Putin US Relations: రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ట్రంప్ తీవ్ర అసహనం..
ABN , Publish Date - Jul 09 , 2025 | 07:42 AM
Putin US Relations: అమెరికా.. ఉక్రెయిన్‌కు ప్రత్యక్షంగా ఎంతో సాయం చేస్తోంది. ఆర్థికంగా ఆదుకోవటమే కాదు.. ఆయుధాలను కూడా పంపుతోంది. అయితే, అమెరికాలో ఆయుధాల నిల్వలు తగ్గటంతో ఉక్రెయిన్‌కు ఆయుధ సాయాన్ని గత కొన్ని రోజుల నుంచి ఆపేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ విషయంలో రష్యా తీరును.. తమ మాటను లెక్కచేయకపోవడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. పుతిన్‌కు ఎంత చెప్పినా పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ట్రంప్ మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పటినుంచి రష్యా తీరును తప్పుబడుతున్నారు. రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సార్లు ఉక్రెయిన్‌తో యుద్ధం గురించి పుతిన్‌తో చర్చలు జరిపారు. నెల రోజుల క్రితం ట్రంప్ పుట్టిన రోజున పుతిన్ ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. ఆ సమయంలో గంటకుపైగా ఇద్దరూ మాట్లాడుకున్నారు.
మాటల సందర్భంలో ట్రంప్ ఉక్రెయిన్ ప్రస్తావన తెచ్చారు. పుతిన్ దాని గురించి మాట్లాడటానికి ఆసక్తి చూపలేదు. మూడు రోజుల క్రితం కూడా ఇద్దరి మధ్యా ఫోన్ సంభాషణ జరిగింది. ట్రంప్ ఎన్నిసార్లు చెప్పినా.. ఎంత చెప్పినా పుతిన్ మాత్రం ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో వెనక్కు తగ్గటం లేదు. శాంతి ఒప్పందానికి ముందుకు రావటం లేదు. పుతిన్ తన మాటల్ని లెక్క చేయకపోవటాన్ని ట్రంప్ తీసుకోలేకపోతున్నారు. తాజాగా, వైట్ హౌస్‌లో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో పుతిన్‌పై అసహనం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ..
‘నిజం చెప్పాలంటే.. పుతిన్ మాకు తప్పుదారి పట్టించే సమాచారం ఇస్తున్నారు. ఆయన మాతో ఎప్పుడూ ఎంతో చక్కగా ప్రవర్తిస్తారు. అదంతా బూడిదలో పోసిన పన్నీరులా మారుతోంది. నేను దాని గురించే తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నాను. పుతిన్ మానవ హక్కుల్ని హరిస్తున్నాడు. ఎంతో మందిని చంపుతున్నాడు. అందుకే ఉక్రెయిన్‌కు ఆయుధాలను పంపుతున్నాను’ అని అన్నారు. కాగా, అమెరికా.. ఉక్రెయిన్‌కు ప్రత్యక్షంగా ఎంతో సాయం చేస్తోంది. ఆర్థికంగా ఆదుకోవటమే కాదు.. ఆయుధాలను కూడా పంపుతోంది. అయితే, అమెరికాలో ఆయుధాల నిల్వలు తగ్గటంతో ఉక్రెయిన్‌కు ఆయుధ సాయాన్ని గత కొన్ని రోజుల నుంచి ఆపేసింది. కానీ, మళ్లీ మనసు మార్చుకుని ఆయుధాలు పంపడానికి సిద్ధమైంది.