Genetically Modified Rice: దేశంలో తొలిసారిగా జన్యు సవరణ వరి
ABN , Publish Date - May 05 , 2025 | 04:37 AM
దేశంలో తొలిసారిగా జెన్యుటిక్ సవరణతో ఉన్న ‘కమల’ మరియు ‘పూస’ అనే రెండు వరి విత్తనాలను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీలో విడుదల చేశారు. ఈ విత్తనాలు అధిక దిగుబడిని అందిస్తూ, ప్రతికూల వాతావరణానికి ఎదుర్కొనే సామర్థ్యంతో ఉన్నాయని వివరించారు
ఐకార్ అభివృద్ధి చేసిన రెండు రకాల విత్తనాలు ‘కమల’, ‘పూస’ విడుదల
ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునే శక్తి
త్వరలో అందుబాటులోకి: చౌహాన్
హైదరాబాద్, మే 4(ఆంధ్రజ్యోతి): దేశంలో తొలిసారిగా జన్యు సవరణ వరి విత్తనాలను కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ఢిల్లీలో విడుదల చేశారు. ‘డీఆర్‌ఆర్ ధన్ 100 (కమల)’, ‘పూస (డీఎస్‌టీ రైస్ 1)’ అనే ఈ విత్తనాలను వాతావరణ సమస్యలను తట్టుకునేలా, 20 నుంచి 30 శాతం వరకు అధిక దిగుబడి సాధించేలా భారత వ్యవసాయ పరిశోధనా మండలి(ఐకార్) అభివృద్ధి చేసింది. భారత వ్యవసాయ రంగంలో ఇది చాలా ముఖ్యమైన రోజు అని, ఈ రెండు రకాల విత్తనాలను త్వరలో రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని చౌహాన్ తెలిపారు. వీటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ లాంటి ప్రధాన వరి ఉత్పత్తి రాష్ట్రాల్లో సాగు చేయాలని సూచించారు.
ఎక్కువగా సాగు చేసే సాంబమసూరి(బీపీటీ- 5204), ఎంటీయూ- 1010 (కాటన్‌దొర సన్నాలు)లను శాస్త్రవేత్తలు అభివృద్ధిచేసి కొత్త రకాలను రూపొందించారని వివరించారు. కొత్త రకాలు రెండూ సాధారణ రకాల కంటే 20 రోజుల ముందే పండుతాయని, తద్వారా కోతలు ముందే పూర్తయి.. పంట మార్పిడి విధానానికి అవకాశం కలుగుతుందన్నారు.