Railways Ticket Prices) స్వల్ప మార్పులను ప్రకటించారు. ఈ సర్దుబాటు రైల్వే సేవల స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి, ఛార్జీలను సరళీకరించడానికి ఉద్దేశించిందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఎక్స్‌ప్రెస్, మెయిల్ రైళ్లలో ఏసీ, నాన్-ఏసీ తరగతులకు స్వల్పంగా ధరలు పెరుగుతాయి.
కానీ సబర్బన్ రైళ్ల ధరలు మాత్రం మారకుండా ఉంటాయి. ఈ కొత్త ధరలు జూలై 1, 2025 నుంచి కొనుగోలు చేసే టికెట్లకు వర్తిస్తాయి. ఇంతకు ముందు కొనుగోలు చేసిన టికెట్ల ధరలు మాత్రం మారవు. ఈ మార్పులను అమలు చేయడానికి PRS, UTS, మాన్యువల్ టికెటింగ్ వ్యవస్థలను అప్‌డేట్ చేశారు.
నాన్-ఏసీ తరగతులు (నాన్-సబర్బన్ రైళ్లు)
సెకండ్ క్లాస్:
500 కిలోమీటర్ల వరకు జర్నీ ధరల్లో ఎలాంటి మార్పు లేదు
501-1500 కిలోమీటర్ల దూరం ప్రయాణానికి రూ. 5 పెరుగుదల.
1501-2500 కిలోమీటర్ల దూరానికి రూ. 10 పెరుగుదల
2501-3000 కిలోమీటర్ల దూరానికి రూ. 15 పెరుగుదల
కిలోమీటరుకు 0.5 పైసలు అదనంగా వసూలు చేస్తారు
స్లీపర్ క్లాస్: కిలోమీటరుకు 0.5 పైసలు పెరుగుదల.
ఫస్ట్ క్లాస్: కిలోమీటరుకు 0.5 పైసలు పెరుగుదల.
నాన్-ఏసీ మెయిల్/ఎక్స్‌ప్రెస్ సర్వీసులు
సెకండ్ క్లాస్: కిలోమీటరుకు 0.1 పైసలు పెరుగుదల
స్లీపర్ క్లాస్: కిలోమీటరుకు 0.1 పైసలు పెరుగుదల
ఫస్ట్ క్లాస్: కిలోమీటరుకు 0.1 పైసలు పెరుగుదల
ఏసీ తరగతులు (మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లు)
ఏసీ చైర్ కార్, 3-టైర్/3-ఎకానమీ, 2 టైర్, ఫస్ట్/ఎగ్జిక్యూటివ్ క్లాస్, ఎగ్జిక్యూటివ్ తరగతులకు కిలోమీటరుకు 0.2 పైసలు పెరుగుదల వర్తిస్తుంది. ఈ ధరలు వందే భారత్, తేజస్, రాజధాని, శతాబ్ది, దురంతో, హంసఫర్, అమృత్ భారత్, గతిమాన్, మహమాన, జన శతాబ్ది, యువ ఎక్స్‌ప్రెస్, అంత్యోదయ, ఏసీ విస్తాడోమ్ కోచ్‌లు, సాధారణ నాన్-సబర్బన్ సర్వీసులకు వర్తిస్తాయి.
అదనపు ఛార్జీలు
రిజర్వేషన్ ఫీజు, సూపర్‌ఫాస్ట్ సర్‌ఛార్జ్‌లు, ఇతర అదనపు ఛార్జీలు మారకుండా ఉంటాయి.
GST నిబంధనలు ప్రస్తుతం ఉన్న విధంగానే కొనసాగుతాయి.
ఫేర్ రౌండింగ్ నియమాలు యథాతథంగా ఉంటాయి.
ఈ పెరుగుదల ఎందుకు?
భారతీయ రైల్వేలు దేశంలోని అతి ముఖ్యమైన రవాణా వ్యవస్థలలో ఒకటిగా ఉంది. రోజూ లక్షలాది మంది ప్రయాణీకులు ఈ సేవలను ఉపయోగిస్తున్నారు. రైల్వే స్థిరత్వాన్ని కాపాడటానికి, సేవలను మరింత మెరుగుపరచడానికి ఈ స్వల్ప ధరల పెరుగుదల అవసరమని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ధరల సర్దుబాటు ఇండియన్ రైల్వే కాన్ఫరెన్స్ అసోసియేషన్ (IRCA) చేసిన ప్యాసింజర్ టేబుల్ ఆధారంగా జరిగింది.
ప్రయాణీకులు ఏం తెలుసుకోవాలి
జూలై 1, 2025 నుంచి కొనుగోలు చేసే టికెట్లకు కొత్త ధరలు వర్తిస్తాయి. అంతకు ముందు కొనుగోలు చేసిన టికెట్లకు ఈ మార్పులు వర్తించవు.
సబర్బన్ రైళ్లలో ప్రయాణించే వారికి ఎలాంటి ధరల పెరుగుదల లేదు. కాబట్టి రోజూ ప్రయాణించే వారికి ఇది ఊరట కలిగించే విషయమని చెప్పవచ్చు.
ఇవీ చదవండి:
కొత్త ఫ్లాష్ సేల్ ఆఫర్.. రూ.400కు 400 జీబీ డేటా
సిబిల్ స్కోర్ కారణంగా ఉద్యోగం తొలగింపు..
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి