Share News

Indian Nurse Nimisha: మర్డర్ కేసు.. నిమిషా ప్రియకు 16వ తేదీన ఉరి..

ABN , Publish Date - Jul 09 , 2025 | 08:55 AM

Indian Nurse Nimisha: 2023లో యెమెన్ సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ కూడా మరణ శిక్షను సమర్థించింది. నిమిషాను కాపాడ్డానికి ఆమె కుటుంబం ‘బ్లడ్ మనీ’కి సిద్ధమైంది. తలాల్ ఫ్యామిలీ 70 లక్షలు అడగ్గా.. విరాళాలతో ఆ మొత్తాన్ని జమకూర్చింది. అయితే, నిమిషా తరపు న్యాయవాది మధ్యలో దెబ్బ వేశాడు.

Indian Nurse Nimisha: మర్డర్ కేసు.. నిమిషా ప్రియకు 16వ తేదీన ఉరి..
Indian Nurse Nimisha

ఓ మర్డర్ కేసులో కేరళకు చెందిన నిమిషా ప్రియ అనే నర్సుకు యెమెన్ ప్రభుత్వం మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. నిమిషా ప్రియ ఉరికి సంబంధించి తేదీ ఖరారు అయింది. ఆమెను జులై 16వ తేదీన యెమెన్ ప్రభుత్వం ఉరి తీయనుంది. ఈ విషయం తెలిసి కేరళలోని ఆమె కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక, నిమిషా ఉరికి సంబంధించి భారత విదేశీ వ్యవహారాల శాఖ యెమెన్ ప్రభుత్వంతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులు సమీక్షిస్తున్నట్లు సమాచారం.


పాస్ పోర్టు కోసం గొడవ.. మర్డర్

కేరళకు చెందిన నిమిషా ప్రియ నర్సింగ్ పూర్తి చేసింది. 2008లో నర్సుగా పని చేయడానికి యెమెన్ దేశానికి వెళ్లింది. కొన్నేళ్ళ పాటు పలు ఆస్పత్రుల్లో పని చేసిన తర్వాత సొంతంగా ఓ క్లీనిక్ పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే 2014లో ఆమెకు తలాల్ అబ్దో మహది అనే వ్యక్తితో పరిచయం అయింది. యెమెన్ రూల్స్ ప్రకారం .. ఇతర దేశాల వాళ్లు ఆ దేశంలో బిజినెస్ చేయాలంటే.. స్థానికులను భాగస్వామిగా చేర్చుకోవాలి. అందుకే నిమిషా తన క్లినిక్ బిజినెస్‌లో భాగస్వామిగా తలాల్ అబ్దోను చేర్చుకుంది.


అయితే, క్లినిక్ ఓపెన్ చేసిన కొంత కాలానికే ఇద్దరి మధ్యా గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడు జైలు పాలయ్యాడు. 2016లో విడుదలై బయటకు వచ్చాడు. ఇక, అప్పటినుంచి ఆమెను వేధించటం మొదలెట్టాడు. ఆమె పాస్ పోర్టు తీసుకుని ఇబ్బంది పెట్టసాగాడు. రోజు రోజుకు అతడి వేధింపులు పెరిగిపోయాయి. నిమిషా తట్టుకోలేకపోయింది. పాస్ పోర్టుని తిరిగితీసుకోవడానికి మర్డర్ ప్లాన్ వేసింది. 2017లో ఇంజెక్షన్ వేసి అతడ్ని చంపేసింది. పాస్ పోర్టు తీసుకుని ఇండియాకు తిరిగి వస్తున్న సమయంలో ఆమెను యెమెన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2017నుంచి జైలు శిక్ష అనుభవిస్తోంది. 2018లో కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. మొదట జీవిత ఖైదు విధించింది.


తర్వాత దాన్ని మరణ శిక్షగా మార్చింది. 2023లో యెమెన్ సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ కూడా మరణ శిక్షను సమర్థించింది. నిమిషాను కాపాడ్డానికి ఆమె కుటుంబం ‘బ్లడ్ మనీ’కి సిద్ధమైంది. తలాల్ ఫ్యామిలీ 70 లక్షలు అడగ్గా.. విరాళాలతో ఆ మొత్తాన్ని జమకూర్చింది. అయితే, నిమిషా తరపు న్యాయవాది మధ్యలో దెబ్బ వేశాడు. తనకు 40 వేల డాలర్ల ఫీజు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. 2024 సెప్టెంబర్ నెలలో బ్లడ్ మనీ నిలిచిపోయింది. తనకు పూర్తి డబ్బులు ఇస్తేనే బ్లడ్ మనీ చర్చలు జరుపుతానని తేల్చి చెప్పాడు. రెండు విడతలుగా డబ్బులు చెల్లించడానికి అవకాశం ఇచ్చాడు. విరాళాల ద్వారా మొదటి విడత డబ్బులు జమకూర్చారు. రెండో విడత డబ్బులు జమకూర్చే దగ్గర సమస్యలు మొదలయ్యాయి. బ్లడ్ మనీ చర్చలు పూర్తవ్వలేదని సమాచారం. ఇప్పుడు నిమిషా ఉరి తేదీ కూడా ఖరారు అయింది.


ఇవి కూడా చదవండి

రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ట్రంప్ తీవ్ర అసహనం..

వాకింగ్.. రోజూ నడవడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

Updated Date - Jul 09 , 2025 | 01:58 PM