Piyush Goyal: నవంబరు కల్లా అమెరికాతో వాణిజ్య ఒప్పందం
ABN , Publish Date - Sep 03 , 2025 | 03:01 AM
అమెరికాతో వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని.. త్వరలోనే పరిస్థితులన్నీ చక్కబడతాయని.. నవంబరుకల్లా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ఆశిస్తున్నామని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు...
భారత్ ఎప్పుడూ డెడ్‌లైన్స్ పెట్టుకుని చర్చలు జరపదు: పీయూష్ గోయల్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: అమెరికాతో వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని.. త్వరలోనే పరిస్థితులన్నీ చక్కబడతాయని.. నవంబరుకల్లా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ఆశిస్తున్నామని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ముంబైలో జరుగుతున్న అంతర్జాతీయ పెట్టుబడిదారుల వార్షిక సదస్సును ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించిన గోయల్.. భారత్‌తో వాణిజ్య, వ్యాపార సంబంధాలను పెంచుకోవాలనే ఆసక్తి, ఉత్సాహం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోందని అన్నారు. ఈయూతో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు కూడా చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు. అలాగే.. అంతకుముందు మరో కార్యక్రమంలో మాట్లాడుతూ అమెరికాతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. అయితే, భారతదేశం ఎప్పుడూ డెడ్‌లైన్స్ పెట్టుకొని వాణిజ్య చర్చలు జరపదని.. పరస్పర ప్రయోజనకరంగా ఉండే ఒప్పందాలపై మాత్రమే చర్చలు జరుపుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇండియా సరఫరా వ్యవస్థలు చాలా బలంగా ఉన్నాయని.. వేరే ఏ ఇతర దేశ దయాదాక్షిణ్యాలపైనా మనం ఆధారపడి లేమని ఆయన తేల్చిచెప్పారు. చిలీ, పెరు, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఓమన్ వంటి దేశాలతో కూడా కొత్త వాణిజ్య ఒప్పందాలను భారత్ కుదుర్చుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా, సుంకాలు, ఇంధన విధానాలపై విభేదాలు ఉన్నప్పటికీ.. రెండు గొప్ప దేశాలైన ఇండియా, అమెరికా బంధానికి బలమైన పునాదులు ఉన్నాయని.. ఈ సమస్యను ఇరు దేశాలూ పరిష్కరించుకుంటాయని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ అన్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ విలువలు.. రష్యా, చైనా కన్నా అమెరికా విలువలకు దగ్గరగా ఉంటాయని ‘ఫాక్స్ న్యూస్’ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మణిపూర్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ..!
ఏపీ మహేష్ బ్యాంక్‌కు షాక్ ఇచ్చిన ఈడీ
For More National News And Telugu News